ఈసారీ లేవ్!
►సీబీఆర్‌లో డెడ్ స్టోరేజీకి చేరిన నీటిమట్టం
►కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే కేటాయింపు
►వెంటనే సీబీఆర్‌కు నీటిని విడుదల చేయాలి : వైఎస్ అవినాష్ రెడ్డి
►తాగుకు మాత్రమే...సాగుకు లేదు
►ఎట్టకేలకు 3.77 టీఎంసీల కేటాయింపు
►అనంత ఐఏబీ సమావేశంలో తీర్మానించిన అధికారులు
సాక్షి, కడప : అనుకున్నట్లే అయ్యింది....ఈసారీ సాగుకు నీరు రావడం కూడా అనుమానంగా మారింది. ప్రతిసారి పులివెందుల ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదేదో చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. చివరకు అనంతపురంలో బుధవారం జరిగిన సాగునీటి సలహా కమిటీ సమావేశంలో కూడా సాగునీటికి కేటాయింపులు ఎత్తివేశారు. అవసరమైనన్ని జలాలు లేవని, శ్రీశైలం జలాలు వస్తేనే సాగుకు కేటాయిస్తామని సాకుగా చూపి మంత్రులతోపాటు అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఈసారికి సాగుకు తుంగభద్ర జలాలు రావడంపై నీలినీడలు అలముకున్నాయి. ఐఏబీ సమావేశంలో తీర్మానించిన మేరకు కూడా అమలు చేయడంలో ప్రతి ఏడాది అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేటాయింపుల్లో ఒకటి, అమలులో మరొకటి కనిపిస్తుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
తాగునీటికి మాత్రమే కేటాయింపులు
‘సీమ’లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలోని ప్రజాప్రతినిధులతోపాటు ఆయా ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్న ఐఏబీ సమావేశంలో కేవలం తాగునీటికి మాత్రమే కేటాయింపులు జరిగాయి. మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి మాత్రమే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు సన్నద్ధమయ్యారు. భారీవర్షాలు కురిసి తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా నీరు వచ్చి చేరితేనే కేటాయిస్తారు. లేకపోతే చుక్కనీరు కూడా సాగుకు అందించే పరిస్థితులు కనిపించడం లేదు. తుంగభద్ర నుంచి అన్నోఇన్నో నీటిని బుధవారమే హైలెవెల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సీ)కి విడుదల చేశారు. అయితే హెచ్‌ఎల్‌సీకి సంబంధించే 9.80 టీఎంసీ కేటాయించిన నేపథ్యంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు ఎంతమాత్రం నీరు వస్తుందన్నది వేచిచూడాల్సిందే!
సీబీఆర్‌లో అడుగంటిన జలం
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీరు లేక ప్రాజెక్టు బోసిపోయింది. సీబీఆర్‌లో డెడ్‌స్టోరేజీ 0.44 టీఎంసీ కాగా, ప్రస్తుతం 0.01కు చేరింది. విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇక్క డి నుంచే అనంతపురం జిల్లాలోని కదిరి, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాలకు తాగునీరు, పులివెందుల నియోజకవర్గంలో ని 120 గ్రామాలకు తాగునీటిని అందించే పంపులకు నీరందక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నానాయాతన పడుతున్నారు. ప్రస్తుతం సీబీఆర్‌లో నీరు అడుగంటడంతో పంపులకు కూడా సరిగా అందడం లేదు.
3.77 టీఎంసీల కేటాయింపు
పులివెందుల ప్రాంత ప్రాణాధారమైన పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సాగునీరు అందడం ఈసారి కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ప్రధాన జీవనాధారమైన ప్రాజెక్టు ఏడాదికేడాదికి నిర్వీర్యమవుతోంది. పీబీసీకి 4.4 టీఎంసీల నీటి కోటా ఉండగా ప్రతి సంవత్సరం అరకొర కేటాయింపులతోనే సరిపెడుతున్నారు. ఈసారి కూడా ఐఏబీ సమావేశంలో 3.77 టీఎంసీల నీటి కేటాయింపులకు ఆమోదం తెలిపినా ఎన్ని విడుదల చేస్తారన్నది తెలియడం లేదు. ఏదో ఓక సాకుతో నీటి విషయంలో ఎగనామం పెడుతున్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఒకపక్క అల్లాడిపోతున్నారు. పీబీసీకి సంబంధించి జిల్లాలో 55 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు అనంతపురం జిల్లాలో ఐదు వేల ఎకరాలు కలుపుకొని మొత్తం మీద 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.