Mayor nannapuneni Narender
-
నగరాన్ని టాప్‌లో నిలబెడుదాం
స్వచ్ఛ సర్వేక్షన్పై 12 వరకు విస్తృతంగా ప్రచారం చేయండి పౌర స్పందనతోనే మెరుగైన ర్యాంకు మేయర్ నన్నపునేని నరేందర్ వరంగల్ అర్బన్ : స్వచ్ఛత యాప్ డౌన్లోడ్, స్వచ్ఛ సర్వేక్షన్ 1969 టోల్‌ఫ్రీ కాల్లో పౌరులందరినీ భాగస్వామ్యం చేసి వరంగల్‌ను టాప్‌టెన్‌లో నిలబెడుదామని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ మేరకు శనివారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కారోబార్లు, ఉద్యోగులతో మేయర్ వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి స్వచ్ఛ సర్వేక్షన్–2017 పోటీల వివరాలను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పోటీ పడుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా చారిత్ర క ఓరుగల్లు ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఇనుమడింప చేయాలన్నారు. ఈనెల 12 వ తేదీ వరకు ఆండ్రాయిడ్ మొబైల్ కలిగిన ప్రతి పౌరుడు స్వచ్ఛత యాప్ డౌన్లోడు చేసుకునే విధంగా చూడాలన్నారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ 1969 మిస్డ్ కాల్ చేసి, 1 నెంబరుతో ఫీడ్ బ్యాక్ ఇచ్చే విధంగా చూడాలన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఝాన్సీ లక్ష్మి, మిర్యాల్ కార్ దేవేందర్, దామోదర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గందరగోళం సృష్టించేందుకే ప్రతిపక్షాల రాద్ధాంతం
ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల పునర్విభజన వరంగల్ నగరంలో జిల్లాల విభజనపై పునరాలోచించాలని సీఎంకు విన్నవిస్తాం వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ న్యూశాయంపేట : ప్రజలను గందరగోళపరిచేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రజాభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టారని వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. నయీంనగర్‌లోని టీఆర్ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో శనివారం గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేపట్టారని, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ముఖ్యమంత్రి జిల్లాపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారన్నారు. ఏదో మునిగిపోయినట్టు కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బంద్‌కు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. చారిత్రాత్మక నగరాన్ని రెండుగా విభజించకుండా ఒక్కటిగా ఉంచేందుకు ముఖ్యమంత్రిని మరోసారి కలిసి విన్నవిస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేవలం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను మాత్రమే విడుదల చేశారని, ప్రజల అభిప్రాయ సేకరణ కోసం నెల రోజుల గడువు ఇచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించడంపై పునరాలోచించాలని కోరుతూ లిఖితపూర్వకంగా కేసీఆర్‌కు లేఖ ఇస్తామన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా నష్టపోయిందని, అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకొని జిల్లాల పునర్విభజన చేపట్టారన్నారు. సమావేశంలో వరంగల్ నగరాన్ని హన్మకొండ జిల్లాగా విభజించే విషయంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో విభజన విషయంలో గందరగోళంలో ఉన్నట్లు కనిపించింది. విలేకరుల సమావేశంలో తాడు గౌరవ అద్యక్షుడు గుడిమల్ల రవికుమార్, మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బోడా డిన్నా,చింతల యాదగిరి, రాజు, టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
నరేంద్రుడా రా...
మేయర్‌ను ఆప్యాయంగా పలకరించిన సీఎం వరంగల్ అర్బన్ : వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. వరంగల్ గ్రేటర్ మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన నరేందర్ పుష్పగుచ్ఛం అందజేసి తనకు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపా రు. మేయర్ నరేందర్ రెండు చేతులతో నమస్కా రం పెట్టుకుంటూ సీఎం వద్దకు వెళ్లగా.. ఆయన నరేంద్రుడా రా.... అంటూ అప్యాయంగా పలకరి స్తూ ఆలింగనం చేసుకుని అభినందించారు. ఆ క్షణాలు మరువలేను : నరేందర్ సీఎం కేసీఆర్‌ను కలిసిన క్షణాలు మరువలేనివని గ్రేటర్ మేయర్ నన్నపనేని నరేందర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. తనను సీఎం ఆలింగనం చేసుకుని అభినందించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. సీఎం ఆశీర్వచనాలు, అభినందనలు ఎల్లవేళలా గుర్తుంటాయని తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్‌ను డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ వెంట ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, మేయర్ సతీమణి వాణి, కుమారుడు ఉన్నారు. అనంతరం జిల్లా మంత్రి చందూలాల్‌ను కూడా మేయర్ నన్నపునేని నరేం దర్ ఎమ్మెల్యేలతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.