హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణీకులకు వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం క్వార్డ్‌జన్ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. క్వార్డ్‌జన్ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి వైఫై సేవలు అందించనుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల బస్టాండుల్లో ఈ వైఫై సేవలు అందించనున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి తొమ్మిది రాష్ట్రాలో వై ఫై సేవలు అందించనున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్‌లోని మహాత్మగాంధీ బస్‌స్టేషన్‌లో, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌లో వై-ఫై సేవలు వినియోగంలోకి వచ్చాయి. హన్మకొండలోని జిల్లా బస్‌స్టేషన్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, పటాన్‌చెరువు, మహబూబ్‌నగర్ బస్‌స్టేషన్‌లలో వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన పరికరాలను బిగిస్తున్నారు. హన్మకొండ బస్‌స్టేషన్‌లో క్వార్డ్‌జెన్ కంపెనీ వైఫై సేవలు అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది.
బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ నెట్ కనెక్షన్ ఇవ్వగానే, రెండు మూడు రోజుల్లో బీఎస్‌ఎన్‌ఎల్ వై ఫై సేవలు వినియోగంలోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణీకులకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినా..వీటిని చెల్లింపు ఆధారంగా సేవలు అందించనున్నారు. నెలకు 15 నిమిషాలు మాత్రమే ఉచితంగా అందించనున్నారు. 30 నిమిషాలకు లేదా 300 ఎంబీకి రూ.30లు చార్జీ చేయనున్నారు. 50 నిమిషాలు లేదా 500 ఎంబీకి రూ.50లు, రూ.124లకు 24 గంటలు వైఫై సేవలు అందించనున్నారు. దీనిని 24 గంటల లోపు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలు వినియోగించుకునేవారు కూపన్లు, ఆన్‌లైన్ పేమెంట్ పద్దతిలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.