కేన్సర్‌ను జయించవచ్చు ! | cancer to be cured! | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ను జయించవచ్చు !

Published Tue, Feb 24 2015 12:29 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

cancer to be cured!

కాశీ యాత్రంటే కాటికి వెళ్ళడమేనని పూర్వపు మాట. ప్రస్తుతం రైళ్ళు, బస్సులే కాదు, విమానాల్లో సైతం కాశీ యాత్రను మూడురోజుల్లో ముగించే సౌకర్యాలు వచ్చాయి. అటువంటిదే వెనకటి కాలపు రాచపుండు, దాని చుట్టూ అల్లుకున్న భయసందేహాలు, ఆధునిక కాలంలో అనుసరిస్తున్న చికిత్సా విధానం. కేన్సర్ వ్యాధి అనగానే ప్రాణభీతితో వణికిపోయే రోజులు వచ్చే ఐదేళ్ళలో అంతరిస్తాయనీ, సుగర్, బీపీల మాదిరే అదికూడా దీర్ఘకాలిక చికిత్సకు లొంగే వ్యాధిగా అదుపులోకి రానున్నదనీ విఖ్యాత కేన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆదివారం హైదరాబాద్‌లో భరోసా ఇచ్చారు.
 
  దేశంలోని లక్షలమంది కేన్సర్ వ్యాధిగ్రస్తులకు, ఆ వ్యాధి తొలిదశ  లక్షణాలు గల వారికి ఇది  సాంత్వననిస్తుంది, జీవితేచ్ఛని పెంచుతుంది. ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ తెలుగు ప్రముఖుడు అమెరికాలో అగ్రశ్రేణి కేన్సర్ వైద్య  నిపుణుడు. అమెరికాలో కంటే భారత్‌లోనే కేన్సర్ చికిత్సకు ఉపయోగించే మాత్రలు చవగ్గా లభ్యమవుతున్నాయని, ప్రస్తుతం అవి ఊపిరితిత్తులు, లుకేమియా (బ్లడ్‌కేన్సర్)లకే పరిమితమైనా, మున్ముందు అన్ని రకాల కేన్సర్‌లకూ చికిత్స ఖర్చు తగ్గనుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు అంతర్జాతీయంగా చేస్తున్న పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చాయని, వాటి ఫలితాలు త్వరలోనే సామాన్య రోగులకూ అందుబాటులోకి వస్తాయని డాక్టర్ నోరి చెప్పారు. పేద, ధనిక, పల్లె, పట్టణం తేడా తెలియని మహమ్మారి -  కేన్సర్.  ఇది సోకిన వేలమందికి 1970, 1980 దశకాల వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి మద్రాసు శివారులోని అడయార్ ఆస్పత్రి లేదా చిత్తూరు సరిహద్దున గల వెల్లూరు ఆస్పత్రులే దిక్కు. స్వరా్రష్టంలోనైతే హైదరాబాద్ ఎంఎన్‌జే  కేన్సర్ ఆస్పత్రే శరణ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించి, అప్పటికి అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలకు రోగి స్పందిస్తే అదృష్టం. లేదంటే దైవాధీనం. ఆ తరవాత ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్‌పై అనేక సంస్థలు ఎడతెగని పరిశోధనలు సాగించాయి. ఫలితంగా, కొన్ని రకాల కేన్సర్ల బారి నుంచి వ్యాధిగ్రస్తులు పాక్షికంగానైనా  విముక్తి పొందారు. ఇదంతా కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకోగలిగిన స్తోమత గల సంపన్నులకే. వ్యాధి ముదిరి, అమెరికా తీసుకెళ్లినా ఫలితం కనబడక ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014 నాటికి సైతం ప్రభుత్వ రంగంలో పూర్తి స్థాయి కేన్సర్ ఆస్పత్రిగా చెప్పదగిన వైద్యాలయం నిజాంల కాలం నాటి ఎంఎన్‌జే ఒక్కటే. ఆ తరవాత ఎన్టీఆర్ సంకల్పంతో హైదరాబాద్‌లో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ప్రారంభమైంది.
 
 పస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకూ ఉన్నంతలో ఆధునిక రేడియేషన్  యంత్రాలు, పరికరాలు, శస్త్ర చికిత్సా సదుపాయాలు, పేద, మధ్యతరగతి వారికి  అందుబాటు చార్జీలలో పడకలు గల ప్రైవేటు రంగంలోని ప్రత్యేక  కేన్సర్ ఆస్పత్రి ఇదే. వైఎస్ హయాంలో పేదల పెన్నిధిగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం కింద రేడియేషన్, కీమో చికిత్సలకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ప్రభుత్వం బిల్లు చెల్లించి కొంతలో కొంత ఆదుకుంది. ఆరోగ్యశ్రీని ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పథకంగా మార్చారు. కేన్సర్ వ్యాధితో కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే చికిత్స సాపేక్షంగా మెరుగ్గానే ఉంటుంది గాని , అవి వేసే బిల్లులను చెల్లించగల శక్తి ఎందరికి ఉంటుంది?
 
 వాస్తవానికి, ఏటా రెండు రాష్ట్రాల్లో ఎంతమంది కేన్సర్ బారిన పడుతున్నారు? వారిలో ఎంతమంది ఎక్కడ చికిత్స పొందుతున్నారు? ఎందరు స్పందిస్తున్నారు? వంటి లెక్కలేవీ (డేటా) ప్రభుత్వం వద్ద లేవు. దేశంలో ప్రస్తుతం 35 లక్షల కేన్సర్ రోగులుంటే వారిలో లక్షా, లక్షన్నర మంది తెలుగు రాష్ట్రాల్లో ఉంటారని అంచనా. రోగుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను బట్టి కేన్సర్ చికిత్స జరుగుతోంది. ఇందులో సర్జరీ, కీమో థెరపీ, రేడియేషన్ చికిత్సలు ముఖ్యమైనవి. వ్యాధిగ్రస్తుల వయస్సు, వ్యాధి దశ, త ట్టుకునే తత్వం, వ్యాధి నిరోధక శక్తి వంటి అంశాలు కేన్సర్ చికిత్సలో కీలకం. వీటన్నింటి కంటే, కేన్సర్ నివారణ చర్యలు, జాగ్రత్తలు, తొలి దశలోనే కనుగొనడం వంటివి సత్ఫలితాలనిస్తాయని డాక్టర్ దత్తాత్రేయుడు చెప్పారు. అమెరికాలో గత 50 ఏళ్లలో ఏటా నమోదయ్యే మహిళల్లో రొమ్ము కేన్సర్ కేసులు గణనీయంగా తగ్గి, ప్రస్తుతం 16 వేలకు చేరుకున్నాయని, ఇంతకు ముందు ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఏ వ్యాధి చికిత్సకైనా  ఒక మహిళ ఏ ఆస్పత్రికి వెళ్లినా తప్పనిసరిగా ఆమెకు రొమ్ము, గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని అక్కడి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని, మన దేశంలోనూ ఈ విధానం అనుసరించాలని ఆయన సూచించారు. 2020 నాటికి తెలుగు రాష్ట్రాల్లో కేన్సర్ బెడద లేని వ్యవస్థ తన లక్ష్యమని, ఈ మేరకు రెండు ప్రభుత్వాలకూ నిర్దిష్ట ప్రణాళికలు అందజేస్తానని  డాక్టర్ నోరి చెప్పారు.
 
  సగటు ఆయుర్దాయం పెరిగినందున 60 లేదా 65 ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్‌లు స్త్రీ, పురుష తేడా లేకుండా కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటున్నాయి. పర్యావరణ, ఆహార, నీటి కాలుష్యాలు, జన్యుపరమైన వార సత్వాలు, పొగాకు, మద్యపానం వంటి  దురలవాట్లు ఇందుకు దారి తీస్తుం టాయి.ఊపిరితిత్తులు, ఉదరం, పేగులు, మలద్వారం, పాంక్రియాస్, గర్భా శయం, మూత్రాశయం, కాలేయం వంటి ప్రధాన శరీర భాగాలు ఎలా పని చేస్తున్నాయో కనీసం ఏడాదికి ఒక సారైనా పరీక్ష చేయించగలిగే సౌకర్యాలు రెండు రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా కల్పించగలిగితే డాక్టర్ నోరి ఆశయ సాధన అసాధ్యమేమీ కాదు. ఆ దిశగా రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తాయని విశ్వసిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement