జిల్లా ప్రజలకు జగన్ బాసట
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లా ప్రజలకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని, ప్రజా పక్షాన పోరాటాలు చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని చెప్పారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన నాని మాట్లాడుతూ నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్లో ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలకు జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంతో జగన్‌మోహన్‌రెడ్డి వారి తరఫున పోరాటం చేశారని, ఫలితంగా ప్రభుత్వం నిర్వాసితులకు రూ.10 లక్షలు చెల్లించిందని జ్ఞప్తికి తెచ్చారు. ఏలూరులో యువభేరి నిర్వహించి యువకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. జిల్లా ప్రజలూ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంచి రాజకీయన నేతగా గుర్తింపు తెచ్చుకున్న కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌బాబు పార్టీలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 29న ద్వారకా తిరుమలలో జరిగే భారీ బహిరంగ సభకు జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆ సభను విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. అలాగే ఏలూరు నగరంలో ముఖ్యనేతగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యాహ్నపు బలరాం జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పయనించడానికి నిర్ణయించకుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. అనంతరం ముఖ్య అతిథి, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్నిసీట్లూ కట్టబెట్టిన ప్రజలకు ప్రత్యేక న్యాయం చేస్తానని వాగ్దానాలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకూ అన్యాయమే చేశారని విమర్శించారు. జిల్లాలోని రైతులకు దక్కాల్సిన గోదావరి నీటిని పట్టిపసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జిల్లాకు తరలించుకుపోవడం దారుణమన్నారు. ఆయన దృష్టి అంతా కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే కేంద్రీకరించి జిల్లాకు తీరని అన్యాయం చేశారన్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు బలహీనులనే లక్ష్యంగా చేసుకుని వారిపై క్రిమినల్ కేసులు పెడుతూ దుష్ట సంప్రదాయానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు రాజకీయాలను నేరమయం చేశారని, నేరగాళ్ళే ఆ పార్టీ నాయకులుగా ఉన్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు ప్రాధాన్యం సంతరించుకుందని, ఆ సభను విజయవంతం చేయడం ద్వారా జిల్లా ప్రజలు వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారనే సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ కోటగిరి శ్రీధర్ బాబు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీలో లేకపోయినా.. చేరతానని తెలిసిన నాటి నుంచి పార్టీ నాయకులు తనను సొంతమనిషిలా ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తన తండ్రి 25ఏళ్లు టీడీపీకి సేవ చేసినా.. తనకు ఆ పార్టీ ఎప్పుడూ సొంత పార్టీలా అనిపించలేదన్నారు. నాన్న వెంట నడిచిన నాయకులంతా తనను కూడా తమ బిడ్డగా ఆదరిస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కూడా తనను సోదరునిలా, స్నేహితునిలా ఆహ్వానించి కలిసి పనిచేద్దామనడం తనను కదిలించిందన్నారు. ఇకపై తాను జగన్‌మోహన్‌రెడ్డి వెంటే పయనిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొద్వాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, మంచెం మైబాబు, మామిళ్ళపల్లి జయప్రకాష్ దిరిశాల వరప్రసాద్, మున్నుల జాన్ గురునాథ్,చెలికాని రాజమోహనరావు, అప్పన ప్రసాద్, బొమ్మనబోయిన అశ్వనీ కుమార్, మెట్లపల్లి సూర్యనారాయణ, ఘంటా ప్రసాదరావు, పాలడుగు సత్యనారాయణ, కత్తుల రవి కుమార్, తాతా సత్యనారాయణ, సంపంగి తిలక్, చట్టగొళ్ళ తేజ, మొరవనేని భాస్కరరావు, పానుగంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.