
సత్ఫలితాలనిచ్చే పర్యటన
నాలుగున్నర శతాబ్దాలక్రితం పానిపట్టు యుద్ధంలో విజయం సాధించి మన దేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ పుట్టినిల్లు ఉజ్బెకిస్థాన్ గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అడుగుపెట్టారు. ఎనిమిది రోజులపాటు సాగే మధ్య ఆసియా పర్యటనలో ఆయన ఇంకా కజకస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్‌లను సందర్శిస్తారు. మధ్యలో బ్రిక్స్ దేశాలు, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనేందుకు రష్యా వెళ్లొస్తారు. ఆయనది క్షణం తీరికలేని ఎజెండా. అందులో మధ్య ఆసియా దేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరుచుకోవడమొక్కటే కాదు... భద్రతా సమస్యలనుంచి ప్రాంతీయ ప్రాజెక్టుల వరకూ...ఐఎస్ ఉగ్రవాదుల బెడదనుంచి పెట్టుబడుల వరకూ ఎన్నో ఉన్నాయి.
పూర్వపు సోవియెట్ యూనియన్‌నుంచి విడివడి ఈ అయిదు దేశాలూ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించి అప్పుడే పాతికేళ్లు కావస్తున్నది. ఇన్నేళ్లుగా ఈ దేశాలన్నిటితోనూ మనకు సుహృద్భావ సంబంధాలే ఉన్నాయి. కనుకనే తుర్క్‌మెనిస్థాన్ నుంచి పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ సరఫరాను పొందేందుకు ఉద్దేశించిన కీలక ఒప్పందంపై 2012 మే నెలలో సంతకాలయ్యాయి. తుర్క్‌మెనిస్థాన్- అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్-ఇండియా(తాపీ) ప్రాజెక్టుగా పిలిచే కీలకమైన ఆ ప్రాజెక్టు బృహత్తరమైనది. 1,680 కిలోమీటర్లు ప్రయాణించే ఆ పైప్‌లైన్ ద్వారా మనతో పాటు మన పొరుగునున్న అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లకు సైతం గ్యాస్ లభ్యమవుతుంది.
దాని ఆధారంగా విద్యుదుత్పాదననూ, సత్వర పారిశ్రామిక అభివృద్ధినీ, ఆర్థికాభివృద్ధినీ సాధించేందుకు వీలవుతుంది. 30 ఏళ్లపాటు కొనసాగే ఈ ఇంధన సరఫరా వ్యవస్థ వాస్తవానికి 2018 నుంచి ప్రారంభం కావలసి ఉన్నది. అయితే, కాగితాల్లో ఉన్నంత సొగసుగా ఆచరణ లేదు. ఇందుకు కారణాలనేకం. ఈ పైప్‌లైన్ ప్రయాణించే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మృత్యు క్షేత్రం. ఉగ్రవాదుల తుపాకుల మోత, మందుపాతరల పేలుళ్లు అక్కడ సర్వ సాధారణం. నిత్యం నెత్తురొలికే జాగా అది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులనుంచి పైప్‌లైన్‌ను రక్షించుకోవడం ఎలా అన్నది సంక్లిష్టమైన సమస్య. ఇక తనకు సన్నిహితంగా మెలిగే తుర్క్‌మెనిస్థాన్ వేరే దేశాలకు గ్యాస్ అమ్మజూపడం చైనాకు ససేమిరా ఇష్టంలేదు.
ఈ ప్రాజెక్టువల్ల తన ఇరాన్-పాకిస్థాన్-ఇండియా(ఐపీఐ) ప్రాజెక్టుకు ముప్పు కలుగుతుందన్న శంక ఇరాన్‌కు ఉంది. భారత్, పాక్ సంబంధాల్లో నిరంతరం ఉండే ఇబ్బందులు సరేసరి. వెయ్యికోట్ల డాలర్లు (సుమారు రూ. 64,000 కోట్లు) వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు చుట్టూ ఇలా సమస్యలు ముసురు కోవడంవల్ల అది ముందుకు కదలడంలేదు. అది 2020 నాటికి పూర్తికావడం ఖాయమని చెబుతున్నా అదంత సులభమేమీ కాదు. అఫ్ఘాన్‌లోని భద్రతాపరమైన సమస్యలు అధిగమించలేనివేమీ కాదని న్యూఢిల్లీలో తుర్క్‌మెనిస్థాన్ రాయబారిగా ఉన్న దుర్దుయేవ్ అన్నారు. ఆ దేశానికి అఫ్ఘాన్‌తో ఉన్న సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను చూస్తే ఆయనది కేవలం ఆశాభావమేనన్న సందేహం కలుగుతుంది. మోదీతో జరిపే చర్చలవల్ల దీనికొక దోవ దొరుకుతుందని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్న విశ్వాసంతో తుర్క్‌మెనిస్థాన్ ఉంది.
అన్నిచోట్లా మనల్ని అధిగమిస్తూ ముందుకెళ్తున్న చైనా మధ్య ఆసియాలో కూడా ఇప్పటికే తన పాదం మోపింది. రెండేళ్లక్రితం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ దేశాలన్నిటినీ సందర్శించి వాటికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఉదారంగా రుణాలిచ్చారు. అక్కడినుంచి చైనాకు చమురు, సహజవాయు పైప్‌లైన్లు ఉన్నాయి. ఈ దేశాల అధినేతలు మన దేశాన్ని సందర్శించడం, మన నేతలు అక్కడికెళ్లడం రివాజుగా సాగుతున్నా సంబంధాలను ఈ స్థాయికి తీసుకెళ్లాలన్న స్పృహ యూపీఏ హయాంలో మన నాయకులకు రాలేదు. అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలతో ఉండే ప్రాంతంతో ఉండే సంబంధాల ద్వారా మనం బహుముఖ అభివృద్ధిని సాధించవచ్చునన్న వివేచన వారికి లేకపోయింది.
వాస్తవానికి ఈ విషయంలో మధ్య ఆసియా దేశాలు ఎంతో సుముఖంగా ఉన్నాయి. చైనా, రష్యాలనుంచి ఎంతగా సాయం పొందుతున్నా వారిద్దరిపైనే ఆధారపడటం మంచిదికాదన్న అభిప్రాయం ఆ దేశాలకు ఉంది. ఇలాంటి స్థితిని ఉపయోగించుకుని స్వీయ ప్రయోజనాలను సాధించాలని తహతహలాడుతున్న యూరొప్ దేశాలను చూసైనా మన దేశం నేర్చుకుని ఉండాల్సింది. కానీ ఆ పని అవసరమైనంతగా జరగలేదు. మధ్య ఆసియా దేశాల్లో భారత్‌కు చెందిన సంస్థలు ఫార్మా, ఇంజనీరింగ్, టూరిజం రంగాల్లో చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు ఆధునీకరణ పనుల్ని మన దేశమే స్వీకరించింది. ఇది పూర్తయితే తమ మధ్య ఎగుమతులు, దిగుమతుల కార్యకలాపాలు గణనీయంగా విస్తరిస్తాయన్న ఆశ మధ్య ఆసియా దేశాలకు ఉంది. ఇక తజికిస్థాన్, కిర్గిజిస్థాన్‌లు రెండింటికీ అపారమైన జలవనరులున్నాయి. భారత్ తమనుంచి జలవిద్యుత్‌ను కొనాలని ఆ దేశాలు కోరుకుంటున్నాయి.
మధ్య ఆసియా ప్రాంతం భద్రతరీత్యా ఎంతో కీలకమైనది. ఇరాక్‌లో అమెరికా సేనల వైఫల్యం, అఫ్ఘాన్‌నుంచి అది వైదొలిగే ప్రక్రియ మొదలుకావడం వంటి కారణాలరీత్యా ఈ ప్రాంత దేశాల్లో ఉగ్రవాదం కాలూనడానికి ప్రయత్నిస్తున్నది. సిరియా, ఇరాక్‌లలో చెలరేగుతున్న ఐఎస్ ఉగ్రవాదులు ఇక్కడ సైతం పలుకుబడి పెంచుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంపై తన పూర్వ వైభవాన్ని నెలకొల్పుకొనాలని రష్యా భావిస్తోంది. చైనా తన సొంత ఎజెండాతో ముందుకెళ్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో నరేంద్ర మోదీ మధ్య ఆసియా దేశాల్లో విస్తృత పర్యటనకు పూనుకోవడం వ్యూహాత్మకంగా మన దేశానికి ఎంతగానో పనికొస్తుంది. రాగలకాలంలో దీని సత్ఫలితాలు కనిపిస్తాయి.