విద్యార్థినులకు కళలపై శిక్షణ
విద్యార్థినులకు కళలపై శిక్షణ
Published Thu, Feb 9 2017 12:34 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
ఏలూరు (సెంట్రల్) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు త్వరలో కూచిపూడి, భరతనాట్యం వంటి 68 కళల్లో శిక్షణ ఇస్తామని, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని ఏపీ ఫౌండేషన్ కోర్సు సలహాదారు ఆర్.రవీంద్ర అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం ద్వారా 2020 నాటికి మొదటి 10 ర్యాంకులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో త్వరలో కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కామన్ సిలబస్‌ను ప్రవేశపెట్టనుందని, దీని ద్వారా ఏ జిల్లాలో విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారనే అంచనాకు వచ్చి వారికి మెరుగైన విద్యనందిస్తామని చెప్పారు.
16 కేంద్రాల్లో ఫౌండేషన్ కోర్సు
రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో అడ్వా న్స్ ఫౌండేషన్ కోర్సును ప్రారంభించామని రవీంద్ర చెప్పారు. హైస్కూల్స్‌లో మౌలిక సదుపాయాల నిమిత్తం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, ఉపాధ్యాయులు కావాల్సిన సదుపాయాల నిమిత్తం తమకు నివేదిక ఇస్తే 48 గంటలలోపు మంజూరు చేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ వై.సాయిశ్రీకాంత్ మాట్లాడుతూ ఏడు హైస్కూళ్లలో విద్యార్థుల చేరిక పెరిగిందని, 10వ తరగతి ఫలితాల్లో 93 శాతం వచ్చిందన్నారు. అన్ని పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
Advertisement