యువరాజు ‘తెలుగు’ రాజకీయం
డేట్‌లైన్ హైదరాబాద్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతవారం అనంతపురం జిల్లాలో పర్యటించి వెళ్లారు. 2014లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పో యాక ఆయన తెలుగు రాష్ట్రాలలో పర్యటించడం ఇది రెండవసారి. మొదటి సారి ఆయన తెలంగాణ రాష్ర్టంలో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి వెళ్లారు. పదో పదిహేనో కిలోమీటర్లు పాదయాత్ర చేసి, కొందరు గ్రామస్తులతో మాట్లాడారు.
అనంతపురం జిల్లాలో సాగిన ఆయన రెండో పర్యటన ఇంచు మించుగా ఇటువంటిదే. మూడోసారి ముత్యం అన్నట్టు మళ్లీ నెలాఖరుకు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాలకు రాహుల్ గాంధీ పర్యటనకు రానున్నారు. ఆయన జరిపిన మొదటి రెండు పర్యటనలు ఆత్మహత్యలు చేసు కున్న రైతుల కుటుంబాల సభ్యులను కలసి ఓదార్చడానికి ఉద్దేశించినవి. కాగా, ఈసారి జరిగే పర్యటన వాటికి కొంచెం భిన్నంగా ఉంటుందేమోనని అనిపిస్తుంది.
తెరాస లక్ష్యంగా మూడో పర్యటన?
అధికార తెలంగాణ రాష్ర్ట సమితి లక్ష్యంగా ఈసారి ఆయన తెలంగాణ పర్య టన సాగనున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మొన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులను తమ వెంట ఢిల్లీ తీసుకు వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశపరిచారు. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జరిగిన తుది విడత ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర చిరస్మరణీ యం. నిజానికి తెలంగాణ రాష్ర్టం కావలసింది వారికే, వారి భవిష్యత్తు కోసమే.
కానీ రాష్ర్టం ఏర్పడ్డాక 14 మాసాలు గడిచినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉస్మానియా విద్యార్థులలో భవిష్యత్తు పట్ల విశ్వాసం కలిగించలేక పోయిన మాట వాస్తవం. నిజమే అబ్రకదబ్ర అబ్రకదబ్ర అనగానే అన్నీ సమకూరి పోవు. ఆ విషయం ఉద్యమకాలంలో దానికి నాయకత్వం వహించిన రాజ కీయ నాయకులు స్పష్టం చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఆకాశం నుండి చందమామను తెచ్చి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో అలంకరించేస్తామని చెప్పబట్టే ఇప్పుడు యువకుల్లో ఇంత నిరాశ. పునర్నిర్మాణం ఎంత కష్టాలతో కూడుకున్న పనో, అందుకోసం ఎన్ని తరాలు త్యాగాలు చెయ్యాల్సి ఉంటుందో ఉద్యమ నాయకత్వం ఆనాడే చెప్పాల్సింది.
అధికారంలోకి వచ్చెయ్యా లన్న తొందరలో ఆ విషయం రాజకీయ నాయకత్వం మరిచిపోయిన కారణం గానే ఇవాళ ఉస్మానియా విద్యార్థుల్లో, యువకుల్లో ఈ నిరాశ, పాలకుల పట్ల అవిశ్వాసం. సరే, ఉస్మానియా విద్యార్థి నాయకులను ఢిల్లీ తీసుకెళ్లిన కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం మేరకు రాహుల్ ఈసారి పర్యటనలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థ్థులతో సమావేశం కానున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఆ రాత్రి క్యాంపస్‌లోనే నిద్రించనున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. రాజకీయ నాయకులు ఇటువంటివి చాలా చేస్తుంటారు. రాహుల్ గాంధీ ఇంకొంచెం ఎక్కువ. ఆయన తన నియోజకవర్గం అమేథిలో ఎక్కువ భాగం పేదల గుడిసెల్లో తిని, అక్కడే నిద్రపోవడం చూశాం.
ఈసారి ఉస్మానియా క్యాంపస్‌లో కూడా అదే చేస్తారేమో! తప్పు లేదు. కనీసం అక్కడ హాస్టళ్లలో దీనస్థితి అర్థమవుతుంది. మరునాడు ఆయన వరం గల్ జిల్లాలో పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. వరంగల్ పార్ల మెంట్ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామా కారణంగా ఉప ఎన్నిక జరగ నుంది. ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. స్వర్గీయ జగ్జీవన్‌రామ్ కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను ఇక్కడ నుండి తన అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి రాహుల్ గాంధీ ఈ సమయంలో వరంగల్ జిల్లాలో పర్య టించడం వెనుక ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. పైగా వరంగల్, హైదరా బాద్ నగరాల పురపాలక సంఘాల ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకం కాను న్నాయి. అయితే వాటి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పే పరిస్థితి ప్రస్తు తం లేదు. న్యాయస్థానాలు చెప్పినా సరే, రాష్ర్ట ప్రభుత్వం ఏవో మెలికలు పెట్టి కాలయాపన చేస్తున్నది.
తమకో న్యాయం పరులకో న్యాయమా?
రాహుల్ గాంధీ కరువు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఓదార్పును ఇస్తున్నారు. అభినందించవలసిందే. మరి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు, నాడు అధి కార పార్టీ పార్లమెంట్ సభ్యుడు కూడా అయిన జగన్‌మోహన్‌రెడ్డి చేస్తాన న్నది ఇదే పని కదా! కాంగ్రెస్ అధిష్టానం- అందులో రాహుల్ గాంధీ కూడా ఉంటారు- ఎందుకు ఆయనను అడ్డుకున్నది? చివరికి అదే అంశం మీద ఆయన పార్టీ నుండి బయటికి వెళ్లే దాకా ఎందుకు ఇబ్బంది పెట్టింది? కాంగ్రెస్ అధినేత్రికీ, ఆమె కుమారుడికీ మిగతా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకూ రాజశేఖర రెడ్డి వ్యవహారమే మింగుడు పడకుండా తయారయింది ఆ రోజుల్లో.
ప్రజల్లో ఆయనకు ఆదరణ పెరిగిపోయి కాంగ్రెస్ పార్టీ ఆయనను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో అనుకోకుండా ఆయన మరణించారు. ఆయనకు ప్రజల్లో ఉన్న పలుకుబడి యువకుడయిన ఆయన కుమారుడికి తోడయితే తమకు ఇబ్బంది అనుకున్నారు కాంగ్రెస్ పెద్దలు. అందుకే జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర కు ఇబ్బందులు సృష్టించారు, కేసులు పెట్టించారు. చివరికి అదే యాత్రల్లో నుండి పిలిపించి మరీ కారాగారానికి పంపించారు. ఇప్పుడు ఇది ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం అని అడగొచ్చు ఎవరయినా. సందర్భం ఉంది.
వైఎస్ మీద ఇప్పుడెందుకు ప్రేమ?
రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా యాత్రను ఎలా ప్రారంభించారు? దివం గత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నమస్కరించి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీకీ, మరీ ముఖ్యంగా సోనియా గాంధీ కుమారుడికీ హఠాత్తుగా రాజశేఖరరెడ్డి మీద అంత గౌరవం ఎందుకు పుట్టుకొచ్చింది? మరణించిన రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, ఆయనను నిందితుడిని చేసి, ఆయన కుటుంబాన్ని వీధి పాలుచేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌కు రాజశేఖరరెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో, తెలం గాణలో తమకు దిక్కులేదన్న విషయం అర్ధమైంది.
అందుకే రాహుల్ అనం తపురం జిల్లా పర్యటనకు కొంచెం అటు ఇటుగా వైఎస్‌ఆర్ జయంతి నాడు కాంగ్రెస్ నాయకులు పోటీలు పడి నివాళులర్పించారు. శాసనసభ ఆవరణలో రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగిస్తే ఆందోళనలు చేస్తామని హెచ్చరికలూ చేశారు. రాజశేఖరరెడ్డిని అభిమానించే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఉన్నారు. వాళ్లు ఆయన నుండి ఎన్నడూ పెద్దగా ఏమీ ఆశించి ఉండరు. ఆయన వల్ల లాభపడ్డ నాయకులే ఆయనను విస్మరించారు. అంతేకాదు, ఆయనను దుర్భాషలాడిన వారు కూడా ఈ నాయకులలో ఉన్నారు. ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు వారు. ఇట్లాంటి వాళ్లు ఇవాళ మళ్లీ రాజశేఖరరెడ్డినీ, ఆయన పలుకుబడినీ సొంతం చేసుకుంటామంటే ప్రజలు ఎందుకు నమ్ము తారు? పైగా రాజశేఖరరెడ్డి ప్రతిష్ట, పలుకుబడి ప్రజాదరణ ఖాళీగా లేవు ఇప్పుడు. ఆయన పేరుతో ఇంకో రాజకీయ పార్టీ ఏర్పడింది. ఆయన కొడుకే దానికి నాయకుడు. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాని రాష్ర్టంలో 67 శాసన సభ స్థానాలు సాధించి, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాడు.
రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించి అనంతపురం యాత్ర ప్రారంభిం చిన రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయ కుడు జగన్‌మోహన్‌రెడ్డి చెయ్యాల్సినంత పోరాటం చెయ్యడం లేదని వ్యాఖ్యా నించి వెళ్లాడు. అధిష్టానవర్గానికీ, ముఖ్యంగా రాహుల్ గాంధీకీ రాష్ర్ట కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి సరైన సమాచారం ఇచ్చినట్టు లేరు. రాష్ర్ట విభజన సమయంలో కూడా ఇట్లాంటి బ్రీఫింగ్‌ల కార ణంగానే రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కొంప మునిగింది. ఆ విషయం మరిచిపోతే ఎట్లా?
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com, మొబైల్: 98480 48536