మార్మోగిన వేదఘోష
-
ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు
-
వాడపల్లి వెంకన్న ఆలయానికి తరలివచ్చిన భక్తులు
వాడపల్లి (ఆత్రేయపురం) :
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు కన్నుల పండువగా జరిగిన పవిత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించింది. శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి త్రయాహ్నిక దీక్షాపూర్వక పవిత్రోత్సవాలను పశ్చిమ గోదావరి జిల్లా నడిపూడి గ్రామానికి చెందిన వేదపండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాశాంతి హోమం, మహాపూర్ణాహుతి, పండిత సత్కారం, నీరాజనంతో ఉత్సవాలు ముగిశాయి. పవిత్రోత్సవాలకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యాన రాధాకృష్ణ, సాయిరామ్, శివాలయ కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు.