వైవీయూలో వేతనాల వెతలు
వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో జూన్ చివర్లో అర్హత కలిగిన 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్‌లకు ప్రొఫెసర్‌లుగా పదోన్నతులు కల్పించారు. వీరితోపాటు మరో 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రెగ్యులర్ కెరీర్ అడ్వాన్స్ స్కీం కింద గ్రేడింగ్ ఇచ్చారు. దీంతో వీరికి హోదాతోపాటు వేతనాలు పెరిగాయి. ఆగస్టు నుంచి పెరిగిన వేతనాలు అందుకుంటామనుకున్న అధ్యాపక బృందానికి నిరాశ ఎదురైంది. విశ్వవిద్యాలయంలోని ఓ పాలకమండలి సభ్యుడు అడ్డు పడడంతో వేతనాల ఫైల్ వెనక్కు తిరిగి వచ్చినట్లు సమాచారం. గత వైస్ చాన్స్‌లర్ ఇచ్చిన పదోన్నతులకు ఈసీ ఆమోదం పొందిన తర్వాతే వీరికి పెరిగిన వేతనాలు ఇద్దామని ప్రస్తుత ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్‌తో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో పాలకమండలి సమావేశం తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుందామని ఫైల్‌ను వెనక్కి పంపివేయడంతో అధ్యాపక వర్గంలో ఆందోళన మొదలైంది.
నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే...
యోగివేమన విశ్వవిద్యాలయంలో 2013 తర్వాత 2016 జూన్‌లో పదోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. ఇది కూడా కోర్టు ఆదేశాల మేరకు అర్హులైన అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం కింద పదోన్నతుల ప్రక్రియ చేపట్టారు. నిబంధనల మేరకు ఎవరు వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నప్పటికీ ఈ ప్రక్రియను నిర్వహించాలి. అప్పటి వైస్ చాన్స్‌లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. అయితే ప్రస్తుత పాలకమండలి సభ్యులు తమ ఆమోదం లేకుండానే ఈ ప్రక్రియ చేపట్టారంటూ అడ్డుతగులుతున్నట్లు సమాచారం. వైస్ చాన్స్‌లర్‌లు ఎవరూ శాశ్వతం కాదని.. నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి పదోన్నతులు ఇచ్చినప్పుడు వారికి రావాల్సిన వేతనాలు, బకాయిలు అందివ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. కాగా ప్రస్తుతం నెల రోజులు పూర్తయినప్పటికీ జూలై నెల ఇంక్రిమెంట్లు, పెరిగిన వేతనాలు ఇవ్వకపోవడం పట్ల వైవీయూ అధ్యాపక బృందంలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు డీఏలు బకాయిలు ఉన్న విషయం విదితమే. దీంతో పదోన్నతులు తీసుకున్నా అందుకు తగిన ప్రతిఫలం లేకపోవడంతో వైవీయూ అధ్యాపక బృందం నిర్వేదానికి గురవుతోంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి వేతనాల వెతలు తీర్చాలని అధ్యాపకులు కోరుతున్నారు.
వేతనాలు పెంపు వర్తింపజేస్తాం..
రెగ్యులర్ కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం కింద పదోన్నతులు చేపట్టినప్పుడు నేను వీసీగా లేను. అప్పుడు ఈసీ అనుమతి తీసుకుని చేపట్టారో.. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేపట్టారో నాకు తెలియదు. ప్రొసీజర్ ప్రకారం ఈసీ అనుమతి తీసుకున్న తర్వాతనే పదోన్నతుల ప్రక్రియ అయినా వేతనాల పెంపు వర్తిస్తుంది. నిబంధనల మేరకు అర్హులైన అధ్యాపకులకు ఎవరికీ నష్టం కలగదు. ఈసీలో ర్యాటిఫికేషన్ కాదు... అనుమతి పొందిన తర్వాత వేతనాలను వర్తింపజేస్తాం. లేనిపక్షంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
– ఆచార్య కె. రాజగోపాల్, ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్, వైవీయూ