మా నాయకులు ఫోన్ చేస్తే మాట్లాడరు..
ఏలూరు (మెట్రో) : అధికారులే లక్ష్యంగా జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులు చెలరేగి పోయారు. మాటల తూటాలు పేల్చారు. ప్రభుత్వ లోపాలన్నిటికీ అధికారులే బాధ్యులంటూ విరుచుకుపడ్డారు. ‘మా నాయకులు ఫోన్ చేస్తే మాట్లాడరు.. ఏ పని చెప్పినా చేయడం లేదు.. మమ్మల్నీ లంచాలు అడుగుతున్నారు.
మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది’ అంటూ నిప్పులు చెరిగారు. ‘మా నాయకులు అడిగే విషయాలకు సమాధానం చెప్పకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షత గురువారం జరిగింది. తొలుత ఉపాధి హామీ పథకం ప్రగతిపై సమీక్ష ప్రారంభించిన ప్రజాప్రతి నిధులు అడుగడుగునా అధికారులపై విరుచుకుపడ్డారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఆ శాఖ అధికారులపై మూకుమ్మడిగా మాటల యుద్ధం మొదలుపెట్టారు.
తన నియోజకవర్గ పరిధిలో వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది లేకుండాపోయారంటూ నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు డీఎంహెచ్‌వో కోటేశ్వరిపై ఒంటికాలిపై లేచారు. ఫోన్ చేసినా సమాధానం చెప్పడం లేదన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ చిన్న రోగానికీ రిఫరల్ అంటూ వేరే ఆసుపత్రులకు తరలిస్తున్నారని, కనీసం నాడి పట్టుకుని రోగం ఏమిటో కూడా వైద్యులు చూడటం లేదన్నారు. కొవ్వూరు జెడ్పీటీసీ మాట్లాడుతూ లంచం ఇస్తేనే వైద్యం చేస్తున్నారని, తాను ఓ గర్భిణిని వైద్యసేవల కోసం తీసుకెళితే రూ.5 వేలు ఇస్తేనే వైద్యం చేస్తామన్నారని ఆరోపించారు. గోపాల పురం ఎమ్మెల్యే ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఎవరిని బదిలీ చేస్తున్నారో, ఎవరిని నియమిస్తున్నారో కూడా తెలియడం లేదన్నారు.
ఫోన్లు కూడా మాట్లాడలేరా
ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కల్పించుకుని ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కూడా మాట్లాడలేని స్థితిలో ఉంటున్నారా.. ఇలాగైతే వేరే చోటు చూసుకోండి’ అన్నారు. ఇలా అయితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వో కోటేశ్వరి మాట్లాడుతూ లోపాలను సవరించుకుంటామన్నారు. సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని, త్వరలోనే కలెక్టర్‌కు నివేదిస్తామని అన్నారు.
రుణ మాఫీ పత్రాలెక్కడ
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రుణమాఫీ పొందిన రైతులకు రెండోవిడత రుణ మాఫీ పత్రాలు అందలేదన్నారు. కాపు రుణాలకు సబ్సిడీ అందడం లేదన్నారు. ఇదిలావుండగా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పనితీరుపై జెడ్పీటీసీలు విమర్శలు గుప్పించారు. ప్రతినెలా 85 వేల కార్డుదారులకు రేషన్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రతి నెలా సమస్యలు ఎందుకు వస్తున్నాయని విరుచుకుపడ్డారు. నియోజకర్గంలో ఎక్కడ కుట్టుమెషిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు సమాధానమిస్తూ నియోజకర్గంలో ఏదో ఒక మండల కేంద్రంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామనీ, ఇకపై సమాచారాన్ని అందిస్తామని చెప్పారు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 800 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ భాస్కర్‌భూషణ్ మాట్లాడుతూ జిల్లాలో సాగులో యాంత్రీకరణణు ప్రోత్సహిస్తున్నామన్నారు.
ఇదేం పరిపాలన : ఎమ్మెల్సీ శేషుబాబు
ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నేటికీ ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయలేదన్నారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు ఇస్తున్నాం, పామాయిల్ ఇస్తున్నాం, అన్ని నిత్యావసరాలు ఇస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కేవలం బియ్యం, పంచదార ఇచ్చి చేతులు దులుపుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇళ్లు అనే నినాదంతో గృహాలు మంజూరు చేసినా జిల్లాలో ఒక్క గృహాన్ని కూడా పేదలకు నిర్మించి ఇవ్వకుండా రాష్ర్ట ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, గన్ని వీరాంజనేయులు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు వెంకటరమణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు రామమూర్తి, జెడ్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.