నేడు వైఎస్ జగన్ రాక
ద్వారకా తిరుమలలో భారీ సభ
ప్రధాన ప్రతిపక్ష నేతను కలవనున్న చింతలపూడి రైతులు, పోలవరం నిర్వాసితులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం జిల్లాకు రానున్నారు. ద్వారకా తిరుమలలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ సభ ద్వారా జిల్లాలో హోదా హోరు వినిపించనుంది. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్, అతని అనుచరులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరుతున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నియోజకవర్గ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఇప్పటికే సన్నద్ధం చేశారు. ద్వారకా తిరుమలలో సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆళ్ల నాని పిలుపునిచ్చారు. జిల్లాకు రానున్న జగన్‌మోహనరెడ్డిని చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు, పరిహారం విషయంలో నష్టపోయిన రైతులు కలవడానికి సన్నద్ధం అవుతున్నారు. పోలవరం మూలలంకలో డంపింగ్ యార్డు వివాదంతో రైతులు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు పోలవరం నిర్వాసితులు సైతం సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం వల్ల మెట్ట ప్రాంత రైతులు భూములు కోల్పోతూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. 365 రోజులు ఏదో ఒక పంట వేసే పరిస్థితి ఉన్న ఈ భూములను కోల్పోతున్న రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు. కనీసం గ్రామసభలు కూడా జరపకుండా భూసేకరణ చేస్తుండటంపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీరంతా జగన్‌మోహనరెడ్డిని కలిసి తమ గోడు వినిపించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇదిలావుండగా, సభా ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీ పిల్లి సుబాష్‌చంద్రబోస్, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు శనివారం పరిశీలించారు.