విరేచనాలు..వాంతులు | viral feavours | Sakshi
Sakshi News home page

విరేచనాలు..వాంతులు

Published Thu, Jul 28 2016 9:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

విరేచనాలు..వాంతులు

విరేచనాలు..వాంతులు

 
  • సిరిసిల్లలో ప్రబలుతున్న జ్వరాలు
  • ఇంటికొకరు జ్వరపీడితులు
  • కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
  • సర్కార్‌ ఆస్పత్రిలో మందుల కొరత
సిరిసిల్ల : జ్వరంతో బాధపడుతూ.. ఒకే మంచంలో సొమ్మసిల్లిన ఈ ఇద్దరు చిన్నారుల పేర్లు గజ్జెల్లి శాంతిప్రియ(6), శరణ్య(4). సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన లత, శ్రీనివాస్‌ దంపతుల సంతానం. ఆరు రోజులుగా జ్వరం, వాంతులతో బాధపడుతున్నారు. స్థానికంగా ఆర్‌ఎంపీ వైద్యుడికి చూపించారు. ఎంతకూ తగ్గకపోవడంతో గురువారం సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చారు. కానీ ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేవు. దీంతో ఒకే మంచంలో ఇద్దరు పిల్లలను పడుకోబెట్టి వైద్యం చేయిస్తున్నారు. ఆటో నడిపే శ్రీనివాస్, బీడీలు చుట్టే లత ఇద్దరు చిన్నారులు అనారోగ్యంతో మంచం పట్టడంతో తల్లడిల్లిపోతున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ పిల్లల పేర్లు కారంపురి ప్రణవ్‌(6), తేజ(8). పట్టణంలోని ప్రగతినగర్‌కు చెందిన ఇద్దరు అబ్బాయిలు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ పిల్లల తల్లి స్రవంతి బీడీ కార్మికురాలు, తండ్రి సత్యనారాయణ డైయింగ్‌ కార్మికుడు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించే స్థోమత లేక ప్రభుత్వాస్పత్రిలో చేరారు. 
ఈ బాబు  సుభాష్‌నగర్‌కు చెందిన అభినవ్‌. మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వాంతులు, విరేచనాలు తగ్గక, జ్వరం కూడా రావడంతో అభినవ్‌ ఇబ్బంది పడుతున్నాడు.
ఆస్పత్రులు కిటకిట 
సిరిసిల్లలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇంటికొకరు జ్వరపీడితులు ఉన్నారు. నిత్యం 50 మంది వరకు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సిరిసిల్ల మండలం రామచంద్రాపూర్‌కు చెందిన బత్తుల సంజయ్‌(11) జ్వరంతో సొమ్మసిల్లి పడిపోయాడు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన దుగ్గం అశ్విత్‌(7) జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌ ఇందిరమ్మకాలనీకి చెందిన తోట రక్షానంద్‌(6) జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. బద్దెనపల్లికి చెందిన నంగునూరు పూజిత(14) జ్వరంతో బాధపడుతుంది. కొత్తగా వర్షం నీరు రావడంతో డయేరియా ప్రబలుతోంది. వంద పడకల ఆస్పత్రిలో మంచాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకే మంచంలో ఇద్దరి చొప్పున రోగులకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం 70 మంది వరకు జ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు అడ్మిట్‌ అయ్యారు. ఇంతకు రెట్టింపు స్థాయిలో ప్రైవేటు ఆస్పత్రులు, ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద చికిత్స పొందుతున్నారు. భారీ సంఖ్యలో రోగులు రావడంతో ఆస్పత్రిలో మందుల కొరత ఏర్పడింది.  
ముందు జాగ్రత్తే మేలు 
డాక్టర్‌ గూడూరి రవీందర్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 
వైరల్‌ ఫీవర్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. వాంతులు, విరేచనాలు ఉన్నాయి. రెండు రోజులుగా రోజూ 50 మంది వస్తున్నారు. మందుల కొరత ఏమీ లేదు. ముందుచూపుతో రెండో క్వార్టర్‌ మందులకు ఇండెంట్‌ ఇచ్చాము. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బయటి ఆహారం తీసుకోవద్దు. దోమలు, ఈగలు వాలకుండా జాగ్రత్త పడాలి. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement