విష్ణు చక్రం!
జెడ్పీ పీఠం చుట్టూ రాజకీయం
- చైర్మన్ మార్పునకు అధికార పార్టీలోనే పోరు
- మంత్రాంగం మొదలుపెట్టిన కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణు?
- తన మనిషికి పదవి కట్టబెట్టే ప్రయత్నం
- ఒప్పందం మేరకు తనకే ఇవ్వాలని పుష్పావతి పట్టు
- తాజాగా తెరపైకి వాల్మీకులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా పరిషత్ చైర్మన్‌ను గద్దె దించేందుకు మంత్రాంగం మొదలయ్యింది. ఇందులో భాగంగా కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్దన్ రెడ్డి రంగంలోకి దిగినట్టు సమాచారం. తన వర్గానికి చెందిన జెడ్పీటీసీని చైర్మన్ చేయించుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. మరోవైపు ఒప్పందం మేరకు తమకే చైర్మన్ పదవి ఇవ్వాలని పుష్పావతి తీవ్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే డిప్యూటీ సీఎంతో పాటు ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌లను కలుస్తున్నారు. తనకే అవకాశం ఇప్పించాలని ఆమె కోరుతున్నారు. ఇదే నేపథ్యంలో తమకు అవకాశం కల్పించాలంటూ వాల్మీకి వర్గానికి చెందిన జెడ్పీటీసీలు కూడా పావులు కదుపుతున్నట్టు సమాచారం. గతంలో తమ వర్గానికి చెందిన వెంకటప్పనాయుడుకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తప్పించారని.. ఇప్పుడైనా ఆ తప్పిదాన్ని సరిచేసుకోవాలని అధికార పార్టీని కోరుతున్నారు. ఈ విధంగా ఎవరికి వారు జెడ్పీ చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
రంగంలోకి విష్ణు
జెడ్పీ చైర్మన్ మార్పు వ్యవహారంలో విష్ణువర్దన్ రెడ్డి తన అనుచరులతో మాట్లాడినట్టు తెలిసింది. చైర్మన్ మార్పు వ్యవహారం నిజమేనని.. ఇదే సందర్భంలో కోడుమూరు నియోజకవర్గానికి చెందిన తమకే పదవి వచ్చేలా చేసుకుందామని పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాకుండా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మనస్ఫూర్తిగా సహకరించారని విష్ణువర్దన్ రెడ్డి గురించి.. నేరుగా సీఎం వద్ద శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గం నుంచి ఎవరో ఒకరు చైర్మన్ పీఠాన్ని చేపడితే బాగుంటుందని.. ఇందుకు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా సహకరించే వీలుందని విష్ణు అనుచరులు భావిస్తున్నారు.
మరోవైపు దీనినే తమకు అవకాశంగా మలచుకునేందుకు మరికొందరు రంగంలోకి దిగుతున్నారు. ప్రధానంగా శ్రీశైలం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ లాలుస్వామి.. గతంలో చైర్మన్ పీఠం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీపడ్డారు. ఈ సందర్భంలో మళ్లీ అవకాశం కోసం ఆయన కూడా ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో పదవి ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే, తన పీఠానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని చైర్మన్ రాజశేఖర్ ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది.
నాకంటే.. నాకే!
జెడ్పీ చైర్మన్ పీఠం కోసం వైస్–చైర్మన్‌గా ఉన్న పుష్పావతి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. పైగా గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు తనకే అవకాశం వస్తుందని ఆమె ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ఎక్కని గడప లేదంటే అతిశయోక్తి కాదు. అయితే, ఇప్పటి వరకు ఈమెకు ఇంకా లైన్ క్లియర్ కాలేదని సమాచారం. అయినప్పటికీ చైర్మన్ పీఠం తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మరోవైపు వాల్మీకి వర్గానికి చెందిన జెడ్పీటీసీలు కూడా రంగంలోకి దిగారు. గతంలో వాల్మీకి వర్గానికి చెందిన వెంకటప్పనాయుడుకు చేసిన మోసాన్ని సవరించుకోవాలంటే తమ వర్గానికే చైర్మన్ పీఠం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటప్పనాయుడు కూతురు పేరును కొంత మంది తెరమీదకు తెస్తున్నారు. మొత్తం మీద చైర్మన్ పీఠం వ్యవహారంతో అధికారపార్టీలో ఆశావాహులకు అంతేలేకుండా పోతోంది. చివరకు పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.