మాట్లాడుతున్న కృష్ణమోహన్
పథకాల అమలుతోనే పేదరిక నిర్మూలన
Published Tue, Jul 19 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
►రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు కార్యనిర్వహణ అధికారి పి.కృష్ణమోహన్
ఎచ్చెర్ల: ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు కార్యనిర్వహణ అధికారి పి.కృష్ణమోహన్ అన్నారు. ఎచ్చెర్ల సాంకేతిక శిక్షణ కేంద్రంలో మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి, వెలుగు సంస్థల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీలు లక్ష్యం మేరకు అంద జేయాలని అన్నారు. సంఘాలకు వ్యక్తిగతంగా స్త్రీ నిధి రుణాలు అందించాలని, రికవరీలు నూరు శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా అర్హులకు చేరితే ప్రగతి సాధ్యమని వివరించారు. బీసీల అభివృద్ధి లింకేజ్‌లు అవసరం మేరకు అంద జేసే చర్యలు చేపట్టాలని అన్నారు.
ఉపాధి హామీ సాయంతో వర్మీ కంపోస్టు యూనిట్లు జిల్లాలో 15000 ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామీణ సమగ్ర అభివృద్ధి పథకం కింద రైతు సంఘాల ఏర్పాటు, బ్యాంకు రుణాలు ఇవ్వటం, పొదుపు ప్రోత్సహించటం, ఉద్యానవనాల పంటకు ప్రాధాన్యత ఇచ్చేలా వారిలో చైతన్యం నింపటం, ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచటం, వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించేలా గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్య పరచడం, సామూహిక మరుగుదొడ్లు నిర్మించేలా ప్రోత్సహించటం, మొక్కలు ప్రతిష్టాత్మకంగా నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం అవసరమని తెలిపారు. జిల్లాలోని రహదారుల్లో కిలోమీటరుకు 400 మొక్కలు ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. రూ. 1.25 లక్షలు ఏడాది నిర్వహణకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, డీఆర్‌డీఏ పీడీ తనూజారాణి పాల్గొన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యం కాదు
డీఆర్‌డీఏ, వెలుగు, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్డు ఉ ద్యోగులు ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని పలువురు కృష్ణమోహన్‌కు వినతి పత్రం అందించారు. అరకొర జీతాలతో ఏళ్ల కొద్దీ పనిచేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కృష్ణ మోహన్ స్పందిస్తూ మీరేం ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ ఉద్యోగులుగా నియామకాలు కాలేదని, కాంట్రాక్టు ఉద్యోగులు టైమ్ బాండ్‌పై పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. నిర్ణీత సమయం తర్వాత ఉద్యోగాలు పోతాయని, అందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవద్దని సూటిగా చెప్పేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు ఆయన మాటలకు నిరాశ చెందారు
Advertisement
Advertisement