
బంపర్ ఆఫర్ వచ్చిందంటూ..
చింతపల్లి :
మీకు బంపర్ ఆఫర్ వచ్చింది.. రూపాయలు వేలు విలువ చేసే దేవతల విగ్రహాలు తక్కువ ధరకే వస్తాయని నమ్మబలకడంతో రూ. 3500 కట్టిన వ్యక్తి చివరకు పార్సిల్‌లో కనీసం రూ.వంద కూడా విలువ చేయని వస్తువులు రావడంతో అవాక్కయ్యాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... చింతపల్లి మండలం కుర్మేడ్ గ్రామానికి చెందిన కానుగుల ఆనంద్ సెల్‌కు 10 రోజుల క్రితం ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. మీ సెల్ నంబర్‌కు బంపర్ ఆఫర్ వచ్చిందని, తక్కువ ధరకు ఎక్కువ విలువ చేసే సెల్‌ఫోన్ వస్తుందని తెలిపారు. వాళ్లు చెప్పిన మాటలు విన్న ఆనంద్‌కు మరుసటి రోజు మరోసారి ఫోన్ కాల్ వచ్చింది. మీ సెల్ నంబర్‌కు లాటరీ తగిలిందని, మీకు అదృష్టం కలిసి వచ్చిందని, రూ. 15వేలు విలువ చేసే ఓ సెల్‌నంబర్‌తో పాటు దేవతల విగ్రహాలు వస్తాయని రూ. 3500 మాత్రమే చెల్లిస్తే ఆ వస్తువులు మీ సొంతమవుతాయని మరోసారి నమ్మించారు.
వాళ్లు చెప్పిన మాటలు నమ్మిన ఆనంద్ తక్కువ ధరకే రూ.వేలు విలువ చేసే కొత్త సెల్‌ఫోన్ వస్తుందనే ఆశతో శనివారం తపాలా కార్యాలయానికి వెళ్లి రూ. 3500 చెల్లించి పార్సిల్ విప్పి చూశాడు. అందులో కేవలం రూ.50 విలువ చేసే నకిలీ వస్తువులు ఉండటంతో ఆందోళనకు గురయ్యాడు.