–జాతీయ ఇన్‌స్పైర్ అవార్డు పోటీల్లో సంతజూటురు విద్యార్థికి ప్రతిభ
– ఆటో మ్యాటిక్ హెల్మ్‌ట్‌పై ప్రదర్శన
– కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు
– మొదటిసారి జిల్లాకు జాతీయ ఇన్‌స్పైర్ అవార్డు
కర్నూలు సిటీ:అది సాధారణ ప్రభుత్వ పాఠశాల..అయితేనేం..అక్కడున్న ఉపాధ్యాయుల్లో సత్తా ఉంది..సృజనా ఉంది..అందుకే ఈ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయిలో మెరిశాడు. జాతీయ సైన్స్ ఇన్‌స్పైర్ అవార్డును ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. బండిఆత్మకూరు మండలం సంతజూటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి కోలె నరేంద్ర ప్రతిభ ఇది. ఆటోమ్యాటిక్ హెల్మెట్‌ను తయారు చేసి ఈ విద్యార్థి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 60 ప్రదర్శలు.. ఈ నెల 9వ తేది నుంచి ఆదివారం వరకు న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబ్‌రేటరిలో పలువురిని ఆలోచింపజేశాయి. జాతీయ ఇన్‌స్పైర్ సైన్స్ ప్రదర్శనకు ఏపీ నుంచి 20.. జిల్లా నుంచి 4 ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయి. ఇందులో విద్యార్థి కోలె నరేంద్ర ప్రాజెక్టు కూడా ఒకటి..
ఆలోచన ఇలా..
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. చివరికి కోర్టులు స్పందించి బైక్ ఉన్న ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాల్సిదేనని ఆదేశాలు కూడా ఇచ్చింది. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినా ప్రమదాలు తగ్గలేదు. అయితే ఓ టీచర్‌కు తన కళ్ల ముందే జరిగిన ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. టీచర్‌కు వచ్చిన ఆలోచనతో బండిఆత్మ కూరుకు చెందిన హైస్కూల్ విద్యార్థి కోలె నరేంద్ర ఆటోమెటిక్ హెల్మెట్ తయారీకి దారి తీసింది. ఆ ఆలోచనే నేడు వారికి జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ అవార్డు తెచ్చి పెట్టింది. స్కూల్‌లో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న జియన్.రవి శంకరరావు పర్యవేక్షణలో ఆ విద్యార్థి ఆటోమెటిక్ హెల్మెట్ తయారీ చేశారు.
ఇలా పని చేస్తుంది...!
హెల్మెట్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మీటర్‌ను ఏర్పాటు చేయాలి. బైక్ హ్యాండిల్ దగ్గర ఒక చిన్న బాక్స్ అమర్చి అందులో రేడియో ప్రీక్వెన్సీ రీసివర్‌ను ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేశాక...బైక్ స్టార్ట్ కావాలంటే హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. «ఆది ధరించిన తరువాత అందులో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌మీటర్ బటన్‌పై ప్రెస్ అయి అక్కడి నుంచి విడుదల అయ్యే తరంగాల వల్ల రీసివర్‌కు చేరగానే బైక్ స్టార్ట్ అవుతుంది. హెల్మెట్ ధరించికుంటే బైక్ స్టార్ట్ కాదు. ఈ పరికరం ప్రతి స్కూటర్‌కు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుంటారు. దీని వల్ల కొంత మేరకైనా ప్రమాదలు తగుతాయని నరేంద్ర చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ ప్రత్యేకంగా విద్యార్థితో అడిగి తెలుసుకున్నట్లు గైడ్ టీచర్ తెలిపారు.
జిల్లాకు మొదటిసారి జాతీయ ఇన్‌స్పైర్ అవార్డు...!
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడం కోసం 2012లో ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రతి ఏటా జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలలో పాల్టొంటున్నా కూడా ఈ ఏడాది అవార్డు రావడం జిల్లాకు మొదటి సారి కావడం గమనర్హం. గత నెల 16,17 తేదీల్లో జరిగిన జిల్లా స్థాయి, 29 నుంచి ఈ నెల1వ తేదీ వరకు కడప జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఈ ప్రదర్శన ప్రశంసలు అందుకుంది. ఈ నెల 9నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయిలో ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపిక అయ్యింది.
శాస్త్రవేత్త కావాలని ఉంది
కోలె నరేంద్ర, 10వ తరగతి విద్యార్థి, సంతజూటురు జెడ్పీ హైస్కూల్
చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ వైపు నడిపింది. గైడ్ టీచర్‌గా ఉన్న రవిశంకరరావు ప్రోత్సాహం మరువలేనిది. వాస్తవంగా మేము తయారీ చేసిన ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి అవార్డు వస్తుందని అనుకోలేదు. అయితే ఈ ప్రాజెక్టుతో కొందరిలోనైనా ఆలోచింప చేయాలనుకున్నాం. జిల్లా సైన్స్ అధికారి రామ్మెహన్ ఎంతో సహకారం ‡అందించారు.