చీరకట్టి ..మొక్కు తీర్చి
- సంతెకొడ్లూరులో వింత ఆచారం
- భక్తి శ్రద్ధలతో కామప్ప దహనం
ఆదోని రూరల్: కొరికలు నెరవేరితే సాధారణంగా కొబ్బరికాయలు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, జంతుబలి ఇవ్వడం పరిపాటి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఆదోని మండలం సంతెకొడ్లూరు వాసులు ఏడాదిలో ఓ ప్రత్యేక దినాన ఆడవారిగా మారుతారు.. కోరికలు నెరవేర్చిన దేవునికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది బయటి వారికి వింతగా అనిపించినా గ్రామంలో అనాది నుంచి వస్తున్న ఆచారమని కామప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు సాగర్‌శరణ బసప్ప చెబుతున్నారు.
ఏటా రంగోలి(కామప్ప పౌర్ణమి)ని పురస్కరించుకొని గ్రామ ప్రజలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఆరాధ్యదైవం రతీమన్మధ స్వామి(కామప్ప)కి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఏడాదికి సంబంధించి మొదటిరోజు ఆదివారం రతీమన్మధులకు పూజా కార్యక్రమాలతో పాటు గుర్రాలు, ఏనుగుల ప్రదర్శనలు చేపట్టారు. రెండో రోజు సోమవారం ఉదయం హరిజనవాడ నుంచి నిప్పును తీసుకొచ్చి గుంతలో వేసి కామప్పను దహనం చే శారు. సాయంత్రం శస్త్రం వేయుట, బొమ్మల ప్రదర్శన, వివిధ వేషధారణలో కామప్ప శవయాత్ర (విమాన్ ప్రదర్శ) తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఎద్దుల సంత నిర్వహణ
స్వామివారి రథోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఎడ్ల సంతను నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా అమ్మకానికి ఎడ్లను ఈ సంతకు తీసుకొస్తున్నారు. మూడు రోజులపాటు ఈ సంత జరుగుతోంది. ఇక్కడ ఎడ్లను కొన్నట్లైతే వాటికి అనారోగ్యం రాకుండా ఉండడమే కాకుండా పంట దిగుబడులు ఆశాజనకంగా వస్తాయని భక్తుల నమ్మకం.