అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కడంలేదన్న ఆందోళనలు అరణ్యరోదన లవుతుంటే... దాని విషఫలాలు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. ప్రతి ఏడాదీ మన దేశంలో కొత్తగా దాదాపు పది లక్షలమంది పౌరులు కేన్సర్ బారినపడుతుంటే దాదాపు ఏడు లక్షల మంది వ్యాధిగ్రస్తులు మరణిస్తున్నారని తాజా గణాంకాలు వెల్లడి స్తున్నాయి. వీరిలో అత్యధికులు 50 ఏళ్లలోపువారే. ఈ సంఖ్య 2035 నాటికి రెట్టింపవుతుందని అంచనా. రాచపుండుగా, రాచకురుపుగా పేరుబడి ఎవరికో, ఎక్కడో వచ్చిందని చెప్పుకునే ఈ వ్యాధి ఇప్పుడు మన ఇరుగుపొరుగునూ, మన పరిచయస్తులనూ, మన సన్నిహితు లనూ తాకిందని తరచుగా వినబడుతోంది. ఆ వ్యాధిని గుర్తించడానికి అవసరమైన పరీక్షలైనా, అందుకవసరమైన ప్రాథమిక సౌకర్యాలైనా పూర్తిగా అందుబాటులోకి రాకుండానే ఇది తన దోవన తాను విస్తరిం చుకుంటూ పోతున్నదని అర్ధమవుతుంది. ఈ వ్యాధి గురించి ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడేందుకు, దానిపై చర్చించేందుకు చాలామంది భయపడుతుంటారు. కారణం అవగాహనలేమి కావొచ్చు...అపోహలు కావొచ్చు. కానీ ప్రభుత్వాలు వీటిని పట్టించుకుని, సరిచేస్తున్న దాఖలాలు కనబడవు.
మన దేశంలో ఇప్పటికీ కేన్సర్ చికిత్స మెజారిటీ ప్రజలకు అందుబాటులో లేదు. దానికయ్యే తడిసిమోపెడు వ్యయాన్ని జనం భరించే స్థితిలో లేరు. 95 శాతం వైద్యకళాశాలల్లో కేన్సర్ గుర్తింపు, నివారణకు సంబంధించిన సమగ్ర వ్యవస్థలు లేవు. కేన్సర్ వైద్య నిపుణులు, శస్త్ర చికిత్స నిపుణుల సంగతి చెప్పనవసరమే లేదు. కొత్తగా బయటపడే 5,000 కేసులను చూడటానికి ఒక్క వైద్య నిపుణుడు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు పూర్తిగా శూన్యం. దేశ జనాభా 120 కోట్లు దాటగా, కేన్సర్ నిపుణుల సంఖ్య వేలల్లో మాత్రమే ఉంటున్నది. నిజానికి కేన్సర్‌ను ముందుగా గుర్తించడానికైనా, దాన్ని నివారించడానికైనా ఎన్నో అవకాశాలుంటాయని నిపుణులు చెప్పే మాట. ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని చెబుతారు. ఈ వ్యాధిని మృత్యువుకు మారుపేరుగా పరిగణించాల్సిన అవసరమే ఉండదంటారు. అయితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయినుంచి వైద్య సేవలు అందుబాటులో ఉండి, సకాలంలో గుర్తించగలిగితేనే ఇది సాధ్యం. ఇందుకు అవసరమైన విధాన రూపకల్పనలో పాలకులు విఫలమవుతుండటంవల్ల పరిస్థితులు తల్లకిందులవుతున్నాయి. దేశవ్యాప్తంగా కేన్సర్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటుచేయబోతున్నట్టు నిరుడు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ. 4,700 కోట్లు వ్యయమయ్యే పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పింది. కానీ, అది ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. కేన్సర్ చికిత్సలో కీలకపాత్ర పోషించే ఔషధాలను గుర్తించి, వాటి ధరలను నియంత్రించడం లేదా ఆ ఔషధాలను తామే చవగ్గా అందుబాటులోకి తీసుకురావడంవంటి చర్యల గురించి పాలకులు దృష్టిపెట్టడంలేదు.
అసలు కేన్సర్ ఎలా వస్తుంది, ఎందుకొస్తుందన్న విషయంలో అవగాహన లేమి ఆ వ్యాధి విస్తరణకు పరోక్షంగా కారణమవుతోంది. మంచి జీవనశైలి, శరీరానికి తగిన వ్యాయామం, తగినంత బరువుం డేలా చూసుకోవడం, టుబాకో ఉత్పత్తులు, మద్యంవంటివాటికి దూరంగా ఉండటంలాంటివి అమలుచేయగలిగితే చాలా కేన్సర్లను నివారించవచ్చంటారు. ఇవన్నీ మన ఆచరణవల్ల సాధ్యమయ్యేవి. కానీ మన ప్రమేయంలేని, మన అదుపులోలేని అనేకానేక పరిణామాలు కూడా కేన్సర్‌ను పెంచి పోషిస్తున్నాయి. పర్యావరణ కాలుష్యం, పంటపొలాల్లో అపరిమితంగా రసాయనాల వాడకంవంటివి సగటు మనిషి తినే తిండిని, పీల్చేగాలిని, తాగే నీటినీ విషతుల్యం చేస్తున్నాయి. అడవులను సక్రమంగా పరిరక్షించగలిగితే నిత్యమూ గాలిలో కలిసే వేల టన్నుల హానికారకాలను వృక్షాలు పీల్చుకుని మనకు ఆరోగ్యకరమైన ఆక్సిజెన్‌ను అందిస్తాయని పర్యావరణవేత్తలంటారు. కానీ, ఏటా విడుదలయ్యే కాగ్ నివేదికలు చూస్తే అడవులు తరిగిపోతున్న వైనం కళ్లకు కడుతుంది. అడవుల విధ్వంసాన్ని నివారించడానికి, వాటి పరిరక్షణకు కేటాయించే నిధుల వినియోగం అంతంతమాత్రంగా ఉంటుంటే అభివృద్ధి పేరిట వాటిని తెగనరికే సంస్కృతి పెరుగుతోంది. ఒక తీరూ తెన్నూ లేకుండా ఏటా రోడ్లపైకొచ్చే మోటారు వాహనాలవల్ల కూడా కాలుష్యం కమ్ముకుంటోంది. దేశంలో 90 శాతం నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రెండేళ్లక్రితం చెప్పింది. అపరిమితంగా వాడే ప్లాస్టిక్ సంచులు కూడా ప్రాణాంతక కేన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయని లెక్కేసి వాటి ఉత్పత్తి, వినియోగంపై ఎన్నో ఆంక్షలు విధించారు. కానీ, అమలు విషయంలో నిరాశే మిగులుతోంది. యాంటిబయాటిక్స్ అపరిమిత వాడకం కూడా కేన్సర్ కారకాల్లో ఒకటిగా గుర్తించారు. నిపుణులు ఎంతో పోరాడాక ఇలాంటి 24 ఔషధాలను వైద్యులు సూచించకుండా అమ్మకూడదని నియంత్రణ విధించారు. అయినా ఇంకా ఈ కేటగిరీలోకి తీసుకురావలసిన ఔషధాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ఒక చిన్న రక్తపరీక్షతో కేన్సర్‌ను పసిగట్టే పద్ధతులు ఆచరణలోకొస్తుంటే దానికి పోటీగా ప్రజారోగ్య పరిరక్షణలో పాలకుల నిర్లక్ష్యమూ... ప్రకటించిన పథకాలనైనా సక్రమంగా అమలు చేయడంలో చూపే అలసత్వమూ ఆ వ్యాధి వేగంగా విస్తరించడానికి కారణమవుతోంది. తాజా నివేదికైనా పాలకుల కళ్లు తెరిపించాలి. ఈ ప్రాణాంతక వ్యాధికి దారితీస్తున్న పరిస్థితులను అదుపు చేయడంతోపాటు దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన వైద్య నిపుణులను, సౌకర్యాలను అందుబాటులోకి తేవాలి.
విస్తరిస్తున్న మహమ్మారి!
Published Fri, Apr 18 2014 12:22 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement