ఎప్పుడూ విషాద ఘటనలతో ముడిపడి మాత్రమే ప్రసార మాధ్యమాలకెక్కే ఈశాన్య ప్రాంతం చాన్నాళ్ల తర్వాత తొలిసారి చల్లని కబురుతో పతాక శీర్షికల్లో చోటు సంపాదించుకుంది. మన దేశానికి స్వాతంత్య్రంతోపాటే సంక్రమించి, గత ఆరు దశాబ్దాలుగా రుధిర అధ్యాయాన్ని రచిస్తున్న నాగాలాండ్ సమస్యపై తొలిసారి నేషనలిస్టు సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఇసాక్, మ్యువా (ఎన్‌ఎస్‌సీఎన్- ఐఎం) వర్గంతో కేంద్ర ప్రభుత్వం ఒడంబడిక కుదుర్చుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించినట్టు ఈ ఒప్పందం నిజంగా చరిత్రాత్మకమే. 1986లో ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్)తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాక ఆ ప్రాంతంలోని మరో పెద్ద గ్రూపుతో కేంద్రం అవగాహనకు రావడం ఇదే ప్రథమం.
అయితే, దీన్ని నిజమైన అర్ధంలో ఒప్పందం అనడానికి లేదు. ఎందుకంటే సోమవారం ఇరు పక్షాలూ సంతకాలు చేసింది ఒప్పందానికి సంబంధించిన స్వరూపం (ఫ్రేమ్‌వర్క్)పైన మాత్రమే. దానికి అనుగుణంగా స్పష్టమైన అంశాలతో, విధివిధానాలతో, నిబంధనలతో సవివరమైన ఒప్పందం రూపొందాల్సి ఉంది. ఆ ప్రక్రియంతా పూర్తికావడానికి మరికొంత సమయం పట్టవచ్చునని అంటున్నారు. ఆ తర్వాతనే ఎవరు ఏమేరకు రాజీ పడ్డారో, సరిపెట్టుకున్నారో తెలిసే అవకాశం ఉంది.
నాగాలాండ్ సమస్య అత్యంత జటిలమైనది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందే అక్కడ తిరుగుబాటు కుంపటి రగుల్కొంది. ఇప్పటి మయన్మార్, ఈశాన్యం లోని మరికొన్ని ప్రాంతాలనూ విలీనం చేసి తమను ప్రత్యేక దేశంగా ఏర్పరచాలని బ్రిటిష్ పాలనలోనే డిమాండు బయల్దేరింది. దానికి మద్దతుగా విస్తృత స్థాయిలో ఉద్యమమూ ప్రారంభమైంది. ఈశాన్యంలోని మిగిలిన తిరుగుబాటు ఉద్యమాల తరహాలోనే నాగా ఉద్యమం కూడా ఎందరో నాయకుల్ని చూసింది. వారు వర్గాలుగా విడిపోవడం, తిరిగి కలవడం... మళ్లీ వేరు కుంపట్లు పెట్టుకోవడం గమనించింది. ఈ క్రమంలో ఎంతో హింసను చవిచూసింది. అటు నాగా ప్రజలు, ఇటు భద్రతా బలగాలకు చెందినవారూ ఎందరో బలయ్యారు. తెగల మధ్య తరచు ఘర్షణలు తలెత్తి వందలాదిమంది ఊచకోతకు గురయ్యారు. చెట్టుకొకరు... పుట్టకొకరయ్యారు. 1960లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు.
తిరుగుబాటుదార్లతో న్యూఢిల్లీ హైదరాబాద్ హౌస్‌లో ఆరు దఫాలు చర్చలు జరిగాయి. కానీ, హఠాత్తుగా ఒక విదేశీ బృందం కోసం ఆ ప్రాంగణం నుంచి నాగా బృందాన్ని ఖాళీ చేయించడంతో అది తమను అవమానించడంగా వారు భావించారు. చర్చలకు స్వస్తి చెప్పి వెళ్లిపోవడమే కాక ఆ తర్వాత తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. తమకు సమాన స్థాయినిచ్చి మాట్లాడాలన్నది ఆనాటినుంచీ వారి కీలక షరతు. సోమవారం నరేంద్ర మోదీ పక్కన కూర్చోవడం ద్వారా మ్యువా దాన్ని నెరవేర్చుకున్నారు. నాగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఒక్క ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం) మాత్రమే కాదు... అక్కడ ప్రస్తుతం అనేకానేక గ్రూపులున్నాయి. 1997లో తొలిసారి ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం)తో ఆనాటి ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు అక్కడి గ్రూపుల మధ్య ఉన్న అంతర్గత వైరుధ్యాలను ఉపయోగించుకుని వాటిని బలహీనపర్చడంలో చూపిన శ్రద్ధ...ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి వినియోగించలేదనే చెప్పాలి.
ఒకరిని నిర్లక్ష్యంచేసి మరో పక్షానికి ప్రాధాన్యమిస్తున్నట్టు కనబడటంవల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. ఇటీవలికాలంలో ఐఎంతో మాత్రమే కేంద్రం తరచుగా సంప్రదింపులు చేస్తున్నదని అలిగిన ఎన్‌ఎస్‌సీఎన్ (ఖప్లాంగ్) వర్గం 2001 నాటి కాల్పుల విరమణకు చెల్లుచీటి ఇచ్చింది. మొన్నీమధ్యే మణిపూర్‌లో మాటుగాసి 18 మంది సైనిక జవాన్లను పొట్టనబెట్టుకుంది. దాదాపు చెప్పుకోదగిన హింసాత్మకఘటనలు లేకుండా పద్దెనిమిదేళ్లపాటు కొనసాగిన కాల్పుల విరమణ కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు.
ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం) తొలుత స్వతంత్ర నాగాలాండ్ కావాలన్న డిమాండుతో ఉద్యమం ప్రారంభించినా అనంతర కాలంలో తన పంథాను మార్చుకుంది. నాగా ప్రజలు అధికంగా ఉన్న మణిపూర్‌లోని నాలుగు జిల్లాలు, అస్సాంలోని రెండు జిల్లాలు, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలనూ కలిపి విశాల నాగాలాండ్ ఏర్పాటు చేయాలని కోరడం ప్రారంభించింది. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 లక్షలమంది నాగా ప్రజలూ ఆయా రాష్ట్రాల్లో వివక్షకు గురవుతున్నారని, వారి చరిత్ర, సంప్రదాయాలూ ధ్వంసమవుతున్నాయని ఎన్‌ఎస్‌సీఎన్, ఇతర గ్రూపులూ ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కుదిరిందంటున్న ఒప్పందంలో ఈ విలీనం ప్రతిపాదన ఉందా, లేదా అన్నది తెలియదు. అది మినహా దేన్నీ ఒప్పుకునేది లేదని ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం) తరచు చెబుతున్నది.
అందుకే అస్సాం, మణిపూర్, అరుణాచల్ రాష్ట్రాల్లో ఈ ఒప్పందంపై అనుమానాలు తలెత్తడం మొదలైంది. ఇప్పుడున్న భౌగోళిక సరిహద్దులేమీ మారవని కేంద్ర ప్రభుత్వం భరోసానిస్తున్నా ఆ ప్రాంత నాయకులు ఆందోళనపడుతున్నారు. ఒప్పందంలోని అంశాలు బయట పెట్టకుండా అంత హడావుడిగా సంతకాలు చేయడమెందుకని అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ ప్రశ్నించింది దాన్ని దృష్టిలో పెట్టుకునే. ఇలాంటి ఒప్పందం కుదుర్చుకునే ముందు సమస్యతో సంబంధం ఉన్న అన్ని పక్షాలతోనూ, రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపితే మరింత మెరుగైన ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ఈశాన్య ప్రాంతం కార్యకలాపాలను నిత్యం పర్యవేక్షిస్తుండే కేంద్ర హోంశాఖలోని సీనియర్ అధికారులకే చర్చల ప్రక్రియ సంగతి తెలియదంటున్నారు గనుక ఇతర రాష్ట్రాలతో, నాగాలాండ్‌లోని ఇతర పక్షాలతో ముందస్తుగా చర్చించలేదని అనుకోవడం దండగ. ఏదేమైనా ప్రస్తుత అవగాహన నాగాలాండ్‌లో శాంతిని నెలకొల్పగలిగితే అది మొత్తం ఈశాన్య ప్రాంత సత్వరాభివృద్ధికి బాటలు పరుస్తుంది. నరేంద్ర మోదీ సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించినవారవుతారు.
ఈశాన్యంలో శాంతి వీచిక!
Published Wed, Aug 5 2015 12:46 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement