
ప్రతీకాత్మక చిత్రం
‘కరోనా జాడ కనిపెట్టి, దాన్ని అరికట్టడానికి తోడ్పడటంలో చైనా చేసిన మేలు మరువలేనిది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకూ ఈ చర్య ఎంతో దోహదపడుతుంది’ అని బీజింగ్‌లో మన రాయబారి విక్రమ్ మిస్రీ ఏప్రిల్ 15న వ్యాఖ్యానించారు. కోటిన్నర వ్యక్తిగత పరిరక్షణ ఉప కరణాలు(పీపీఈలు), మరికొన్ని లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు చైనా మన దేశానికి పంపి నప్పుడు ఆయన ఈ మాటలన్నారు. కానీ పక్షం రోజులు గడవకుండానే భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) కిట్ల వాడకాన్ని నిలిపేయమని అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలివ్వాల్సి వచ్చింది. అంతేకాదు... వీటిని తిప్పి పంపాలని కూడా నిర్ణయించింది. వ్యాపార వ్యవహారాల్లో ఇలాంటి సమ స్యలు తలెత్తడం కొత్తేమీ కాదు. కిట్ల విశ్వసనీయత సరిగా లేదన్న ఆరోపణలొచ్చినప్పుడు జరిగిం దేమిటో తెలుసుకోవడం, తమ శాస్త్రవేత్తల్ని పంపి పరిశీలించడం, వాడకంలో లోటుపాట్లుంటే అవి ఎత్తి చూపడం... పనిచేయకపోవడం వాస్తవమైతే వెనక్కి తీసుకుని, మెరుగైనవి ఇస్తామని చెప్పడం చైనా బాధ్యత. కానీ ఆ దేశం ఇందుకు భిన్నంగా మాట్లాడింది. ‘మా ఉత్పత్తుల్నే తప్పుబడతారా, మా సౌహార్దాన్ని, మా చిత్తశుద్ధిని శంకిస్తారా?’ అంటూ విరుచుకుపడింది.
ప్రపంచంలోనే మొట్టమొదట కరోనా మహమ్మారి బారినపడిన చైనా ఈ వ్యాధికారక వైరస్ ఆచూకీ పట్టడానికి అవసరమైన కిట్‌ను రూపొందించింది. వుహాన్‌తోపాటు ఆ సమీప నగరాలను కూడా పూర్తిగా దిగ్బంధించి, ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఏప్రిల్ 9 కల్లా ఆ మహమ్మారి నుంచి విముక్తమైంది. ఈ వ్యాధికి మొత్తం 4,632మంది మరణించారని అది వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి బారినపడినవారు దాదాపు 90,000మంది. ఇంత పెద్ద మహమ్మారిని జయప్రదంగా ఎదుర్కొన్నది కాబట్టే ఆ దేశం సరఫరా చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల నుంచి వెంటిలేటర్ల వరకూ అన్నిటిపైనా అందరికీ ఎంతో నమ్మకం ఏర్పడింది. కనుకనే దాదాపు అన్ని దేశాలూ వీటి కోసం క్యూ కట్టాయి. అమెరికా అడ్డదోవ తొక్కి వేరే దేశాలకు ఉద్దేశించిన సరుకును తన్ను కుపోయిందన్న కథనాలు కూడా వెలువడ్డాయి. కరోనా పుట్టుపూర్వోత్తరాలపై ఎలాంటి అనుమానా లున్నా, ఏ మాదిరి వదంతులు వ్యాప్తిలో వున్నా... అన్ని దేశాలూ చైనా ఉత్పత్తులపై అంతగా నమ్మకాన్ని వుంచినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి ఆ దేశం ప్రయత్నించాలి.
సరఫరా చేసే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు సరిగా వున్నాయో లేదో నిర్ధారిం చుకుని వుంటే బాగుండేది. కానీ ఆ పని సరిగా జరిగినట్టు లేదు. కిట్ల నాణ్యతపై మన దేశం మాత్రమే కాదు.. ఇంచుమించు అన్ని దేశాలదీ అదే ఫిర్యాదు. ఒకరు చెప్పారంటే దురుద్దేశం అనుకోవచ్చు. ఇద్దరు చెబితే అవగాహనా రాహిత్యమనుకోవచ్చు. ఇంతమంది చెబుతుంటే కొట్టి పారేయడం దబాయింపు అవుతుంది. తన ఉత్పత్తులపై తనకు మాత్రమే విశ్వాసం వుంటే సరిపోదు. అది అందరిలోనూ కలిగే స్థాయిలో వాటి ప్రమాణాలుండాలి. ఐసీఎంఆర్ పుణేలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో తమ ఉత్పత్తుల్ని పరీక్ష చేయించి, ధ్రువీకరించిందని, ఆ తర్వాతే ఆర్డరిచ్చిందని చైనా వాదన. అలాగే వాటిని యూరప్, దక్షిణ అమెరికా ఖండ దేశాలకు, ఆసియాలోని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేశామని ఆ దేశం అంటోంది. నిజమే కావొచ్చు...కానీ ఈ దేశాలన్నీ ఏదో ఒక దశలో తప్పుబట్టాయి. తమకు నాసిరకం కిట్లు పంపిణీ చేసినందుకు చెల్లించిన సొమ్ము వెనక్కి ఇవ్వాలని స్పెయిన్ కోరింది. ఆ దేశం తొలి దశలో 950 వెంటిలేటర్లు, 55 లక్షల కిట్లు, కోటి పది లక్షల గ్లోవ్స్, 50 కోట్ల మాస్క్‌లు ఆర్డరిచ్చింది.
అందుకు దాదాపు 47 కోట్ల డాలర్లు చెల్లించింది. కానీ వచ్చిన కిట్లన్నీ నాసిరకమని ఆరోపించి, ఇప్పటికే ఆర్డరిచ్చిన మరో 6,40,000 కిట్లు అవసరం లేదని తెలిపింది. నెదర్లాండ్స్ కూడా ఈ పనే చేసింది. స్లోవేకియా, టర్కీ, బ్రిటన్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సైతం ఈ కిట్ల పని తీరు బాగోలేదని తేల్చారు. ఏ కిట్ అయినా నూటికి నూరు శాతం బాగుండాలని ఎవరూ అడగరు. అది అశాస్త్రీయం కూడా. ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష ఫలితాలతో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఫలితాలను పోల్చినప్పుడు రెండింటిమధ్యా సారూప్యత 80 శాతం వరకూ వుంటే ప్రమాణాలు బాగున్నట్టు లెక్క. కానీ చైనా కిట్లు 30శాతం లోపు వద్దనే నిలిచిపోయాయి. వాస్తవానికి మన దేశం చైనా కిట్లకు ఆర్డరిచ్చేనాటికే యూరప్ దేశాలు వాటి పనితీరును ప్రశ్నిం చాయి. పైగా ధర కూడా ఎక్కువని విమర్శలొచ్చాయి. అయినా ఐసీఎంఆర్ వీటినే ఎందుకు ఎంచు కున్నదో తెలియదు. ఇదే సమయంలో దక్షిణ కొరియా కిట్లు ఎంతో ప్రామాణికంగా వున్నాయని ప్రశంసలొచ్చాయి. అమెరికాలోని చాలా రాష్ట్రాలు ఈ కిట్లనే కొనుగోలు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దక్షిణ కొరియా నుంచే దిగుమతి చేసుకుంది. ఐసీఎంఆర్ చైనా కిట్లపై మొదట్లో సంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే. అది 5 లక్షల కిట్లు తెప్పించి, అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేసింది. కానీ పశ్చిమ బెంగాల్, రాజస్తాన్‌ల నుంచి ఫిర్యాదులొచ్చాక వాస్తవమేమిటో విచారణ జరి పింది. రెండు రోజులపాటు నిలిపేయమని అందరినీ కోరింది. ఆ తర్వాత ఈ కిట్లు నాసిరకమని తేల్చి, వాటిని వాడొద్దని రాష్ట్రాలకు తెలియజేసింది. చైనా సరఫరా చేసిన వెంటిలేటర్లపై గానీ, వ్యక్తి గత పరిరక్షణ ఉపకరణాలపైగానీ ఎవరికీ ఫిర్యాదులు లేవు. అందరూ కిట్లు, మాస్క్‌లు పరమ నాసి రకమని అంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుని తనను ఆశ్ర యించాయో చైనాకు తెలుసు. ఇప్పటికే వివిధ దేశాల ఆరోగ్య విభాగాల అధికారులు కిట్ల కొను గోలులో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన సామగ్రితో వారందరినీ ఇరుకునపెట్టడమేకాక, ఎదురు దబాయించడం సరికాదని చైనా గుర్తించాలి. ఈ విషయంలో నిజా యతీగా విచారణ జరిపించి, లోటుపాట్లు వెల్లడైతే హుందాగా అంగీకరించడం అంతిమంగా ఆ దేశానికే మేలు కలిగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment