
ఈ కారు ఎవరిదో !
బ్రాహ్మణగూడెంలో వారం రోజులుగా వదిలేసిన మారుతి కారు
బ్రాహ్మణగూడెం(చాగల్లు): నిడదవోలు-పంగిడి రహదారిలోని బ్రాహ్మణగూడెం గ్రామం శివారులో ఒక కారు వారం రోజులుగా రోడ్డు పక్కనే నిలిపివేసి ఉండడం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీ 31 క్యూ 1155 నంబర్ కలిగిన ఈ మారుతి 800 కారును ఎవరో డోర్స్ లాక్‌చేసి రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.
కారు యజమాని గాని, సంబంధీకులు గానీ రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ విశాఖ జిల్లాకి చెందినది కావడం అనుమానాలను మరింత పెంచుతోంది. ఎవరు ఎందుకు ఈ కారును వదిలేశారు? యజమాని క్షేమమేనా? ఏదైనా నేరఘటనకు దీనికీ సంబంధం ఉందా? ఇలా పలు విధాల చర్చించుకుంటున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఈ కారు మిస్టరీని ఛేదించాలని స్థానికులు కోరుతున్నారు.