నిరసన జ్వాల | trs party movement for mallanna sagar project haters | Sakshi
Sakshi News home page

నిరసన జ్వాల

Published Wed, Jul 27 2016 2:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నిరసన జ్వాల - Sakshi

నిరసన జ్వాల

ఉద్రిక్తంగా మారిన చలో మల్లన్న సాగర్
కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టు
మాజీ మంత్రి  సుదర్శన్‌రెడ్డి గృహ  నిర్బంధం
డీసీసీ అధ్యక్షుడు సహా పలువురు హౌస్ అరెస్టు
కోదండరాం తదితరులకు  వ్యతిరేక నినాదాలు
పలుచోట్ల ప్రతిపక్షాల దిష్టిబొమ్మలు దహనం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : చలో మల్లన్న సాగర్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు ఆదివారం రాత్రి నుంచి కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టారు. సోమవారం ఉదయం నుంచి అరెస్టుల పరంపర కొనసాగించిన పోలీసులు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో మల్లన్న సాగర్’కు వెళ్తున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కేశ వేణు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, ఐఎన్‌టీయుసీ నేత వెంకులు తదితరులను అడ్డుకున్నారు.

వారిని సుదర్శన్‌రెడ్డి ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఇంట్లో ఆయనతోపాటు కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఖుద్దూస్, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు సాగర్, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు విఫుల్‌గౌడ్, సుమీర్ తదితరులను పోలీసు గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. కాగా.. గృహ నిర్బంధం చేయడంపై మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో తన ఇంట్లోనే నిరసన తెలిపారు.

 పలుచోట్ల కాంగ్రెస్ నేతల అరెస్టు
నిరసన ప్రదర్శనలు చేయకుండా బీర్కూర్ మండలంలో సుమారు 10 మంది కాంగ్రెస్ నాయకులు ముందస్తు అరెస్టు చేశారు. కోటగిరిలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం తీరుకు నిరసనగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షుడు నరేశ్ జాదవ్, బాల్కొండ మాజీ ఎంపీపీ రాజేశ్వర్ సహా 25మంది కాంగ్రెస్ నాయకులను డిచ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచికత్తుపై విడుదల చేశారు. కాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన కోసం బయలుదేరిన బాల్కొండ నియోజకవర్గ నాయకులను ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాల్కొండ నుంచి మాజీ ఎంపీపీ జక్క రాజేశ్వర్, జెడ్పీటీసీ భర్త నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నడ్పిన్న, కమ్మర్‌పల్లి మాజీ చైర్మన్ రవిలను అదుపులోకి తీసుకున్నారు.

కోదండరాం సహా ప్రతిపక్షాల దిష్టిబొమ్మల దహనం
మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడంపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం భగ్గుమన్నారు. ప్రొఫెసర్ కోదండరాం సహా కాంగ్రెస్, టీడీపీ, ప్రతిపక్ష పార్టీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మండల కేంద్రం, బీర్కూర్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి ఎక్స్‌రోడ్డు, వర్నీ మండల కేంద్రం, కోటగిరి మండల కేంద్రాల్లో మల్లన్నసాగర్‌పై కాంగ్రెస్, టీడీపీతోపాటు ప్రొఫెసర్ కోదండరాంలు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ నాయకులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల దిష్టిబొమ్మలను, ప్రొఫెసర్ కోదండరాం దిష్టి బొమ్మను దహనం చేసి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు అడ్డుకునే విపక్షాల యత్నంపై బోధన్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు మండి పడ్డాయి.

కాంగ్రెస్, టీడీపీ, ప్రొఫెసర్ కోదండరాం దిష్టిబొమ్మల దహనం చేశారు. బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అబిద్, మండల అధ్యక్షుడు సంజీవ్, ముఖ్యనేత తూము శరత్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, సొసైటీ చైర్మన్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని నిజామాబాద్ వెళ్లె ప్రధాన రహదారిలో గల సాటాపూర్ గేట్ వద్ద ప్రతిపక్ష పార్టీలు, ప్రొఫెసర్ కోదండరాం దిష్టిబొమ్మను దహనం చేశారు. నవీపేట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీడీపీ, టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.

పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌లో నియోజకవర్గ స్థాయిలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రైతు విభాగం అధ్యక్షుడు సురేందర్‌రెడ్డితోపాటు నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజాంసాగర్‌లో ప్రతిపక్షాల తీరుపై భగ్గుమన్న టీఆర్‌ఎస్ నాయకులు టీడీపీ, కాంగ్రెస్ దిష్టిబొమ్మలను గాడిదపై ఊరేగించి దహనం చేశారు. ఎల్లారెడ్డి మండలంలో కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement