‘ఏకో’దంతుడికి జై
భక్తుల చేత పూజలు అందుకునేందుకు పార్వతీనందుడు రానున్నాడు.
విగ్రహాల తయారీలో విషపూరిత రసాయనాలు
పర్యావరణానికి నష్టమంటున్న పర్యావరణ వేత్తలు
బంకమట్టితో విగ్రహాల తయారీలో నిమగ్నమైన కోల్‌కత్త వాసులు
భక్తుల చేత పూజలు అందుకునేందుకు పార్వతీనందుడు రానున్నాడు. వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వాడవాడలా కొలువుదీరేందుకు బొజ్జగణపయ్య సిద్ధమవుతున్నాడు. వివిధ రూపాలలో దర్శనమిచేందుకు ఏకదంతుడు సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతున్నాడు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా వినాయకుడి విగ్రహాల తయారీ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసం వలస వచ్చిన పలువురు కళాకారులు ఈ పనిలో తలమునకలుగా ఉన్నారు. అయితే విగ్రహాల తయారీలో ప్రమాదకర విషపూరిత రసాయనిక రంగులు వాడడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. వినాయక ప్రతిమల తయారీలో సహజసిద్ధమైన రంగులతో పాటు నీటిలో సులువుగా కరిగిపోయే బంకమట్టి తదితర పదార్థాలను వినియోగించాలని సూచిస్తున్నారు.
- హిందూపురం అర్బన్:
ప్రతి ఏటా వినాయక చవితి పండుగ అనంతరం నీటిలో కరగని వ్యర్థాలతో చెరువులు, కాలువలు నిండిపోతున్నాయి. అంతేకాక ఆ విగ్రహాల తయారీకి వినియోగిస్తున్న రసాయనిక రంగుల ప్రభావం వల్ల నీటి కాలుష్యం పెరిగిపోతోంది. ఆ నీటిని వినియోగిస్తే చర్మవ్యాధులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విగ్రహాల తయారీలో ప్లాస్టర్‌ఆఫ్ ప్యారీస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ రసాయనిక పదార్థం నీటిలో కరగకుండా అలాగే ఉండిపోతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. పూజా, అలంకరణ సామగ్రిలోనూ ప్లాస్టిక్ పూలు, ఇతర పదార్థాలు కాకుండా సహజసిద్ధంగా లభ్యమయ్యే వాటినే వినియోగించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
బంకమట్టి, వరిగడ్డి, కర్రల వస్తువులు
వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో పర్యావరణ హితకారి వినాయక ప్రతిమల తయారీ ముమ్మరంగా సాగుతోంది. కోల్‌కత్తాకు చెందిన పలువురు కుటుంబసభ్యులతో సహా ఇక్కడకు వలసవచ్చి వినాయక ప్రతిమల తయారీలో నిమగ్నమయ్యారు. నాలుగు నుంచి 14 అడుగుల ఎత్తుతో చూడముచ్చటగా ఉన్న వినాయకుడి ప్రతిమల తయారీకి వీరు వరిగడ్డి, బంకమన్నుతో పాటు నీటిలో సులువుగా కరిగిపోయే సహజసిద్ధమైన రంగులనే వాడుతున్నారు. వీరి ఉత్పత్తులకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకూ కొనుగోలుదారులు చెల్లిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు.
నీటిలో కరిగి పదార్థాలే వాడుతున్నాం
పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని విగ్రహాల తయారీ చేపట్టాం. ప్రత్యేక మట్టి, రంగులు, అచ్చులు కోల్‌కత్తా నుంచి తీసుకువస్తున్నాం. వరిగడ్డి, వెదురు బొంగులు స్థానికంగా సమకూర్చుకుంటున్నాం. నాలుగు నెలలుగా ఇక్కడే ఉంటూ విగ్రహాలు తయారు చేస్తున్నాం.
- బి.ఎం.పాల్ నదియా, కోల్‌కత్తా


