ఖజానా ఖాళీ | zp treasury empty | Sakshi
Sakshi News home page

ఖజానా ఖాళీ

Published Sun, Mar 12 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

ఖజానా ఖాళీ

ఖజానా ఖాళీ

- తలకిందులవుతున్న జెడ్పీ
- పెద్ద నోట్ల రద్దుతో తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు
- పడిపోయిన స్టాంప్‌ డ్యూటీ ఆదాయం
- ఉచిత ఇసుకతో సీనరేజి ఆదాయానికీ గండి
- అందని ఆర్థిక సంఘం నిధులు
- గ్రాంటు ఇవ్వని ప్రభుత్వం
- వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇవ్వలేమంటున్న యంత్రాంగం
భానుగుడి (కాకినాడ సిటీ) : పెద్ద నోట్ల రద్దు.. ప్రభుత్వ విధానాల పుణ్యమా అని జిల్లా పరిషత్‌ నడ్డి విరుగుతోంది. వివిధ రూపాల్లో రావాల్సిన ఆదాయానికి గండి పడడంతో ఖజానా ఖాళీ అవుతోంది. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితి తలకిందులవడంతో.. వచ్చే నెలలో రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం కష్టమేనని స్వయంగా జెడ్పీ చైర్మనే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నోటు పోటు
పాత రూ.1000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేవారిపై ఆదాయపన్ను శాఖ ఓ కన్ను వేయడంతో.. జిల్లాలో భూముల క్రయవిక్రయాలు 70 శాతం పైగా పడిపోయాయి. జీఓ నంబరు 725/1998 ప్రకారం రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి జెడ్పీకి స్టాంపు డ్యూటీ, సర్‌చార్జి రూపంలో 1/5వ వంతు సొమ్ము జమ చేయాలి. గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఈ రూపంలో రూ.12,19,39,000 జెడ్పీకి జమ అయ్యింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ఆదాయం రూ.27 లక్షలకు మించలేదు. స్టాంపుడ్యూటీ, సర్‌చార్జి రూపంలో ఏడాదికి రూ.24 కోట్లు పైగా రావాల్సి ఉండగా, ఇప్పటివరకూ 50 శాతం మాత్రమే వచ్చింది.
సీనరేజి ఆదాయానికి బ్రేక్‌
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ దళారులకు కాసులు కురిపిస్తుండగా.. జెడ్పీ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండికొట్టింది. ఇసుక వేలం పాటల ద్వారా జెడ్పీకి మినరల్‌ సెస్సు సీనరేజి వాటా రూపంలో ఏటా రూ.100 కోట్లు పైగా ఆదాయం వచ్చేది. గత ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి రూ.33.12 లక్షలు వచ్చింది. అనంతరం మారిన ప్రభుత్వ నిబంధనలతో ఈ పద్దు కింద దమ్మిడీ ఆదాయం కూడా రాలేదు. మరోపక్క ప్రభుత్వం నుంచి జెడ్పీకి వివిధ పద్దుల రూపంలో రూ.59 కోట్లు రావాల్సి ఉంది. రెండేళ్ళ నుంచి ఈ నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.
ఆర్థిక సంఘం నిధులు లేవు.. తలసరి గ్రాంటు రాదు
గతంలో గ్రామ పంచాయతీలకు జిల్లా పరిషత్‌ల నుంచి 14వ ఆర్థిక సం«ఘం నిధులు కేటాయించేవారు. కొద్దికాలంగా ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తున్నారు. దీంతో జెడ్పీకి వచ్చే నిధుల శాతం సగానికి పడిపోయింది. అలాగే, జనాభా లెక్కల ప్రకారం 41,76,541 మందికి తలసరి రూ.4 చొప్పున గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ రూ.75 లక్షల గ్రాంటు విడుదల చేశారు. తదనంతర కాలంలో ఈ నిధులు సైతం ప్రభుత్వం నుంచి సకాలంలో రావడంలేదు.
ఆదాయం రూ.27 లక్షలు.. పెన్షన్లకు రూ.43 లక్షలు..
జెడ్పీలో పదవీ విరమణ పొందిన 465 మంది మినిస్టీరియల్‌ సిబ్బందికి ప్రతి నెలా రూ.43 లక్షల పెన్షన్‌ చెల్లిస్తున్నారు. ఇసుక సీనరేజి, స్టాంపు డ్యూటీ, ఇతర పద్దుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెన్షన్లు, ఇతర పనులకు కేటాయించేవారు. ప్రస్తుతం ఖజానాలో రూ.27 లక్షలు మాత్రమే ఉంది. దీంతో వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇవ్వలేమని సాక్షాత్తూ జెడ్పీ చైర్మనే చేతులెత్తేస్తున్నారు. ఆదాయం తగ్గిపోవడంతో ఈ ఏడాది రిటైరైన 21 మంది దరఖాస్తులను కూడా జెడ్పీ స్వీకరించలేదు. దీనిపై వారు లోకాయుక్తను కూడా ఆశ్రయించారు.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం
వచ్చే నెల నుంచి జెడ్పీ రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.59 కోట్లు తక్షణమే ఇచ్చి ఆదుకోవాలని కోరాం. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. నిధులు రాకుంటే వచ్చే నెలలో పెన్షన్లు ఇవ్వలేం.
- నామన రాంబాబు, జెడ్పీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement