శస్త్రచికిత్సల్లో ఆధునిక పద్ధతులపై అవగాహన
విజయవాడ (లబ్బీపేట) : డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో ప్రభుత్వాస్పత్రిలోని డయాగ్నోస్టిక్ బ్లాక్ సెమినార్ హాలులో ఆదివారం శస్త్ర చికిత్సల నిర్వహణలో ఆధునిక పద్ధతులపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో పేగుల శస్త్ర చికిత్సల్లో కుట్లు లేకుండా స్టాప్లర్ పద్ధతిలో అతికించడంపై వైద్యులు, వైద్య విద్యార్థులకు నిపుణులు అవగాహన కల్పించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) సర్టికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్‌రెడ్డి, హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ కిషోర్ ఆలపాటి డెమో ద్వారా ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు చేసే విధానాన్ని వివరించారు. శస్త్ర చికిత్స అనంతరం స్టాప్లర్స్‌ను ఉపయోగించి పేగులను అతికించే విధానాన్ని తెలియజేశారు. సిద్ధార్థ వైద్య కళాశాల సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.శివశంకరరావు మాట్లాడుతూ స్టాప్లర్స్ పద్ధతిలో పేగులు అతికించే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ప్రభుత్వాస్పత్రుల్లో కూడా అమలు చేసేందుకు ఈ వర్క్‌షాపు నిర్వహించినట్లు తెలిపారు. డెప్యూటీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహనాయక్, సిద్ధార్థ వైద్య కళాశాల సర్జరీ విభాగ వైద్యులతోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐ, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలల సర్జరీ విభాగ వైద్యులు పాల్గొన్నారు.