సంక్షేమ సంతకం | Welfare signature | Sakshi
Sakshi News home page

సంక్షేమ సంతకం

Published Tue, May 16 2017 1:53 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

సంక్షేమ   సంతకం - Sakshi

సంక్షేమ సంతకం

హామీ అంటే అసత్యం..ఇదీ 2004కి ముందు జనాభిప్రాయం. తాను సీఎం అయ్యాక వైఎస్‌ ఈ భావనను మార్చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత విద్యుత్‌ సరఫరా ఫైలుపై సంతకం చేశారు. అన్నమాటను అమలుచేశారు. ఇవ్వని హామీలనూ నెరవేర్చారు. మరి నేడు.. వైఎస్‌ మాదిరిగానే చంద్రబాబూ 2014లో రుణమాఫీ ఫైలుపై సవాలక్ష షరతులతో సంతకం పెట్టారు. అమలు అంతంత మాత్రమే.. నిరుద్యోగ భృతి..ఇంటికో ఉద్యోగం లాంటి హామీలు గాలిలో కలిసిపోయాయి. వైఎస్‌ తొలిఫైలుపై సంతకం పెట్టి 13ఏళ్లయిన సందర్భంగా కథనం..

చిత్తూరు (అర్బన్‌): రైతులు పడుతున్న కష్టాలను పాద యాత్ర ద్వారా కళ్లారా చూశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 మే 14న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే రోజు ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేశారు. పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గరి నుంచి చూసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఉచిత విద్యుత్‌ సంతకం రాష్ట్రం మొత్తంలో 30 లక్షల మంది రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. మన జిల్లాలో మాత్రమే 2 లక్షల మంది రైతులు ఉచిత విద్యుత్‌ ద్వారా లబ్ధి పొందారు. అప్పటివరకు ఉన్న విద్యుత్‌ బకాయిలను ఒకే ఒక్క సంతకంతో కొట్టి పారేశారు. ఏటా సగటున ఆరువేల మంది రైతులు కొత్త విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుంటూ మరో 78 వేల రైతు కుటుంబాలు 13 ఏళ్లు లబ్ధి పొందాయి. వైఎస్‌ నాటిన ఉచిత విద్యుత్‌ అనే బీజం పెరిగి మహావృక్షంగా మారడంతో జిల్లాలో 2.78 లక్షల మంది కర్షకులు ఆ చెట్టు కొమ్మ కింద సేదతీరుతున్నారు.

అడక్కుండానే అన్నీ ఇచ్చి..
అడగకుండానే రాజశేఖరరెడ్డి ప్రజల కోసం మరెన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నుంచి మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, శస్త్ర చికిత్స చేయించుకోలేని వాళ్లకు ఆరోగ్య శ్రీ కింద ఉచిత ఆపరేషన్లు చేయించారు. రుణమాఫీ కింద జిల్లా వాసులకు రూ.200 కోట్ల అప్పుల నుంచి విముక్తి కల్పించారు. ఇందులో రైతులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరూ ఉన్నారు. ఎక్కడా రాజకీయాలకు, కులమతాలకు తావివ్వలేదు. అందుకే ఆయన అందరి గుండెల్లో చిరిస్థాయిగా నిలిచిపోయారు.

రైతులకు భరోసా లేదు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు పెద్దపీట వేశారు. కావాల్సినంత కరెంట్‌ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలుపొందేందుకు లేనిపోని హామీలు ఇచ్చారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి తీరా ఆ మాట మరిచిపోయారు. దీంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి రైతు సంక్షేమానికి భరోసా ఇవ్వాలని కోరుతున్నా.
–  ఆరుద్రరెడ్డి, రైతు, తాళంబేడు

ఎదురుచూస్తున్నాం
నాపేరు శాంతమ్మ. ఇందిరమ్మ మహిళా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నా. మా సభ్యులు 9 మందితో కలిసి నాలుగేళ్ల క్రితం రూ.3.5లక్షలు అప్పు తీసుకున్నాం. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మేము తీసుకున్న అప్పును నిలుపుదల చేశాం. కొన్నాళ్లకు తీసుకున్న అప్పుకు గాను ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున వడ్డీ పడింది. మా గ్రూపునకు ఇంతవరకు రూపాయి మాఫీ కాలేదు.     
    – శాంతమ్మ, తాళంబేడు

ఉచిత విద్యుత్‌తో ఎంతో మేలు జరిగింది
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో మాకు ఎంతో మేలు జరిగింది. అంతకు మునుపు టీడీపీ ప్రభుత్వం ప్రతినెలా విద్యుత్‌ బిల్లులు, బకాయిల పేరుతో ఎంతో వేధించేది. వైఎస్‌ రాకతో ఉచిత విద్యుత్‌ ఇవ్వడమేగాక బకాయిలు మొత్తం కొట్టేశారు. ప్రస్తుత ప్రభుత్వం నెలనెలా 20 రూపాయలు వ్యవసాయ బావులకు వసూలు చేస్తోంది. అది కూడా ఇంటి బిల్లుల్లో వసూలు చేస్తున్నారు.         – రాజారెడ్డి, రైతు, వసంతాపురం

రైతుల కష్టాలు రాజశేఖరరెడ్డికి తెలుసు
రైతుల కష్టాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డికి మాత్రమే తెలుసు. అందుకోసమే ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. జీవితాంతం ఆయన్ని మరచిపోలేం. నేను కూడా ఉచిత విద్యుత్‌తో లాభపడ్డాను. గతంలో రెండు నెలలకు ఇంటి విద్యుత్‌ బిల్లులు ఇస్తూ ఉండేవారు. ప్రస్తుతం ప్రతినెలా వ్యవసాయ బిల్లుల పేరుతో 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు.
– వెంకిరెడ్డి, రైతు, చింతగుంటూరు, గుడిపాల మండలం

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు..
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రాజశేఖరరెడ్డి పథకాలను మక్కికి మక్కి దించేసి ప్రజల నోళ్లలో నానాలనుకున్న చంద్రబాబునాయుడు అదే ప్రజలు శాపనార్థాలు పెట్టే స్థాయికి చేరుకున్నారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాబు ఐదు ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. ఇందులో రుణమాఫీపై తొలి సంతకం చేసినా రెండేళ్లలో జిల్లాకు విడుదల చేసిన దాదాపు రూ.వెయ్యి కోట్లు ప్రజలు తీసుకున్న అప్పులపై వడ్డీకి సైతం సరిపోవడం లేదు. అలాగే జిల్లాలోని 6.61 లక్షల డ్వాక్రా సంఘాలకు రూ.264 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బెల్టు దుకాణాలు కనిపించడానికి వీల్లేదంటూ చేసిన మూడో సంతకం ఫలితంగా అప్పటి వరకు జిల్లాలో ఉన్న బెల్టు దుకాణాలు 3,400 నుంచి ఇప్పుడు ఏకంగా 7 వేలకు చేరుకున్నాయి. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కింద జిల్లాలోని 1,400 గ్రామాల్లో శుద్ధినీటి ప్లాంటు పెడతామని సీఎం స్థాయిలో బాబు సంతకం చేసినా ఈ సంఖ్య 110కే పరిమితమయ్యింది. ఇక పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల భృత్తి ఇస్తామని చెప్పి జిల్లాలోని 3 లక్షల మంది నిరుద్యోగులకు ఈ మూడేళ్ల కాలంలో రూ.2,160 కోట్లు బకాయి పడ్డారు. ఇలా జిల్లా వాసుల్ని బాబు దగా చేసి, ఇచ్చిన హామీలు గాలికొదిలి నిస్సిగ్గుగా సీఎంగా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement