హరితవనంగా వేమన విశ్వవిద్యాలయం
► వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయాన్ని పరిశోధనలకు ఉపయోగపడేలా చక్కటి హరితవనంగా తీర్చిదిద్దుతామని వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వైవీయూలోని బొటానికల్ గార్డెన్‌లో బోరుబావి తవ్వేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జాతీయస్థాయిలో వైవీయూ బొటానికల్ గార్డెన్‌కు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. దీంతో దాదాపు రూ. 90లక్షలను బొటానికల్ గార్డెన్ అభివృద్ధి, పరిశోధనలకు కేటాయించారన్నారు. భారత పర్యావరణ, అడవుల సంరక్షణ, వాతావరణ మార్పులకు సంబంధించిన సంస్థ అరుదైన వృక్షజాతులను కాపాడేందుకు ఈ మొత్తాన్ని వినియోగించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. చంద్రయ్య మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రారంభమైన అనతి కాలంలోనే పేరెన్నికగల విశ్వవిద్యాలయాలతో పోటీపడుతోందన్నారు. ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రాజెక్టు గురించి వివరించారు. అనంతరం బొటానికల్ గార్డెన్‌లో బోరు వేయగా 180 అడుగుల్లోనే రెండు ఇంచుల నీళ్లు ధారాలంగా రావడంతో అధికారులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయంలో 100 ఇంకుడు గుంతలు
యోగివేమన విశ్వవిద్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 ఇంకుడు గుంతలను తవ్వుతున్నట్లు వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ అధికారులంతా ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రిన్సిపల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య జి. గులాంతారీఖ్, అధ్యాపకులు పాల్గొన్నారు.