
తుళ్లూరు మండలంలో నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం తుళ్లూరు మండలం మల్కాపురం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదనే కారణంతో మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె చినచంద్రశేఖర్ అనే రైతుకు చెందిన 4 ఎకరాల 79 సెంట్లలోని చెరకు తోటను కొందరు దుండగులు గురువారం రాత్రి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో రాజధాని నిర్మాణానికి భూములివ్వని అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది డిసెంబర్‌లో భూ సమీకరణ విధానాన్ని వ్యతిరేకించిన ఐదు గ్రామాలకు చెందిన 13 మంది రైతుల పొలాల్లో వారి వ్యవసాయ పరికరాలను దుండగులు తగులబెట్టారు. ఆ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఆ కేసులో కూడా పోలీసులు ఎలాంటి చ ర్యలు తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో గురువారం అగ్నికి ఆహుతైన పంట పొలాన్ని పరిశీ లించడమే కాకుండా బాధిత రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.