
నాలుగేళ్ల ఎదురుచూపులు ఫలించాయి
సాక్షి, కడప: వైఎస్ కుటుంబమంటే ఈ వృద్ధ మహిళకు ఎనలేని అభిమానం....వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే అంతులేని ప్రేమ... వైఎస్సార్ జిల్లా బొజ్జవారిపల్లెకు చెందిన దస్తగిరమ్మ(70) అనే ఆ మహిళ దాదాపు నాలుగేళ్లక్రితం నాటి పాలకుల కుట్ర ఫలితంగా జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు తల్లడిల్లిపోయింది. జగన్ త్వరగా బయటికి రావాలని, అలా వస్తే మాబు సుబ్‌హాని దర్గాలో తులాభారం కింద ఎంత బరువుంటే అంత లడ్డూ చెల్లిస్తానని మొక్కుకుంది. తర్వాత జగన్ బెయిల్‌పై బయటికొచ్చారు. కానీ దస్తగిరమ్మ మొక్కు అలాగే ఉండిపోయింది. వైఎస్సార్‌సీపీ నాయకులు గ్రామంలోకొస్తే చాలు జగన్‌ను పిలుచుకురారా? అంటూ వేడుకునేది. ‘గడపగడపకు వైఎస్సార్’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి బొజ్జవారిపల్లె గ్రామానికి వెళ్లినప్పుడు దస్తగిరమ్మ తన మొక్కు గురించి వివరించింది.
కూలి పనులకెళ్లి దాచుకున్న డబ్బునుసైతం ఎమ్మెల్యే ఎదుట కుమ్మరించింది. ఆయనీ విషయాన్ని జగన్మోహన్రెడ్డికి చేరవేశారు. దీంతో దస్తగిరమ్మ కోర్కె నెరవేర్చాలని ప్రతిపక్ష నేత నిర్ణయించుకున్నారు. ఆ మేరకు శనివారం రాత్రి ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని బొజ్జవారిపల్లెలోని దస్తగిరమ్మ ఇంటికెళ్లారు. ఆమెను ఆప్యాయంగా పలకరించారు. తనపట్ల చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అక్కడ్నుంచీ నేరుగా మాబు సుబ్‌హాని దర్గాకు చేరుకుని లడ్డూలతో తులాభారం తూగడం ద్వారా మొక్కు చెల్లించారు. ఎట్టకేలకు నాలుగేళ్లకు తన ఎదురుచూపులు ఫలించి అనుకున్న మొక్కును తీర్చినందుకుగాను దస్తగిరమ్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయింది.