మొక్కలు నాటిన ఐజి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
మొక్కలు పెంచితే కరువు దూరం
Published Sat, Jul 23 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
– నాటిన మొక్కను దత్తత తీసుకోవాలి
– 24శాతం అడవులు ఉంటే ప్రకతి బాగుంటుంది
– ఐజి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ క్రైం : హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కను దత్తత తీసుకుని పెంచితే భవిష్యత్‌లో వనసంపదకు కొదవ ఉండదని పోలీస్ శిక్షణ విభాగం ఐజి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో హరిత హారం కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం బాగా చొరవ చూపిస్తుందని, మొక్కలు నాటడానికి రాష్ట్రం మొత్తం కదిలిందన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో శిశుమందిర్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. 24శాతం అడవులు ఉండే ప్రాంతాల్లో పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని, అడవులు, చెట్లు తగ్గిపోవడం వల్ల కరువు వస్తుందని అన్నారు. జీవకోటికి ప్రాణవాయువును అందిస్తూ, మనిషి మనుగడకే ప్రధానమైన చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో ఉన్నతమైనదని అన్నారు. పిల్లలకు మొక్కలు నాటి పోషించే అలవాటును ప్రతి తల్లిదండ్రులు నేర్పించాలని పిలుపునిచ్చారు. చిన్నారులతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎస్పీని అభినందించారు. ఈ సందర్భంగా మైనర్లు, డ్రంక్‌అండ్‌డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులతో, పాత నేరస్థులతో పోలీసులు మొక్కలు నాటించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు, డీఎస్పీ క్రిష్ణమూర్తి, ఇన్‌స్పెక్టర్లు సీతయ్య, సైదయ్య, రాజు, రామకష్ణ, గిరిబాబు, రామకష్ణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
హడావుడితో సరిపెట్టారు...
జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి ఐజీ వస్తున్నారని పోలీస్ శాఖ చాలా హడావుడి చేసింది. చివరకు రెండు మొక్కలు నాటి ఆయన వెళ్లిన తర్వాత పోలీసులు కూడా అక్కడి నుంచి మొక్కలు నాటకుండానే వెళ్లిపోయారు.
Advertisement