జలకలం | water effect | Sakshi
Sakshi News home page

జలకలం

Published Thu, Nov 3 2016 11:40 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

జలకలం - Sakshi

జలకలం

జల చౌర్యానికి టీడీపీ నేతల వత్తాసు
- దిగువ కాలువ పొడవునా పైపులే..
- తొలగింపునకు ఎల్‌ఎల్‌సీ ఇంజనీర్ల యత్నం
- స్థానియ నాయకుల నుంచి బెదిరింపులు
- ఈనెల 10తో కాల్వకు నీటి విడుదల నిలిపివేత
- ఆయకట్టు రైతుల్లో ఆందోళన
 
పంట ఎండుతోంది
దిగువ కాలువ కింద నాలుగు ఎకరాల ఆయకట్టు పొలం ఉంది. ఈ యేడాది వరి పంట సాగు చేసినా. తుంగభద్ర డ్యాంలో అరకొర నీరు ఉండడంతో వంతుల వారీగా పంటకు నీరిస్తున్నారు. ఆంధ్ర సరిహద్దు దిగువ కాలువ మైలురాయి 135 కి.మీ.కు ముందున్న కర్ణాటకలోని సింధువాళం, బొమ్మనహాల్, గొనేహాల్‌ తదితర గ్రామాల రైతులు జలచౌర్యానికి పాల్పడుతున్నారు. దీంతో నీరందక మా పొలం ఎండుతోంది. చుట్టుపక్క రైతులదీ ఇదే పరిస్థితి.
– బసవన్నగౌడ్, ఎల్లెల్సీ ఆయకట్టు రైతు, బాపురం గ్రామం
 
  • తుంగభద్ర దిగువ కాలువ 261.9 కి.మీ వద్ద పైపులు వేసి అక్రమంగా జల చౌర్యం చేస్తుండగా ఎల్‌ఎల్‌సీ డీఈఈ నెహిమియా ఆధ్వర్యంలో పైపులు తొలగించేందుకు యత్నించారు. ఆ సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఫోన్‌ చేసి పైపులు తొలగిస్తే నీ కథ చూస్తానని బెదిరించారు. 
  •  ఎల్‌ఎల్‌సీ కాలువ డిస్ట్రిబ్యూటరీ 76 వద్ద నుంచి కాల్వకు గండి కొట్టి మరీ పెద్ద పెద్ద పైపులు వేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఇంజినీర్లపై ఆదోనికి చెందిన టీడీపీ నేత అనుచరులు దాడికి యత్నించారు.
  •  కాలువ పరిధిలోని 135 నుంచి 290 కి.మీ వరకు అనధికార నీటి వినియోగాన్ని కొందరు అధికార పార్టీ నేతలే ప్రోత్సహిస్తుండటం గమనార్హం.
 
కర్నూలు సిటీ: అధికార పార్టీ నేతలు జల చౌర్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా తుంగభద్ర దిగువ కాలువకు నీరందక పంటలు ఎండుతున్నాయి. ఈ ఏడాది కర్ణాటక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం వల్ల టీబీ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేకపోయింది. డ్యాంలోకి వచ్చిన నీటి లెక్కల ప్రకారం దిగువ కాలువకు కేటాయించిన వాటా నీరు కూడా జల చౌర్యం వల్ల జిల్లాకు చేరని పరిస్థితి ఉంది. ఈ కారణంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి సాగునీటి సమస్య తీవ్రమవుతోంది. దిగువ కాలువపై సుమారు 10 రోజులుగా గస్తీ నిర్వహిస్తున్నా.. కాల్వలో నీటి ప్రవాహం ఏమాత్రం పెరగకపోవడం గమనార్హం. అయితే తుంగభద్ర బోర్డు ఈనెల 10 నుంచి కాల్వకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు సమాచారం.
 
కాల్వపై 8 టీముల పర్యటన
ఈ ఏడాది జూన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో 151 టీఎంసీల నీరు వస్తుందని అంచనా వేయగా.. ఆ స్థాయిలో నీరు రాకపోవడంతో 82 టీఎంసీలకే పరిమితం అయ్యింది. 151 టీఎంసీల ప్రకారం అయితే దిగువ కాలువకు 17.23 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. అధికారుల అంచనాలు తప్పడంతో ఈ వాటా 8.3 టీఎంసీలకు చేరుకుంది. ఇప్పటి వరకు 3.5 టీఎంసీల నీరు వినియోగించుకోగా.. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 30వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వాస్తవానికి ఇంతకు ఎక్కువే సాగయింది. ఈ ఆయకట్టుకు 690 క్యుసెక్కుల నీటికి ఇండెంట్‌ పెట్టారు. అయితే 240 క్యుసెక్కులకు మించి నీరు రాకపోవడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు మూడు శాఖలకు చెందిన అధికారులతో 8 టీములు ఏర్పాటయ్యాయి. ఈ టీంలు కాల్వపై పర్యటిస్తూ జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు పైపులు తొలగిస్తున్నారు.
 
నేతల మధ్య కొరవడిన సఖ్యత
అనంతపురం జిల్లాలోని అధికార పార్టీ నేతలంతా సాగు నీటి కోసం ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఫలితంగా ఎగువ కాల్వకు ఈ ఏడాది కేటాయించిన 13 టీఎంసీల నీటి మొత్తాన్ని ఎక్కడా చౌర్యం కాకుండా ప్రతి బొట్టునూ వినియోగించుకున్నారు. జిల్లాలో మాత్రం ఎల్‌ఎల్‌సీ ఆయకట్టు ప్రాంతానికి చెందిన టీడీపీ నేతల మధ్య సమన్వయం కొరవడింది. అధికార పార్టీలో ఉన్న ఒక నాయకుడు జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు దీక్షలు చేస్తానంటే.. మరో నాయకుడు జల చౌర్యాన్ని అడ్డుకుంటే మీ అంతు చూస్తానని అధికారులను బెదిరిస్తున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా టీబీ బోర్డుపై ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకురాలేకపోతున్న నేతలు.. రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా సానుభూతి కోసం యత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
 
నాయకులు స్వార్థం వీడాలి
జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు 8 టీములు పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల కాల్వకు ఉన్న పైపులను తొలగించవద్దని ఒత్తిళ్లు చేస్తున్నాయి. నాయకులు రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాకుండా రైతులకు మేలు చేకూర్చేందుకు యత్నించాలి. మా వంతుగా జల చౌర్యాన్ని అడ్డుకుంటున్నాం.
– ఎస్‌.చంద్రశేఖర్‌ రావు, జల వనరుల శాఖ ఎస్‌ఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement