తప్పు .. సవరించుకుందాం | Wrong .. let's edit | Sakshi
Sakshi News home page

తప్పు .. సవరించుకుందాం

Published Mon, Jul 10 2017 11:18 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Wrong .. let's edit

నేడు ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు

 అవసరం. ఆన్‌లైన్‌ లావాదేవీలు ఎక్కువ అవుతున్నా ప్రస్తుత తరుణంలో ఆధార్, పాన్‌కార్డుతో పాటు రేషన్‌కార్డు వంటి గుర్తింపుకార్డుల అవసరం తప్పనిసరి అయింది. అయితే వీటిని పొందడానికి ఇచ్చే వివరాల్లో తప్పులు దొర్లితే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. తప్పులు సరిచేయించుకోవడంపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. తప్పుల సవరణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. పలు కార్డుల్లో తప్పులు దొర్లితే ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకుందాం...

- గుమ్మఘట్ట

 

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో..      

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ దీనిని విధిగా తీసుకోవాలి.  అయితే లైసెన్సులో తప్పులు లేకుండా చూసుకోవడం మరవకూడదు. లేదంటే ప్రమాదాలు జరిగిన సమయంలో అందాల్సిన పరిహారాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇదే కాదు వాహన రిజిస్ట్రేషన్‌ తదితర సమయాల్లోనూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

వెంటనే సరిచేయించుకోవాలి : డ్రైవింగ్‌ లైసెన్సులో తప్పులు ఉంటే వాటిని సవరించుకునే అవకాశాన్నీ అధికారులు కల్పించారు. ఎల్‌ఎల్‌ఆర్‌ ఇచ్చిన సమయంలో పేరు, వయస్సు ఇతర వివరాల్లో తప్పులు దొర్లితే వాటిని గుర్తించి తెలియజేస్తే అక్కడే సరిచేసి ఇస్తారు. శాశ్వత లైసెన్సులో తప్పులుంటే రూ.475 చలానా కట్టి సంబంధిత ధ్రువీకరణ పత్రం చూపాలి.  పరిశీలించిన తరువాత తప్పులు సవరించి కొత్త లైసెన్స్‌ జారీ చేస్తారు.

పాస్‌పోర్టులో..

విదేశాలకు వెళ్లే సమయంలో కచ్చితంగా ఉండాల్సింది పాస్‌పోర్టు. అందుకే ఇతర దేశాలకు వెళ్లాలన్నా ఆలోచన వచ్చిందే తడువుగా ఏడాది ముందుగానే పాస్‌పోర్టు సిద్దం చేసుకునే పనిలో పడతారు. ఇందులో ఏమాత్రం తప్పులున్నా ఎందుకూ ఉపయోగపడదు. గుర్తింపు కార్డుగా కూడా పనికిరాదు. అందుకే వివరాలు ఇచ్చేటప్పుడు ప్రతి అంశమూ తప్పులు లేకుండా చూసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. పాస్‌పోర్టు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసూ ఉండాల్సి వస్తుంది.

తప్పులుంటే ఇలా చేయాలి : పాస్‌పోర్టులో పేరులో గాని, ఇంటి నంబరు వివరాల్లో గాని ఏ అంశంలో అయితే తప్పులు వచ్చాయో వాటి వివరాలతో పాస్‌పోర్టు కార్యాలయానికి దరఖాస్తు చేయాలి. అన్ని తప్పులు సరిచేసి సక్రమంగా ఉన్న తర్వాత తిరిగి 15 రోజుల్లో కొత్త పాస్‌పోర్టు అందిస్తారు.

రేషన్‌కార్డు తప్పులతో తిప్పలు..

రేషన్‌కార్డు ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. కేవలం సరుకుల కోసమే కాదు ఇతర అవసరాలకు గుర్తింపు కార్డుగానూ ఇది ఉపయోగపడుతుంది. దీనిలో ప్రస్తుతం తప్పులు ఎక్కువుగా ఉంటున్నాయి. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏదైనా గుర్తింపునకు రేషన్‌కార్డు ఇస్తే తప్పుల కారణంగా తిరస్కరణకు గురవుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా తప్పులున్న రేషన్‌కార్డులు వేలల్లోనే ఉన్నాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

తక్షణం సరిచేయించుకోవాలి : రేషన్‌కార్డులో తప్పులుంటే చాలామంది పట్టించుకోరు. సరుకులు వస్తున్నాయిగా అనుకుంటారు. తక్షణం స్పందించి సరిచేయించుకుంటే ఇబ్బందులు తప్పవు. దీని కోసం సమీపంలోని పౌరసరఫరాల శాఖ అధికారికి, లేదంటే తహసీల్ధార్, ఆర్డీఓ కార్యాలయాల్లో కార్డు నకలుతో పాటు ఏతప్పులు దొర్లాయో వివరిస్తూ అర్జీ అందజేయాలి. నివాస, ఆదాయ, ధ్రువీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డు నకలు జతచేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత తహసీల్ధార్‌ కార్యాలయం నుంచి సిబ్బంది వచ్చి పరిశీలన చేసి సవరణకు సిపార్సు చేస్తారు. ఏపీ ఆన్‌లైన్‌ మీ–సేవా కేంద్రాల్లోనూ తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పాన్‌కార్డులో..

పెద్ద నోట్లు రద్దు చేయడంతో నగదు లావాదేవీలకు బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లుంటారు. అక్కడ పాన్‌కార్డు ఉందా అనే ప్రశ్న ఎదురై ఉంటుంది. దీంతో అందరూ పాన్‌కార్డు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కానీ దీనికి వివరాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవడం మంచిది. ఈ శాశ్వత ఖాతా నంబరు కార్డు ఆదాయపన్ను మదింపు సమయాల్లోనూ, బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు అవసరం అవుతుంది. ఈ కార్డులో పేరు, ఇతర వివరాల నమోదులో తప్పులుంటే ఈ కార్డు ఉన్నా లేనట్లే లెక్క. దీనివల్ల లావాదేవీలు స్తంభించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

ఇలా సరిచేసుకోండి : పాన్‌కార్డులో తప్పులుంటే తప్పులకు సంబంధించిన వివరాలతో రూ.50 చలాన తీసి సవరించిన వివరాలను జోడించి అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి. వీటిని సంబంధిత అధికారులకు, పాన్‌కార్డు ఏజెన్సీలకు అందచేయాలి. ఆ తర్వాత తప్పులు సవరించి కొత్త కార్డు ఇస్తారు.

ధ్రువీకరణ పత్రాల్లో..

ధ్రువీకరణ పత్రాల్లో ఉన్న తప్పుల కారణంగా పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. ఏ తప్పు దొర్లినా మళ్లీ నోటరీ చేయించటం, తిరిగి దరఖాస్తు చేయటం వల్ల పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. దీంతో అటు సమయం, ఇటు ధనం వృథా అవుతుంది. పిల్లలు పై చదువులకు వెళ్లిన తర్వాత అయినా ఉన్నత విద్యలో ప్రవేశం, ఉద్యోగ పరీక్షల్లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. తప్పుల కారణంగా పలు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇలా సరిచేసుకోవచ్చు : పుట్టినతేదీ ధ్రువపత్రాల్లో తప్పులుంటే ఏయే తప్పులున్నాయో వాటిని సవరించటానికి సరైన ధ్రువ పత్రాలతో నోటరీ చేయించి, సరిపడ రుసుం చెల్లించి పురపాలక సంఘం/పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేయాలి. విద్యార్థి తండ్రి, కులం వంటివి తప్పులు దొర్లితే ప్రాథమిక స్థాయిలో ప్రధానోపాధ్యాయుడికి చెప్పి సవరించుకోవాలి. ఆయా పాఠశాలల ముద్రలు వేసి సరిపడా రుసుం చెల్లించి, కలెక్టర్‌ కార్యాలయంలో అందజేయాలి. 9వ తరగతి వరకు అయితే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి, పదో తరగతి అయితే ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపి సవరిస్తారు. డిగ్రీ, పీజీ ధ్రువపత్రాల్లో తప్పులు దొర్లితే సంబంధిత విశ్వవిద్యాలయాల రిజిస్రా‍్టర్‌కు దరఖాస్తు చేయాలి. ఇవే కాదు పలు కార్డుల్లో తప్పులున్నా సవరణకు అవకాశముంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement