
వైన్‌షాపు ఏర్పాటుపై ఆగ్రహం
గోనెగండ్ల వాసుల రాస్తారోకో
గోనెగండ్ల : మండల కేంద్రంలో రెండోవైన్ షాపు ఏర్పాటు మరోసారి స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. మొదటి సారి గ్రామంలోని అచ్చుకట్ల వీధిలో పెద్ద కట్ట వద్ద టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త నాగేష్‌నాయుడు బినామీ పేరుపై వచ్చిన వైన్‌షాపు ఏర్పాటుకు ప్రయత్నించగా అక్కడి ముస్లింలు అడ్డుకున్నారు. మూకుమ్మడిగా కలెక్టరేట్ ముట్టడి చేపట్టడంతో షాపు ఏర్పాటుకు తెరపడింది. ప్రస్తుతం రెండోషాపు ఏర్పాటు విషయం మళ్లీ స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. స్థానిక స్టేట్‌బ్యాంక్ సమీపంలో రోడ్డు పక్కన ఓవ్యక్తి దుకాణంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడంతో ఆప్రాంత మహిళలు, ముస్లింలు అడ్డుతగిలారు.
ఈమేరకు శనివారం స్థానిక పోలీసులతోపాటు పత్తికొండ ఎక్సైజ్ అధికారులు, కర్నూలులోని ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా షాపు ఏర్పాటు చేయడంతో ఆదివారం ముస్లింలు, మహిళలు వందలాదిగా తరలివచ్చి షాపు ఎదుట కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటుకు ఎలా అనుమతించారంటూ ఎక్సైజ్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ముడుపులు తీసుకుని అనుమతించారంటూ ఆరోపించారు. మద్యం షాపు అనుమతి రద్దు చేయాలని, లేకుంటే ఎక్సైజ్ జిల్లా కార్యాలయంతో పాటు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఖతీబ్‌రహమాన్, రహంతుల్లా, ఎస్‌ఎన్.మాబువలి, డాక్టర్ ఉస్మాన్, దాదావలి, వాహిద్, బ్రహ్మయ్య, బావిగడ్డ ఈరన్న, కొడల్ షఫి. పెయింటర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.