సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రభాకర్
కొండాపూర్: మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్దాంతం చేస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులపై మహారాష్ట్రతో జరిగిన ఒప్పందం చారిత్రాత్మకమైనదన్నారు.తహాసీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం రంజాన్ పర్వదినం, సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజనులకు, మసీద్‌ల సదర్‌లకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ది చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.గత సమైక్య రాష్ట్రంలో ఎన్నో విధాలుగా నష్టపోయామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందని ఆంధ్ర పాలకులు దుష్ప్రచారం చేశారన్నారు. కానీ నేడు తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో వ్యవసాయానికి 12 గంటల విద్యుత్‌ను అందిస్తునామన్నారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి 7 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఒకవైపు ప్రభుత్వం కృషి చేస్తుంటే మరోవైపు ప్రతిపక్షాలు ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా అమలు కానీ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలోనూ మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.
కాగా ఎస్సీ కార్పొరేషన్‌ద్వారా మంజూరైన ఆటోలను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ విఠల్, మండల ఉపాధ్యక్షురాలు జ్యోతిరాజేంద్రప్రసాద్, జెడ్పీకో ఆప్షన్ సభ్యులు అమీనోద్దిన్, సర్పంచ్ రుక్మోద్దిన్, తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ స్వప్న, డిప్యూటీ తహసీల్దార్ శ్రీశైలం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మైనార్టీ, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.