అలకపాన్పుపై రాహుల్‌ | Sakshi Editorial Over Rahul Gandhi Resignation Row | Sakshi
Sakshi News home page

అలకపాన్పుపై రాహుల్‌

Published Tue, May 28 2019 12:47 AM | Last Updated on Tue, May 28 2019 12:47 AM

Sakshi Editorial Over Rahul Gandhi Resignation Row

లోక్‌సభ ఎన్నికల తేదీలు ఖరారైననాటికి ఎంతో ఆత్మవిశ్వాసంతో కనబడిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఫలితాలు వెల్లడయ్యాక పెను సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యతవహిస్తూ అధ్యక్ష పదవినుంచి తప్పుకుంటానన్న రాహుల్‌ గాంధీని ఒప్పించడమెలాగో అర్ధంకాక నాయకగణమంతా తలలు పట్టుకుని కూర్చుంది. తన సోదరి ప్రియాంకా గాంధీకి సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు ఆయన ససేమిరా అనడం, పదవిలో కొనసాగమని తల్లి సోనియాతోపాటు ప్రియాంక నచ్చ చెప్పినా వినకపోవడం వంటివి ఇప్పుడు ఆ పార్టీని అయో మయంలో పడేశాయి. వివిధ రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు రాజీనామాలు సమర్పించడం ఈ నాటకీయ పరిణామాలకు అదనం. అంతేకాదు... రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు ఒడిదుడు కుల్లో పడుతున్న సూచనలు కనబడుతున్నాయి. ఓటమికి నైతిక బాధ్యత వహించి అధినేత రాజీ నామా చేయడం, ఆనక పార్టీ మొత్తం కట్టగట్టుకుని దాన్ని తోసిపుచ్చడం... అధినేతగా ఉన్నవారు కొనసాగడం రివాజుగా మారిన తరుణంలో రాహుల్‌ తీరు వింతగానే ఉంటుంది. వచ్చే నెలలో 49వ పుట్టినరోజు జరుపుకోబోతున్న తమ నాయకుడు ఈ ఓటమితోనే సర్వం కోల్పోయామన్నట్టు వ్యవహరించడంతో వారు ‘కిం కర్తవ్య విచికిత్స’లో పడినట్టు కనబడుతోంది. 

పార్టీ శ్రేణులకు బంగారు భవిష్యత్తు గురించి భరోసా కలిగించడం, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం, కార్యసాధన వైపు వారిని ఉరకలెత్తించడం సారథి చేసే పని. రాహుల్‌ పగ్గాలు చేపట్టే నాటికి కాంగ్రెస్‌ ఏ స్థితిలో ఉందో, ఆ తర్వాతైనా అది ఏమేరకు పుంజుకోగలిగిందో తెలుస్తూనే ఉంది. అయితే నాయకుడిగా రాహుల్‌ పరిణతి చెందారనడంలో సందేహం లేదు. మొదట్లో బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో తడబాటు ప్రదర్శించిన రాహుల్‌ క్రమేపీ తన లోటుపాట్లు సరి దిద్దుకున్నారు. శ్రమించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి అంశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు జనంలోకి చొచ్చుకెళ్లాయి. కానీ ఇవి మాత్రమే సరిపోవన్న సంగతి ఆయన గుర్తించలేకపోయారు. పార్టీని ‘ఎవరూ ఊహించని స్థాయిలో’ ప్రక్షాళన చేస్తానని చాన్నాళ్లక్రితం ఆయన మాటిచ్చారు.

రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి ముచ్చట అది. అయిదేళ్లు గడిచాక ఈ రాష్ట్రాల్లో నిరుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌ విజయం సాధించిన మాట వాస్తవమే. కానీ పార్టీని ప్రక్షాళన చేయడం వల్ల వచ్చిపడిన విజయం కాదది. అక్కడి ప్రభుత్వాలపై జనంలో నెలకొన్న అసంతృప్తి అందుకు కారణం. పార్టీ పటిష్టంగా ఉన్న ట్టయితే ఈ విజయాలను సుస్థిరం చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో సైతం సత్తా చాటేది. కానీ విషాదమేమంటే... రాజస్తాన్‌లో 25 స్థానాల్లో 24 బీజేపీ గెల్చుకోగా, మరొకటి దాని మిత్రపక్షం సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోనూ అదే వరస. అక్కడున్న 29 స్థానాల్లో ఒక్కటి మినహా అన్నిటినీ బీజేపీ కైవసం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాల్లో బీజేపీకి 9 లభించాయి. కేరళ, పంజాబ్‌లు మాత్రమే ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కాస్తంత ఊరట కలిగించాయి. నిరుడు జూలైలో పార్టీలో రాహుల్‌ సంస్థాగత మార్పులు చేశారు. కానీ అవి ‘ఎవరూ ఊహించని స్థాయి’ మార్పులు కాదు. దిగ్విజయ్‌సింగ్, జనార్దన్‌ ద్వివేదీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, బీకే హరి ప్రసాద్‌ వంటి కొందరిని సీడబ్ల్యూసీ నుంచి తప్పించారు. వారి స్థానంలో సమర్థులనుకున్న తన మను షులకు చోటిచ్చారు. కొంతమంది యువతకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. కానీ ఆచ రణలో ఈ మార్పులు పెద్దగా ప్రయోజనాన్ని కలిగించలేకపోయాయి.

అనుకున్న స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయలేకపోవడం, తమ సంతానానికి టిక్కెట్లు కావాలని కొందరు నేతలు పట్టుబట్టినప్పుడు కాదనలేకపోవడం రాహుల్‌ తప్పిదాలు. ఓడిన తర్వాత ఇతరులను నిందించడం కంటే, ముందే నిర్ణయాత్మకంగా వ్యవహరించలేకపోవడం అధినేతగా తన వైఫల్యమని ఆయన గుర్తిస్తే వేరుగా ఉండేది. కానీ అందుకు భిన్నంగా రాహుల్, ఆయ నతోపాటు ప్రియాంక కొందరు నేతల తీరును తప్పుబట్టారని మీడియాలో వెల్లడైన కథనాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై తన సోదరుడు ఒంటరి పోరాటం చేశారని, పార్టీ నేతల్లో ఎవరూ ఆయనకు తోడుగా నిలవలేదని ప్రియాంక కుండబద్దలు కొట్టగా...మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ సీఎంలు కమల్‌నాథ్, అశోక్‌ గెహ్లోత్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంల తీరుపై రాహుల్‌ నిప్పులు చెరిగారని ఆ కథనాల సారాంశం. అసలు కమల్‌నాథ్‌ స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా, గెహ్లోత్‌ స్థానంలో సచిన్‌ పైలెట్‌లు సీఎంలవుతారని అందరూ అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. ఇవన్నీ నెరవేర్చిందీ తానే... ఇప్పుడు ఓటమికి దారితీసిన కారణాలుగా వాటిని చూపు తున్నదీ తానేనని ముందుగా రాహుల్‌ గుర్తించడం మంచిది.

నిజానికివి కారణాలు కాదు... పార్టీలో గత కొన్నేళ్లుగా నెలకొన్న సంస్కృతికి పర్యవసానాలు. వందిమాగధులకు పార్టీలో పెద్ద పీట వేయడం, వారికి జనంలో పరువూ, పలుకుబడీ ఉన్నాయో లేదో చూసుకోలేకపోవడం, చెప్పుడు మాటలు వినడం అధినాయకత్వానికి రివాజుగా మారింది. చొరవగా పనిచేసేవారిని, సొంతంగా ఆలోచించగలిగేవారిని పార్టీలో అదే పనిగా వేధించారు. వారివల్ల ముందూ మునుపూ ముప్పు కలుగుతుందన్న భయంతో వణికారు. విశ్వసనీయత కలిగిన బలమైన నాయకులు నిష్క్ర మించాక ఊపిరి పీల్చుకున్నారు. వీటన్నిటి విషయంలో రాహుల్‌గాంధీ ఆత్మ విమర్శ చేసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు సారథ్య బాధ్యతలు వద్దుగాక వద్దని ఆయన అంటున్నారుగానీ... సొంతంగా పార్టీకి జవజీవాలు పోసే నేత పార్టీలో ఒక్కరంటే ఒక్కరైనా ఉన్నారా? సంస్థాగతంగా తాము కొన్నేళ్లుగా చేస్తున్న తప్పులే తాజా ఓటమికి, ప్రస్తుత నాయకత్వ లేమికి కారణాలని గుర్తిస్తే, వాటిని సరిదిద్దడానికి ఏం చేయాలో తర్వాత ఆలోచించవచ్చు. ముందుగా రాహుల్‌ అందుకు సిద్ధపడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement