వీలైతే ప్రేమిద్దాం డూడ్‌ | we love animals | Sakshi
Sakshi News home page

వీలైతే ప్రేమిద్దాం డూడ్‌

Published Fri, Jul 29 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

వీలైతే ప్రేమిద్దాం డూడ్‌

వీలైతే ప్రేమిద్దాం డూడ్‌

బీచ్‌రోడ్‌ : విశ్వాసానికి మారు పేరు కుక్కలు. అలాంటి కుక్కలపై వరుస దాడులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్న ఘటనలు మనం ఈ మధ్యకాలం తరుచూ చూస్తున్నాం, మొన్నటికి మొన్న కేరళాలో వైద్య విద్యార్థులు మేడపై నుండి కుక్కను పడేశారు... నిన్న హైదరాబాద్‌లో కొంత మంది కుక్కను కాల్చేశారు. ఇలా ప్రతి చోటా కుక్కలపై దాడులు చేస్తున్నారు. ఒక వైపు జంతుప్రేమికులు రోజు రోజుకూ పెరుగుతుంటే మరో వైపు ఇలాంటి దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దాడులు ఎందుకు చేస్తున్నారు అని ఆరా తీయగా  కొన్ని భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మానసిక సమస్యలతో దాడులు
జంతువులపై దాడులు చేసిన వారు భవిష్యత్తులో హింసాత్మక ప్రవర్తన ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మానసిక నిపుణుల పరిశోధనలో తేలింది. శాడిస్టులుగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా గహహింసతో పాటు తోటి వారిని హింసించే వారిగా గుర్తించారు. ప్రతి చిన్న విషయానికి ఆవేశం,ఉద్వేగానికి గురవుతారు. ఏమీ తోచనప్పుడు లేదా ఒంటరితనాన్ని భరించలేనప్పుడు, డిప్రషన్‌ అధికమించడానికి జంతువులపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందుతారు. అంతేకాకుండా జంతువుల ప్రవర్తన, వాటి ప్రభావం ఎలా ఉంటుదో తెలుసుకోవడానికి జంతువులను గిల్లడం, కొట్టడం, విసరడం, ఇతర వస్తువులతో దాడి చేయడం వంటివి చేస్తారు. ఇలాంటి ల„ý ణాలు ఉన్నవారు భవిష్యత్‌లో సైకోగా మారడానికి అవకాశం వుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
సామాజిక మాధ్యమాలు
ఒకప్పుడు మన గురించి ప్రపంచానికి తెలియాలంటే చాలా రోజులు పట్టేది. ప్రస్తుతం సామాజిక మాద్యమాల ద్వారా క్షణంలో మన గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అందువలన సమాజంలో గుర్తింపు కోసం యూత్‌ జంతువులను హింసించడం, వాటిపై దాడులు చేసి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దాని ద్వారా గుర్తింపు పొందవచ్చునని వారి భావన. ఈ వీడియోలపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తుంది.
కుక్కలతో మానవులకు ఎంతో ఉపయోగం
కుక్కలు విశ్వాసంగా ఉండటమే కాకుండా తన ప్రవర్తన ద్వారా మానవుల ప్రవర్తనలో మార్పు తీసుకోని రావడానికి ఉపయోగపడుతున్నాయి. ఇలా జంతువుల ద్వారా మానవుని ప్రవర్తనలో మార్పు వస్తే దానిని పెట్‌ థెరిపీ అంటారు. ఈ పెట్‌ థెరిపీ వలన మానవులకు జంతువులకు మధ్య స్నేహ సంబంధం ఏర్పడుతుంది. అలాగే పిల్లల్లో క్రమశిక్షణ, బాధ్యత, విశ్వాసం వంటివి ఈ పెట్‌ థెరిపీ ద్వారా నేర్చుకుంటారు. ఈ పెట్‌ థెరిపీలో భాగంగా ట్రైనింగ్‌ తీసుకున్న కుక్కులు, పిల్లలు ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తాయి. పిల్లలు తప్పడు ప్రవర్తన చేస్తే వారిని హెచ్చరిస్తాయి. అంతే కాకుండా మానవుని పనులలో కుక్కులు చాలా సహకారం అందజేస్తాయి.
సేవా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన
వరుసగా జంతువులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు, ప్రజల్లో జంతువులపై అవగాహన కల్పించటానికి నగరంలో వున్న అన్ని సేవా సంఘాలు ఒకతాటిపైకి వస్తున్నాయి. జంతువులపై వివిధ స్కూల్స్, కాలేజీలు, మురికివాడలలో అవగాహన కల్పించేందుకు విశాఖ సోసైటీ ఫర్‌ ప్రొటక్షన్‌ అండ్‌ కేర్‌ ఆఫ్‌ ఏనిమల్స్‌ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజలలో అవగాహన కల్పించటానికి జిల్లా అధికారులతో మాట్లాడి కార్యాచరణ రూపొందించారు. ఈ  కార్యక్రమం అతి త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు జీవీఎంసీ అధికారులు కూడా పాల్గొన్నారు.
సైకోలాగా మారే అవకాశం
1970 కాలం నుంచి జంతువులపై దాడులు చేయడం వెనుక కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో కొంత మంది నేరస్థుల చరిత్రను పరిశీలిస్తే...చిన్నతనంలో తమ ఆవేశాన్ని జంతువులపై చూపినట్టు తేలింది. జంతువులపై దాడులు చేసే వారి ప్రవర్తన భవిష్యత్తులో ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. నేరస్థులుగా, సైకోలాగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. జంతువులపై ఇలాంటి దాడులు చెయ్యకుండా ఉండటానికి పెట్‌ థెరపీ, సైకో థెరపీ, ఆర్ట్‌ థెరపీల ద్వారా నియంత్రిచవచ్చు.
                                                                       –ప్రొఫెసర్‌ ఎం.వి.ఆర్‌.రాజు సైకాలజీ విభాగ అధిపతి 
 
కఠిన చట్టాలను రూపొందించాలి
మన దేశంలో జంతువులపై దాడులు పెరగటానికి కారణం సరైన చట్టాలు లేకపోవటం. జంతువులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తే తప్పా దాడులు తగ్గవు. అంతే కాకుండా జంతువులపై అవగాహన ప్రజలలో కల్పించాలి అందుకు మా సంస్థ తరఫున త్వరలో ప్రతి అపార్టమెంట్‌కు వెళ్ళి జంతువులపై అవగాహన కల్పించాలని భావిస్తున్నాం. అంతే కాకుండా ఆగస్టు 14న బీచ్‌రోడ్డులో వైఎంపీఏ దగ్గర భారీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
                                                                                    పవన్‌ హర్ష, లిటిల్‌ పౌస్‌ సంస్థ ప్రతినిధి 
 కనీస అవసరాలు ఏర్పాటు చేయాలి
వీధి కుక్కలకు కనీసం నీరు, ఆహారం లేకపోవటం వలన అవి ఆకలితో మానవుల మీద దాడి చేస్తుంటాయి. ఈ సమస్యను అరికట్టడానికి మా సంస్థ ప్రతీ వీధిలో కుక్కల కోసం నీరు, ఆహారం ఏర్పాటు చేస్తున్నాం. అంతే కాకుండా వీధిలో తప్పిపోయిన పెంపుడు కుక్కలను సంరక్షించి వాటిని దత్తత ఇస్తున్నాం. జంతువులను పెంచుకునేవారు, అమ్మేవారు వారు లైసన్స్‌ ఖచ్చితంగా వుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా వీధి కుక్కలకు ఆపరేషన్‌ చేసి విడిచిపెడుతున్నారే తప్ప వాటిపై ప్రజలకు అవగాహన కల్పించటం లేదు.
–ఎన్‌.ఎ.టి. ప్రదీప్‌ కుమార్, వ్యవస్థాపకుడు, విశాఖ సోసైటీ ఫర్‌ ప్రొటక్షన్‌ అండ్‌ కేర్‌ ఆఫ్‌ ఏనిమల్స్‌
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement