16న ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభోత్సవం
16న ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభోత్సవం
Published Sat, Aug 13 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
– తాత్కాలికంగా ఉస్మానియాలో ఏర్పాటు
– మంత్రి గంటా, డీప్యూటీ సీఎం కేఈ హాజరు
– 1.70 లక్షల రూపాయలు విడుదల
– ఇన్‌చార్జి రిజిస్ట్రార్ బి.అమర్‌నాథ్ వెల్లడి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉస్మానియా కళాశాలలో తాత్కాలిక ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభోత్సవాన్ని 16వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ బి.అమర్‌నాథ్ వెల్లడించారు. ప్రారంభోత్సవానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి హాజరవుతారన్నారు. తరగతులు 17 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శుక్రవారం ఆర్‌యూలోని సెనేట్ హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు.
రెండేళ్లలో పక్కాభవనాలు రెడీ
ఓర్వకల్లు సమీపంలోని ఎడ్యుకేషనల్ హబ్‌లో ఉర్దూ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను కేటాయించినట్లు అమర్‌నాథ్ చెప్పారు. వాటితో రెండేళ్లలో పక్కాభవనాలు పూర్తి చేసి అక్కడికి యూనివర్సిటీ తరలిస్తామన్నారు. ఉస్మానియా డిగ్రీ కళాశాలలో తాత్కాలికంగా 1.70 కోట్లతో రెండేళ్ల పాటు వర్సిటీ కార్యాకలాపాలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడ విద్యార్థులకు కావాల్సిన తరగతి గదులు, కార్యాలయాలకు సబంధించి అన్ని రకాల సదుపాయలను కల్పించామన్నారు. లైబ్రేరీ కోసం పుస్తకాలను కూడా కొనుగోలు చేసినట్లు వివరించారు.
ఆరు కోర్సులతో ప్రారంభం..
ఉర్దూ యూనివర్సిటీ మొత్తం ఆరు కోర్సులతో ప్రారంభం అవుతోందని పేర్కొన్నారు. ఇందులో యూజీ స్థాయిలో బీఏ, బీకామ్, బీఎస్సీ, పీజీ స్థాయిలో ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ఉర్దూ, ఎంకామ్ కోర్సులు ఉన్నట్లు చెప్పారు. ఆయా కోర్సులకు మొత్తం 87 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ అతితక్కువ ఫీజుతో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక విద్యార్థులకు హాస్టల్ సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్లు చెప్పారు.
కాంట్రాక్ట్ బేసిక్‌పై అధ్యాపకుల నియామకం
ప్రస్తుతం యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు లేకపోవడంతో రెగ్యులర్‌గా ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసుకునేందుకు వీలేదన్నారు. దీంతో కాంట్రాక్ట్, విజిటింగ్, గెస్టు ఫ్యాకల్టీలను తాత్కాలికంగా నియమించుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 8 మంది కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను నియమించామన్నారు. మిగిలిన వారిని అసవరం మేరకు తీసుకుంటామని వివరించారు.
Advertisement