పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. ఐదుగురు దుర్మరణం | Tractor lorrry Dhee..five members killed | Sakshi
Sakshi News home page

పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. ఐదుగురు దుర్మరణం

Published Sun, Aug 21 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. ఐదుగురు దుర్మరణం

పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. ఐదుగురు దుర్మరణం

ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు/ మైదుకూరు టౌన్‌: వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న పెళ్లి ట్రాక్టర్‌ను లారీ ఢీ కొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 22 మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. దువ్వూరు మండలం కృష్ణంపల్లె గ్రామానికి చెందిన అనూష, ఎర్రగుంట్ల మండలం, వలసపల్లెకు చెందిన రఘుల వివాహం ఆదివారం దేవుని కడపలో జరగాల్సి ఉండింది.

ఈ మేరకు శనివారం రాత్రి 11 గంటల సమయంలో కృష్ణంపల్లె గ్రామం నుంచి పెళ్లి కుమార్తె తరపున బంధువులందరూ రెండు ట్రాక్టర్‌లలో దేవుని కడపకు బయలుదేరారు. పెళ్లికుమార్తె ప్రయాణిస్తున్న టాటా సుమో వాహన ంతో పాటు ఒక ట్రాక్టర్‌ ముందు వెళ్లాయి. మరో ట్రాక్టర్‌లో సుమారు 38 మంది కొంత ఆలస్యంగా బయలుదేరారు. జాతీయ రహదారిలోని ఎంకుపల్లె సమీపంలోకి వెళ్లగానే డీజల్‌ అయిపోవడంతో ట్రాక్టర్‌ ఆగిపోయింది. దీంతో డ్రైవర్‌ బాలరాజు ట్రాక్టర్‌ను రోడ్డు పక్కన నిలిపాడు.

ముందు ట్రాక్టర్‌లో వెళ్లిన వారు మైదుకూరులో నిలుపుకున్నారు. అయితే ఎంత సేపటికీ బాలరాజు ట్రాక్టర్‌ రాకపోవడంతో వారు ఫోన్‌ చేశారు. డీజల్‌ అయిపోవడంతో నిలుపుకున్నామని చెప్పగా అయితే డీజల్‌ తీసుకొని వస్తామని వారు చెప్పారు. ఒక వ్యక్తి మైదుకూరులో డీజల్‌ తీసుకొని బైక్‌లో బయలుదేరాడు. ఇంతలో కర్నూలు జిల్లా చాగలమర్రి వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఆగి ఉన్న పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీ కొంది. దీంతో ట్రాక్టర్‌ ట్రాలీలో కూర్చున్న వారిలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ గంపాబాలరాజు(31), ఆలకుంట్ల వెంకటరమణ(23), బత్తల లక్ష్మీప్రసన్న(8) లు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్, ఇతర వాహనాల్లో ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆలగుంట్ల పెద్ద పెద్దయ్య(34), గంపా బాలకృష్ణ(22) మృతి చెందారు. మరో 22 మంది తీవ్ర గాయాలతో కడప, తిరుపతి, కర్నూలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రొద్దుటూరు ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సందర్శించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement