jamaat ud dawa
-
సయీద్‌కు ఐరాస షాక్
న్యూఢిల్లీ: ముంబై మారణహోమం సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు ఐక్యరాజ్యసమితి(ఐరాస) షాక్ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి సయీద్ పేరును తొలగించేందుకు ఐరాస నిరాకరించింది. ఈ సందర్భంగా సయీద్‌పై నిషేధం ఎత్తివేతను భారత్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వ్యతిరేకించగా, పాక్ మౌనంగా ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సయీద్‌కు వ్యతిరేకంగా భారత్ బలమైన సాక్ష్యాలను సమర్పించింది. అతని ఉగ్రవాద కార్యకలాపాలపై పూర్తిస్థాయి ఆధారాలను ఐరాసకు అందజేసింది. దీంతో సయీద్‌పై నిషేధాన్ని కొనసాగిస్తామని ఐక్యరాజ్యసమితి ఆయన న్యాయవాది హైదర్ రసూల్ మిర్జాకు తెలియజేసింది’ అని వెల్లడించారు. లష్కరే తోయిబా సహ–వ్యవస్థాపకుడైన సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్లో గృహనిర్బంధంలో కొనసాగుతున్నాడని పేర్కొన్నారు. జేయూడీపై ఐరాస 2008లో నిషేధం విధించిందన్నారు. ఈ కేసులో స్వతంత్ర అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్న డానియెల్ కిఫ్సెర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యమయిందని తెలిపారు. సయీద్‌పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఐరాస ఆంక్షల కమిటీ ప్రధానంగా ఆస్తుల జప్తు, ప్రయాణ నిషేధం, ఆయుధాల అమ్మకం నిలిపివేత అనే మూడు అంశాలను పర్యవేక్షిస్తుంది. ఆంక్షల కమిటీ నిబంధనల మేరకు నిషేధిత జాబితాలోని సంస్థలు లేదా వ్యక్తుల ఆస్తులను సభ్యదేశాలు తక్షణం జప్తుచేయాలి. వీరికి ప్రభుత్వాలు ఎలాంటి సహాయసహకారాలు అందించరాదు. -
పాక్ అరకొర చర్యలు
ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ శిక్షణ శిబిరంపై సైనిక చర్య ముగిసిందని మన దేశం ప్రకటించిన రోజే ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్ కుమారుణ్ణి, అతడి సోదరుణ్ణి...వారితోపాటు మరో 42మందిని అరెస్టు చేసినట్టు, ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా(జేయూడీ)ను నిషేధిస్తున్నట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఈ చర్య వల్ల ఇరు దేశాలమధ్యా పుల్వామా ఉగ్రదాడి అనంతరం నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతానికి ఉపశమిస్తాయని అందరూ ఆశిస్తారు. గత నెల 14న పుల్వామాలో 43మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడి జరిగాక 27న మన వైమానిక దళ యుద్ధ విమానాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైనా, మరో రెండు ఉగ్ర స్థావరాలపైనా దాడులు నిర్వహించాయి. దాంతో ఇరుదేశాలమధ్యా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల్లో నాలుగైదు రోజులపాటు భారీగా కాల్పులు జరిగాయి. మన పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు. అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాక్ ఆయన్ను చివరకు విడుదల చేయకతప్పలేదు. పుల్వామా దాడి వెనక పాక్‌లోని జైషే సంస్థ హస్తం ఉన్నదని భారత్ చేసిన ఆరోపణ చేశాక ‘మీ దగ్గరున్న సమాచారాన్నిస్తే చర్య తీసుకుంటాం’ అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. దాంతో ఆ సమాచారం మొత్తాన్ని గతవారం పాకిస్తాన్‌కు అందించింది. ఇక ఇప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పై ఉంది. మన దేశం అందించిన ఆ సమాచారం ఫలితమో, మరే కారణమో ఉగ్రవాద ముఠాలపై పాకిస్తాన్ చర్య తీసుకుంటున్న జాడలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో దానికి సమాంతరంగా కొన్ని అయోమయ ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి. పాకిస్తాన్లో ఇది రివాజే. ప్రభుత్వం కొన్ని ఉగ్రవాద సంస్థలపై లేదా కొందరు ఉగ్రవాదులపై చర్య తీసుకుంటున్నామని చెబుతుంది. అదే సమయంలో సైన్యం దానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. ఇది ఆశ్చర్యకరమైనదే. ఎందుకంటే ఇమ్రాన్‌ఖాన్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఆవిర్భవించి, ఎన్ని కల్లో మెజారిటీ సాధించడానికి సైన్యం ఎడాపెడా సాయం చేసిందని చెబుతారు. సారాంశంలో ఇప్పుడున్నది దాని ఆమోదంతో ఏర్పడిన ప్రభుత్వమే. అయినా ప్రభుత్వమూ, సైన్యమూ భిన్న స్వరాలు వినిపించడం విడ్డూరం కలిగిస్తుంది. నాలుగురోజులక్రితం పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మహ్మూద్ ఖురేషీ జైషే చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నాడని, కాకపోతే ఆయన తీవ్ర అస్వ స్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అంగీకరించారు. తాము అన్ని రకాల ఉగ్ర వాద సంస్థలు, మిలిటెంటు సంస్థలపైనా చర్య తీసుకుంటామని ఆ దేశ సమాచార మంత్రి ఫవాద్ చౌధ్రి చెప్పారు. వేర్వేరు నిషేధిత సంస్థలకు చెందిన 44మందిని నిర్బంధించామని ఆంతరంగిక శాఖ సహాయమంత్రి అఫ్రిది చెబుతున్నారు. తీరా బుధవారం సైన్యం అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ మొత్తం గాలి తీసేశారు. అసలు తమ దేశంలో జైషే సంస్థే లేదని బుకాయించారు. దాన్ని ఐక్యరాజ్యసమితితోపాటు తాము కూడా నిషేధించామని చెప్పుకొచ్చారు. ఈ స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడిన ప్రస్తుత దశలో కూడా పాక్ వెనకటి గుణాన్ని విడనాడలేదంటే ఏమనుకోవాలి? తమ భూభాగం ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు నిలయం కాకూడదని పాకిస్తాన్ నిజంగా భావిస్తే ఇప్పుడు తీసుకున్నామని చెబుతున్న చర్యలు ఏమాత్రం చాలవు. 44మందినీ ముందస్తు నిర్బంధ చట్టం కింద మాత్రమే అరెస్టు చేశారు. వారంతా కొన్ని రోజుల తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించి విడుదలవుతారు. ఆ తర్వాత ప్రభుత్వం మహా అయితే వారందరినీ నిఘా నీడలో ఉంచుతుంది. లోగడ జైషేను, ముంబై దాడులకు సూత్రధారి అయిన ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాను పాకిస్తాన్ నిషేధిస్తే, అది చెల్లదని లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఆ రెండు సంస్థల అధిపతులు మసూద్ అజర్, హఫీజ్ సయీద్‌లను నిఘా నీడలో ఉంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి 1997లో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఏటీఏ) తీసుకొచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ చట్టాన్ని అమలు చేయాలి తప్ప ముందస్తు నిర్బంధాల వల్ల, నిఘా వల్ల ప్రయోజనం ఏముంటుంది? అలాంటి నిఘాలో ఉండగానే పుల్వామా దాడికి పథక రచన చేశామని జైషే చెప్పగలిగిందంటే వీటి డొల్లతనం ఏమిటో అర్ధమవుతుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌తో యుద్ధం అంచుల వరకూ వెళ్లామని, ఇరు దేశాల మధ్యా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని గ్రహించి కూడా ఉగ్రవాద సంస్థల సభ్యులపై ఈ అరకొర చర్యలు తీసుకోవడంలోని ఆంతర్యమేమిటో పాకిస్తాన్ చెప్పాలి. ప్రపంచాన్ని తామింకా నమ్మించగలమని అది భావిస్తోందా? పాకిస్తాన్లో ఉగ్రవాద, మిలిటెంటు సంస్థలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ఒక సంస్థను నిషేధించగానే, దాన్లో పనిచేసే సభ్యులు వెంటనే మరో పేరు తగిలించుకుని రంగంలోకొస్తున్నారు. నిరుడు ఫిబ్రవరిలో అప్పటి పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఒక ఆర్డినెన్స్ ద్వారా జమాత్–ఉద్–దవా, ఫలా–ఏ–ఇన్సానియాత్ ఫౌండేషన్లను నిషేధించారు. కానీ అవి రెండూ అల్ మదినా, ఐసర్ ఫౌండేషన్ అన్న పేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇలా 69 సంస్థలు పాకిస్తాన్లో ఎలాంటి అడ్డంకులూ ఎదురుకాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. చిత్రమేమంటే ఇవన్నీ నిషేధ జాబితాలో ఉన్నవే. ఈ సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా సైన్యం, కొందరు పాలకుల చలవతో ఎదిగి విస్తరించినవే. ఇవి మన దేశంలో మాత్రమే కాదు...పాకిస్తాన్లో సైతం విధ్వంసాలకు దిగుతున్నాయి. నెత్తురుటేర్లు పారిస్తున్నాయి. కనుక పాకిస్తాన్ ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రదర్శించి కఠినంగా వ్యవహరించాలి. కంటితుడుపు చర్యల వల్ల ప్రయోజనం ఉండదు. -
హఫీజ్‌కు పాక్ ప్రధాని మద్దతు
ఇస్లామాబాద్ : ముంబై దాడుల సూత్రధారి, ఉగ్ర సంస్థ జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన హఫీజ్ సయీద్‌పై పాకిస్తాన్లో ఎటువంటి కేసులు లేవని.. ఆయన స్పష్టం చేశారు. ఒక పాకిస్తాన్ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో పాక్ ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హఫీజ్ సయీద్‌ను పొరుగుదేశ ప్రధాని సహాబ్ అని సంబోధించడం గమనార్హం. ఇదిలావుండగా అమెరికా నిధులు నిలిపివేయడంతో... హఫీజ్ సయీద్‌ను పొరుగుదేశం నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో హఫీజ్ గురించి.. పాక్ ప్రధాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అబ్బాసీ వ్యాఖ్యలు మరింత అంతర్జాతీయంగా మరింత మంటలు రాజేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఉగ్రసంస్థలపై ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు
కరాచీ : ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబా సంస్థలు.. దేశబక్తికి మారుపేరని ముషారఫ్ అన్నారు. దేశభద్రత కోసం లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముషరాఫ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గతంలోనే ఒక ఇంటర్వ్యూలో.. లష్కే తోయిబా, జమాతే ఉద్ దవాలకు తాను పెద్ద అభిమానిని అని ప్రకటించిన విషమం తెలిసిందే. లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలో పనిచేసే వాళ్లంతా.. దేశభక్తులేనని ముషారఫ్ అభివర్ణించారు. వారంతా పాకిస్తాన్ కోసమే జీవిస్తున్నారని.. పాకిస్తాన్ కోసమే మరణిస్తున్నారని ఆయన అభివర్ణించారు. లష్కే తోయిబా, జమాతే సంస్థలు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే.. ఎవరైనా ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ముషారఫ్ అన్నారు. వారితో పొత్తు పెట్టుకోవడానికి, కలిసి పనిచేయడానికి నేను సిద్దంగా ఉన్నాను.. ఈ విషయంపై వారు నాతో ఇంకా సంప్రదించలేదని చెప్పారు. ఒక వేళ వారు ముందుకు వస్తే.. నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. నాలో ఉదారవాద భావాలు ఉన్నప్పటికీ.. మతపరమైన అంశాలను ద్వేషించనని చెప్పారు. కశ్మీర్లో తీవ్రవాద చర్యలను తానెప్పుడూ సమర్ధిస్తాననే ముషారఫ్ ప్రకటించడం గమనార్హం. -
నియంతృత్వ పాలన దిశగా పాక్?!
పాకిస్తాన్లో మళ్లీ నియంతృత్వ పాలన రానుందా? పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పూర్తికాలం మనుగడ సాగించలేవా? ప్రజా ప్రభుత్వాలకంటే.. నియంతృత్వ పాలకులే మేలని ప్రజలు అనుకుంటున్నారా? పారిణామాలు చూస్తుంటే.. ఏదైనా జరగవచ్చు అని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్ : ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. దేశం సైనిక పాలన దిశగా మళ్లుతున్న అనుమానాలు వస్తున్నాని అంతర్జాతీయ ఆన్లైన్ న్యూస్ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రస్తుతంపాకిస్తాన్లో అత్యంత కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఆ మేగజైన్ పేర్కొంది. పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఏర్పాటు చేసిన గ్రాండ్ అలయెన్స్, అదే సమయంలో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు మద్దతు పలకడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని మేగజైన్ తెలిపింది. ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయీద్ ఇప్పటికే 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే గృహనిర్భంధంలో ఉన్న సమయంలోనే హఫజ్ సయీద్ మిల్లీ ముస్లిం లీగ్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. హహీజప్ సయీద్ గృహనిర్భంధాన్ని పొడిగించాలన్న పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థనను పాక్ న్యాయవ్యవస్థ తోసిపుచ్చడం కూడా అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. పాకిస్తాన్ సైన్యం, మత సంస్థలు.. తమ మధ్యనున్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా అడుగులే వేస్తున్నాయి. ఇదే అత్యంత ప్రమాదకర పరిణామాలకు సంకేతాలని మేగజైన్ తెలిపింది. హఫీజ్ సయీద్ విడుదల తరువాత పాకిస్తాన్లో జీహాదీ గ్రూపులు మరింత ధైర్యంగా, స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటివరకూ మతసంస్థల అధిపతులగా ఉన్న వ్యక్తులంతా.. హఫీజ్ సయీద్ బాటలో.. ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ మిలటరీ పాలకుడు ముషారఫ్ త్వరలోనే పాకిస్తాన్లో తిరిగి అడుగు పెటడుతున్నట్లు జీహాదీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముషారఫ్ పాక్‌లో అడుగు పెడితే.. పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన పాక్
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు పాకిస్థాన్ దిగొచ్చింది. తమ దేశంలోని ఉగ్రవాది హపీజ్ సయీద్ అండదండలతో నడుస్తున్న తెహ్రిక్ ఈ ఆజాదీ జమ్ము అండ్ కశ్మీర్ సంస్థపై నిషేధం విధించింది. ఈ సంస్థే ప్రస్తుతం జమాత్ ఉద్ దవాగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2008లో ముంబయిలో పేలుళ్లకు ఈ ఉగ్రవాద సంస్థే మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ప్రోత్సహించరాదని, అలా చేస్తే అంతర్జాతీయ సమాజం తరుపున తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉన్నపలంగా ఉగ్రవాద చర్యలను నిలువరించే చర్యలు తీసుకోవాలని లేదంటే తమ నుంచి సహకారం అందబోదని చెప్పారు. దీంతో పాకిస్థాన్ తాజా చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత జనవరిలోనే హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బందం చేసిన పాక్ పోలీసులు అతడిని అరెస్టు మాత్రం చేయకుండా పరిశీలనలో ఉంచారు. అదే సమయంలో జమాత్ ఉద్ దవాపై కూడా ఓ కన్నేసి ఉంచారు. సయీద్‌పై ఎప్పుడైతే పాక్ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని లక్షిత దాడులు చేయించేందుకు జమాత్ సంస్థకు సంకేతాలు పంపించినట్లు ఆ మేరకు ఆ సంస్థ ముందుకు కదిలినట్లు తెలిసింది. ఇదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో జమాత్ ఉద్ దవాను నిషేధ సంస్థల జాబితాలో చేర్చింది. -
సయీద్‌పై ఎఫ్ఐఆర్.. ఇక వరుస అరెస్టులు!
లాహోర్: ముంబయి దాడుల కీలక సూత్రదారి, ఉగ్రవాది జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకానుంది. ఈ మేరకు పాక్‌కు చెందిన ఓ సీనియర్ మంత్రి చెప్పారు. అయితే, అతడిపై ఏ కేసుకింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారనే విషయం ఇంకా తెలియలేదు. ‘సయీద్‌పై చర్యలు తీసుకుంటున్నాం. అతడిపై ఉన్న ఆరోపణలన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రభుత్వం అతడిని గృహ నిర్బంధం చేసింది. ఇక త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం’ అని ఫెడరల్ కామర్స్ మంత్రి ఖుర్రం దస్తగిర్ బుధవారం మీడియాకు చెప్పారు. ఏ కేసు అనే విషయం త్వరలోనే చెప్తామని స్పష్టం చేశారు. త్వరలోనే జమాత్ సంస్థకు, ఫలాహ ఈ ఇన్సాన్యత్(ఎఫ్ఈఎఫ్)కు చెందిన కార్యకర్తలందరినీ కూడా అరెస్టు చేస్తామని పంజాబ్ ప్రావిన్స్ న్యాయశాఖ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. ప్రస్తుతానికి వారందరిపై పరిశీలన పెట్టామని, త్వరలోనే యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అరెస్టు చేస్తామని తెలిపారు. జాతీయ అవసరాల విషయంతో తాము అస్సలు రాజీపడబోమని, కశ్మీర్ విషయంలో తమ విధానం వేరని చెప్పారు. జమాత్‌కు కశ్మీర్‌కు సంబంధం లేదని, అవి వేర్వేరు విషయాలని అన్నారు. ఇదిలా ఉండగా సయీద్ అరెస్టు విషయంలో ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన నేతల్లో చీలికలు వచ్చాయంట.