విధానపరమైన నిర్ణయాలనదగ్గ కీలక అంశాలను ప్రకటించడానికి సైతం ట్వీటర్‌ను వేదికగా చేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌కు ఇకపై ఆర్థిక సాయం నిలిపివేయదల్చుకున్న విషయాన్ని కూడా ఆ మాధ్యమం ద్వారానే ప్రకటించి సంచలనం సృష్టించారు. ఉగ్రవాదాన్ని అరికడతానని ఎప్పటి కప్పుడు కట్టుకథలల్లి ఈ పదిహేనేళ్లలో ఆ దేశం అమెరికా నుంచి రూ. 2.1 లక్షల కోట్ల సాయం పొందిందని, సరిగ్గా అందుకు విరుద్ధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆయన అభియోగం. ఈ ఏడాది దానికి అందాల్సిన సాయాన్ని అమెరికా నిలిపివేస్తుందన్న సూచనలు కూడా అందుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమైన మర్నాడు తొలి ట్వీట్‌గా ట్రంప్ ఈ అంశాన్ని ఎంచుకోవడం వల్ల దీని తీవ్రత మరింత పెరిగింది. పాకిస్తాన్ విషయంలో అమెరికా వ్యవహారశైలిని ఇన్నే ళ్లుగా గమనిస్తున్నవారికి ట్రంప్ తాజా ప్రకటన కాస్త గందరగోళంగానే అని పించవచ్చు. ఆయనంత కఠినంగా కాకపోయినా గతంలో అమెరికా అధ్యక్షులుగా ఉన్న వారు సైతం పాక్‌ను హెచ్చరించిన సందర్భాలున్నాయి. అప్పుడప్పుడు ఆ దేశానికి ఇవ్వాల్సిన సాయం తాత్కాలికంగా నిలిపేసిన ఉదంతాలు కూడా లేక పోలేదు. కానీ కొంతకాలం గడిచాక పాకిస్తాన్ చక్కగా సహకరిస్తున్నదని ప్రశం సించడం, ఆర్థిక సాయాన్ని విడుదల చేయడం రివాజే. కానీ ఇప్పుడు ట్రంప్ చేసింది వేరు. ఆయన బహిరంగంగా చీవాట్లు పెట్టారు. ఛీత్కరించారు.
పాకిస్తాన్ వ్యవహారశైలి ఎలా ఉంటున్నదో, దానివల్ల పొరుగు దేశమైన తమకు ఎన్ని సమస్యలొస్తున్నాయో అమెరికా వద్ద, ఐక్యరాజ్యసమితిలోనూ భారత్ మొత్తు కుంటూనే ఉంది. ఉగ్రవాదం పెచ్చరిల్లిన ఈ రెండు దశాబ్దాల్లో అందుకు ఎన్నో ఉదంతాలను దాఖలాలుగా చూపింది. 168మంది ప్రాణాలు కోల్పోయిన 2008 నాటి ముంబై ఉగ్రదాడికి కుట్ర పాకిస్తాన్ గడ్డపైనే జరిగినట్టు ఉగ్రవాది కసబ్ చెప్పిన సాక్ష్యాలున్నాయి. తమ జాతీయుడైన డేవిడ్ హెడ్లీ లష్కరే తొయిబా ఏజెం ట్‌గా పనిచేస్తూ ఆ దాడికి పథకరచన చేశాడని అతన్ని అరెస్టు చేశాక అమెరికాయే తెలుసుకుంది. అయినా పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం, ఆయుధ సామగ్రి అమ్మకం ఆగలేదు. అదంతా స్పష్టంగా తెలిసి చేసిన సాయమే తప్ప... పాక్ చెప్పిందంతా అమాయకంగా విశ్వసించి, మూర్ఖంగా చేసిన పని కాదు. ఎందుకంటే పాకిస్తాన్‌లో ఏం జరుగుతున్నదో, ఎవరేం చేస్తున్నారో... ఏ ఉదంతం వెనక ఏముందో సర్వం అమెరికాకు క్షుణ్ణంగా తెలుసు. అయినా ఇన్నేళ్లనుంచీ మెత్తగా మందలింపులు... చిన్నగా బెదిరింపులు... అప్పుడప్పుడు ఆగ్రహావే శాలూ, అటు తర్వాత బుజ్జగిం పులు, ప్రశంసలు, సాయాలు–ఇవన్నీ మామూలే. మొన్న అక్టోబర్‌లో ఇదే ట్రంప్ పాకిస్తాన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసించారు. రెండు నెలలు గడిచేసరికల్లా స్వరం ఎందుకు మారిందన్న సందేహం అందరికీ కలుగుతోంది.
అటు పాకిస్తాన్ ఎక్కడలేని అమాయకత్వాన్నీ ప్రదర్శిస్తోంది. ట్రంప్ వ్యాఖ్య లను తీవ్రంగా తీసుకున్నట్టు కనబడటానికి తెగ హడావుడి చేస్తోంది. కేబినెట్ ప్రత్యేక భేటీ నిర్వహణ, అమెరికా రాయబారిని పిలిపించి నిరసన తెలపడం, ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు జరిపించడం వగైరాలతో మంగళవారం గడిచి పోయింది. నిజమే... ట్రంప్ చేసిన బహిరంగ వ్యాఖ్యల్ని ఆత్మగౌరవమున్న ఏ దేశమూ భరించలేదు. అయితే తాను చెప్పుకుంటున్నట్టు నిజంగా పాకిస్తాన్ నిష్కపటమైన దేశమైతే, అది చిత్తశుద్ధితో ఉగ్రవాదంపై పోరాడుతుంటే నిరసన వ్యక్తం చేయడంతో సరిపెట్టక అమెరికాతో అన్ని రకాల సంబంధాలనూ తెగ దెంపులు చేసుకునేది. కానీ అలా చేయలేదు. ఆ రెండింటిమధ్యా ఉన్న బాంధ వ్యానికి దాదాపు అర్ధ శతాబ్ది చరిత్ర ఉంది. ప్రత్యేకించి అప్ఘానిస్తాన్‌లో సోవియెట్ దురాక్రమణ తర్వాత అది మరింత చిక్కబడింది.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మన దేశంపై పాకిస్తాన్ కయ్యానికి కాలుదువ్వడం వెనక అమెరికా ఆశీస్సులు పుష్క లంగా ఉన్నాయి. అప్పుడు మన విదేశాంగ విధానం మొగ్గు సోవియెట్ వైపు ఉండటమే దీనికి కారణం. పాకిస్తాన్ పాలకులు, సైనికాధికారులు అమెరికా డాలర్ల మోజులో అది చెప్పినట్టు ఆడారు. పాకిస్తాన్‌లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి సైనిక పాలకులు అధికారం గుంజుకున్న ఉదంతాల వెనక అమెరికా ప్రోద్బలం ఉండేదని ప్రపంచానికంతకూ తెలుసు. అక్కడి వ్యవస్థలు భ్రష్టుపట్టడంలో దాని పాత్ర తక్కువేమీ కాదు. అమెరికా సాగిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగ స్వామ్యం వహించి తమ సైనికులు, పౌరులు ఎందరో ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ ఇప్పుడంటున్నది గానీ దానికి నారూ నీరూ పోసి పెంచింది తానేనన్న విషయాన్ని అది దాచిపెట్టే ప్రయత్నం చేసింది.
తన వనరులను సక్రమంగా వినియోగించుకుని, ఇరుగుపొరుగుతో సఖ్యంగా ఉంటూ, పరస్పర సహకారంతో ఎదగాలని... తమ దేశాన్ని అత్యున్నతంగా తీర్చి దిద్దాలని పాకిస్తాన్‌లోని పౌర లేదా సైనిక పాలకులు అనుకోలేదు. అందుకు భిన్నంగా దేశాన్ని అమెరికా ఉపగ్రహంగా మార్చి దాని ప్రయోజనాలను నెర వేర్చడం, పనిలో పనిగా స్వీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో వారు తల మునకలయ్యారు. ఫలితంగా పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అక్కడ పేదరికం, ఉపాధిలేమి, మతోన్మాదం వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. మన దేశానికి కూడా ఎంతో నష్టం జరిగింది. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చైనా రంగంలోకి పాకిస్తాన్ నడవడి చాలా గొప్పదంటూ సర్టిఫికెట్ ఇస్తోంది. ఇలాంటి ఉచ్చులో పడక తెలివిగా మసులుకుని తన తప్పులు సరిదిద్దుకోవడం పాకిస్తాన్‌కు క్షేమదాయకం. భారత్, పాక్ జాతీయ భద్రతాసలహాదారులిద్దరూ ఇటీవలే కలుసు కున్నారని, పలు సమస్యలపై చర్చించుకున్నారని తాజా కథనాలు చెబుతున్నాయి. ఎవరి ప్రమేయమూ లేకుండా ఇరుదేశాలూ ఇలా పరస్పరం చర్చించుకుని సమ స్యల పరిష్కారానికి పూనుకుంటే రెండు దేశాలూ అత్యున్నత స్థాయికి చేరతాయి. అమెరికా బహిరంగ చీవాట్ల తర్వాతనైనా ఆ సంగతిని పాకిస్తాన్ గ్రహించవలసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment