స్థలం నీది.. అప్పు నాది
-
∙కార్పొరేషన్ స్థలాలకు ప్రైవేట్ పూతలు
-
∙వీటి ఆధారంగా నకిలీ దస్త్రాల సృష్టి
-
∙ష్యూరిటీగా చూపిస్తూ బ్యాంక్ నుంచి రుణాలు
-
∙ వచ్చిన రుణంలో అందరికీ వాటాలు
-
∙‘గ్రేటర్’లో అవినీతి భూ భాగోతం
సాక్షి, హన్మకొండ : కాసుల వర్షం కురిపిస్తే చాలు వరంగల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తిమ్మినిబమ్మిని చేయడానికి వెనుకాడటం లేదు. కార్పొరేషన్ స్థలాలను ప్రైవేట్ పరం చేసేందుకు సహకారం అందిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా బాలసముద్రం లే అవుట్ నిలుస్తోంది.
ఇప్పటికే కార్పొరేషన్‌కు చెందిన 800 గజాల స్థలం నకిలీ దస్తావేజుల వివాదం కొనసాగుతుండగా, మరో నకిలీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ నకిలీ దస్తావేజులతో ఏకంగా బ్యాంకునే బురిడీ కొట్టించి రూ. 21 లక్షలు స్వాహా చేశారు.
కరెన్సీ కొడితే చాలు
వరంగల్ నగరం దినాదినాభివృద్ధి చెందుతోంది. రోజుకో రియ ల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఎవరు రియల్ వెంచర్ చేపట్టినా అందులో పది శాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం కా ర్పొరేషన్‌కు వదిలేయాల్సి ఉంటుంది. ఇలాంటి స్థలాల్లో కార్పొరేషన్ మార్కెట్లు, పార్కులు తదితర సామాజిక అవసరాలకు తగ్గట్లు అభివృద్ధి చేస్తుంది. ఇలా వందలాది వెంచర్లకు సంబంధించి గ్రేటర్ పరిధిలో వేలగజాల స్థలం కార్పొరేషన్ ఆధీనంలో ఉంది. ఈఖాళీ స్థలాలనుతమవేనని పేర్కొంటున్నారు. నమ్మకం కలిగించేందుకు ఈ ఖాళీ స్థలాల చుట్టూ కంచెలు, ప్రహారీలు నిర్మిస్తున్నారు. ఈ తతంగం అంతా బల్దియా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కనుసన్నల్లోనే నడుస్తుంది. అనంతరం ప్రహారీలు కట్టిన స్థలానికి రిజిస్ట్రేషన్ దస్త్రాలు సృష్టిస్తున్నారు. ఈ పేపర్ల ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. ఇలా స్వాహా చేసిన సొమ్మును వాటాలుగా పంచుకుంటున్నారు.
మోసం ఇలా...
ప్రస్తుతం నగరం నడిబొడ్డున హన్మకొండలో ఉన్న బాలసముద్రం లే అవుట్‌ను ఐదు దశాబ్దాల కిందట చేశారు. ఈ స్థలాలను విక్రయించగా పలువురు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ప్రాంతం నగరం నడిబొడ్డుకు రావడంతో ఇక్కడి స్థలాలు విలువ చుక్కలను అంటుతోంది. ఈ లేవుట్ 1066 సర్వేనంబర్‌లో ఉండగా నిబంధనల ప్రకారం పార్కులు, ఆలయం తది తర సామాజిక అవసరాల కోసం దాదాపు 5,500 గజాల స్థలా న్ని కార్పొరేషన్‌కు కేటాయించారు. ఈ స్థలం బాలసముద్రం లే అవుట్‌లో మొత్తం 15 చోట్ల వేర్వేరుగా ఉంది. ఇందులో 360 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. చుట్టూ ప్రహా రి నిర్మించారు. ఈ స్థలాన్ని 2007లో కొనుగోలు చేసినట్లు నకిలీ దస్తావేజులు సృష్టించారు. అనంతరం ఈ విలువైన స్థలాన్ని ఘ్యూరిటా చూపిస్తూ జనగామలో ఓ ప్రభుత్వ బ్యాంక్ నుంచి దాదాపు రూ.21 లక్షల రుణం పొందారు. ఈ విషయం బయటకుపొక్కడంతో ప్రహారి కూల్చేస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ బ్యాంక్ భారీగా నష్టపోగా....అక్కడి నుంచి వచ్చిన రుణంలో ఎవరి వాటాలు వారికి క్షేమంగా చేరాయి.
అదమరిస్తే అంతే...
కార్పొరేషన్ ఖాళీ స్థలాలను ప్రైవేట్ స్థలాలుగా నమ్మిస్తూ బ్యాంకులను బోల్తా కొట్టిస్తున్న మోసాల్లో బల్దియా టౌన్‌ప్లానింగ్ సిబ్బంది సహకారాలు మెండుగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మొత్తం స్థలాలనే ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తూ అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. గ్రేటర్ వరంగల్ తాజాసర్వే ప్రకారం నగర పరిధిలో కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాలు 600 వరకు ఉన్నాయి. ఇందులో చాలా స్థలాలపై తప్పుడు దస్త్రాలను సృష్టించి అప్పు లు తీసుకోవడం, అవకాశం ఉంటే కబ్జా చేయడం జరుగుతోంది. పదిరోజుల వ్యవధిలో ఒక్క బాలసముద్రం లే అవుట్‌కు సంబంధించి రెండు వివాదాలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాలపై సమగ్ర విచారణ జరిపించి, కాపాడుకోవాల్సిన బాధ్యత బల్దియాపై ఉంది.