యంగ్‌ ఇండియా | Young India | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా

Published Mon, Jul 25 2016 12:22 AM | Last Updated on Mon, Aug 20 2018 5:20 PM

కేటిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న అరుణ్‌జైట్లీ - Sakshi

కేటిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న అరుణ్‌జైట్లీ

కొత్తూరు: యువత సరికొత్త ఆలోచనలతో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ముందుకుసాగాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశంలో 52శాతం యువత ఉందని, వారు అన్ని రంగాల్లో రాణిస్తే దేశం యంగ్‌ ఇండియాగా అవతరిస్తుందని అభివర్ణించారు. మండలంలోని మామిడిపల్లి పంచాయతీ మొదళ్లగూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సింబాయాసిస్‌ అంతర్జాతీయ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్థలతోపాటు పలు ప్రముఖ వ్యాపారాల్లో 30ఏళ్లలోపు వారే రాణిస్తున్నారని, వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో హైదారాబాద్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారనుందని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యావ్యవస్థ అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదారాబాద్‌లో ఏర్పాటుచేసిన సింబయాసిస్‌ యూనివర్సిటీ ద్వారా తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో హైదారాబాద్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారనుందని పేర్కొన్నారు. 
 
రాష్ట్రానికి బహుళజాతి పరిశ్రమలు 
రాష్ట్రానికి త్వరలో మరిన్ని బహుళజాతి పరిశ్రమలు రానున్నాయని మంత్రి కే. తారకరామారావు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు రాజకీయ పార్టీలు, నాయకులు తెలంగాణ ఏర్పాౖటెతే మున్ముందు అన్ని ఇబ్బందులే ఉంటాయని ఎద్దేవాచేశారని గుర్తుచేశారు. వారు చేసిన విమర్శలు అన్ని తప్పు అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడా కూడా అమలు కాని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నామని వివరించారు. ఇప్పటికే హైదారాబాద్‌ మహానగరం శివారు ప్రాంతాల్లో ప్రపంచంలోనే పేరొందిన నాలుగు బహుళజాతి పరిశ్రమలు ఏర్పాౖటెనట్లు వివరించారు. హైదారాబాద్‌ సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యూనివర్సిటీలు ఏర్పాటు కావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. అనంతరం సింబాయాసిస్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టీకే శ్రీదేవి, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, జెడ్పీవైస్‌ చైర్మన్‌ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ శివశంకర్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు వీర్లపల్లి శంకర్, రాంబాల్‌నాయక్, సర్పంచ్‌ శోభారెడ్డి, ఎంపీడీఓ జ్యోతి, తహసీల్దార్‌ నాగయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 
 
కేంద్రమంత్రికి ఏఎన్‌ఎంల వినతి
2వ ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్రఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం అందించినట్లు సీఐటీయూ నాయకులు సాయిబాబా తెలిపారు. కొంతకాలంగా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు. 
 
ఎమ్మెల్యేను అవమానించారని..
సింబాయాసిస్‌ అంతర్జాతీయ యూనివర్సిటీ హైదారాబాద్‌ క్యాంపస్‌ను ప్రారంభించిన సందర్భంగా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన వేదికపైకి ప్రొటోకాల్‌ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను ఆహ్వానించలేదని ఆరోపిస్తూ పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు సభలో కేంద్రమంత్రి ముందే గందరగోళం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యేను అవమానించడం తగదంటూ నినాదాలు చేశారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు సమావేశం మధ్యలో నుంచి అలిగి వెళ్లిపోయారు. ఇంతలో వేదికపై ఉన్న మంత్రి కేటీఆర్‌ కిందకు దిగి ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలకు నచ్చజెప్పారు. అయినప్పటికీ కొందరు కార్యకర్తలు ససేమిరా అనడంతో మంత్రి కేటీఆర్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే వేదికపై కూర్చున్నారు. 
 
‘వలసలు నియంత్రించాలి’
కొత్తూరు : జిల్లా నుంచి ప్రతి సంవత్సరం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలను నియంత్రించాలని కోరుతూ కేంద్ర అర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకు వినతిపత్రం అందించినట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవర్ధన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మీదుగా వందల కిలోమీటర్ల మేర నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడ తాగునీటి, సాగునీటి కోసం ప్రజలు,రైతులు తీవ్రఇబ్బందులుపడాల్సి వస్తుం దన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో ప నులు లేక సుమారు 15 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వ లసలు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే స్పందించి జిల్లాలో ప్రజలకు పనులు కల్పించి వలసలను నియంత్రించే విధం గా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement