పాక్‌ అరకొర చర్యలు | Editorial On Pakistan Bans jud | Sakshi
Sakshi News home page

పాక్‌ అరకొర చర్యలు

Published Thu, Mar 7 2019 2:50 AM | Last Updated on Thu, Mar 7 2019 2:50 AM

Editorial On Pakistan Bans jud - Sakshi

ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌ శిక్షణ శిబిరంపై సైనిక చర్య ముగిసిందని మన దేశం ప్రకటించిన రోజే ఆ సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ కుమారుణ్ణి, అతడి సోదరుణ్ణి...వారితోపాటు మరో 42మందిని అరెస్టు చేసినట్టు, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని జమాత్‌–ఉద్‌–దవా(జేయూడీ)ను నిషేధిస్తున్నట్టు పాకిస్తాన్‌ వెల్లడించింది. ఈ చర్య వల్ల ఇరు దేశాలమధ్యా పుల్వామా ఉగ్రదాడి అనంతరం నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతానికి ఉపశమిస్తాయని అందరూ ఆశిస్తారు. గత నెల 14న పుల్వామాలో 43మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడి జరిగాక 27న మన వైమానిక దళ యుద్ధ విమానాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైనా, మరో రెండు ఉగ్ర స్థావరాలపైనా దాడులు నిర్వహించాయి.

దాంతో ఇరుదేశాలమధ్యా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల్లో నాలుగైదు రోజులపాటు భారీగా కాల్పులు జరిగాయి. మన పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కారు. అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాక్‌ ఆయన్ను చివరకు విడుదల చేయకతప్పలేదు. పుల్వామా దాడి వెనక పాక్‌లోని జైషే సంస్థ హస్తం ఉన్నదని భారత్‌ చేసిన ఆరోపణ చేశాక ‘మీ దగ్గరున్న సమాచారాన్నిస్తే చర్య తీసుకుంటాం’ అని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. దాంతో ఆ సమాచారం మొత్తాన్ని గతవారం పాకిస్తాన్‌కు అందించింది. ఇక ఇప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పై ఉంది.

మన దేశం అందించిన ఆ సమాచారం ఫలితమో, మరే కారణమో ఉగ్రవాద ముఠాలపై పాకిస్తాన్‌ చర్య తీసుకుంటున్న జాడలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో దానికి సమాంతరంగా కొన్ని అయోమయ ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి. పాకిస్తాన్‌లో ఇది రివాజే. ప్రభుత్వం కొన్ని ఉగ్రవాద సంస్థలపై లేదా కొందరు ఉగ్రవాదులపై చర్య తీసుకుంటున్నామని చెబుతుంది. అదే సమయంలో సైన్యం దానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. ఇది ఆశ్చర్యకరమైనదే. ఎందుకంటే ఇమ్రాన్‌ఖాన్‌ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఆవిర్భవించి, ఎన్ని కల్లో మెజారిటీ సాధించడానికి సైన్యం ఎడాపెడా సాయం చేసిందని చెబుతారు. సారాంశంలో ఇప్పుడున్నది దాని ఆమోదంతో ఏర్పడిన ప్రభుత్వమే.

అయినా ప్రభుత్వమూ, సైన్యమూ భిన్న స్వరాలు వినిపించడం విడ్డూరం కలిగిస్తుంది. నాలుగురోజులక్రితం పాకిస్తాన్‌ విదేశాంగమంత్రి షా మహ్మూద్‌ ఖురేషీ జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ తమ దేశంలోనే ఉన్నాడని, కాకపోతే ఆయన తీవ్ర అస్వ స్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అంగీకరించారు. తాము అన్ని రకాల ఉగ్ర వాద సంస్థలు, మిలిటెంటు సంస్థలపైనా చర్య తీసుకుంటామని ఆ దేశ సమాచార మంత్రి ఫవాద్‌ చౌధ్రి చెప్పారు. వేర్వేరు నిషేధిత సంస్థలకు చెందిన 44మందిని నిర్బంధించామని ఆంతరంగిక శాఖ సహాయమంత్రి అఫ్రిది చెబుతున్నారు. తీరా బుధవారం సైన్యం అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ మొత్తం గాలి తీసేశారు. అసలు తమ దేశంలో జైషే సంస్థే లేదని బుకాయించారు. దాన్ని ఐక్యరాజ్యసమితితోపాటు తాము కూడా నిషేధించామని చెప్పుకొచ్చారు. ఈ స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడిన ప్రస్తుత దశలో కూడా పాక్‌ వెనకటి గుణాన్ని విడనాడలేదంటే ఏమనుకోవాలి?    

తమ భూభాగం ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు నిలయం కాకూడదని పాకిస్తాన్‌ నిజంగా భావిస్తే ఇప్పుడు తీసుకున్నామని చెబుతున్న చర్యలు ఏమాత్రం చాలవు. 44మందినీ ముందస్తు నిర్బంధ చట్టం కింద మాత్రమే అరెస్టు చేశారు. వారంతా కొన్ని రోజుల తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించి విడుదలవుతారు. ఆ తర్వాత ప్రభుత్వం మహా అయితే వారందరినీ నిఘా నీడలో ఉంచుతుంది. లోగడ జైషేను, ముంబై దాడులకు సూత్రధారి అయిన ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాను పాకిస్తాన్‌ నిషేధిస్తే, అది చెల్లదని లాహోర్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఆ రెండు సంస్థల అధిపతులు మసూద్‌ అజర్, హఫీజ్‌ సయీద్‌లను నిఘా నీడలో ఉంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

వాస్తవానికి 1997లో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఏటీఏ) తీసుకొచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ చట్టాన్ని అమలు చేయాలి తప్ప ముందస్తు నిర్బంధాల వల్ల, నిఘా వల్ల ప్రయోజనం ఏముంటుంది? అలాంటి నిఘాలో ఉండగానే పుల్వామా దాడికి పథక రచన చేశామని జైషే చెప్పగలిగిందంటే వీటి డొల్లతనం ఏమిటో అర్ధమవుతుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌తో యుద్ధం అంచుల వరకూ వెళ్లామని, ఇరు దేశాల మధ్యా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని గ్రహించి కూడా ఉగ్రవాద సంస్థల సభ్యులపై ఈ అరకొర చర్యలు తీసుకోవడంలోని ఆంతర్యమేమిటో పాకిస్తాన్‌ చెప్పాలి. ప్రపంచాన్ని తామింకా నమ్మించగలమని అది భావిస్తోందా? పాకిస్తాన్‌లో ఉగ్రవాద, మిలిటెంటు సంస్థలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ఒక సంస్థను నిషేధించగానే, దాన్లో పనిచేసే సభ్యులు వెంటనే మరో పేరు తగిలించుకుని రంగంలోకొస్తున్నారు. నిరుడు ఫిబ్రవరిలో అప్పటి పాక్‌ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ ఒక ఆర్డినెన్స్‌ ద్వారా జమాత్‌–ఉద్‌–దవా, ఫలా–ఏ–ఇన్సానియాత్‌ ఫౌండేషన్‌లను నిషేధించారు. కానీ అవి రెండూ అల్‌ మదినా, ఐసర్‌ ఫౌండేషన్‌ అన్న పేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇలా 69 సంస్థలు పాకిస్తాన్‌లో ఎలాంటి అడ్డంకులూ ఎదురుకాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. చిత్రమేమంటే ఇవన్నీ నిషేధ జాబితాలో ఉన్నవే. ఈ సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా సైన్యం, కొందరు పాలకుల చలవతో ఎదిగి విస్తరించినవే. ఇవి మన దేశంలో మాత్రమే కాదు...పాకిస్తాన్‌లో సైతం విధ్వంసాలకు దిగుతున్నాయి. నెత్తురుటేర్లు పారిస్తున్నాయి. కనుక పాకిస్తాన్‌ ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రదర్శించి కఠినంగా వ్యవహరించాలి. కంటితుడుపు చర్యల వల్ల ప్రయోజనం ఉండదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement