పాక్ ‘పనామా’ సంక్షోభం
మన దేశంలో కేవలం కొన్ని రోజులు పతాక శీర్షికలకు పరిమితమైన ‘పనామా పత్రాల’ వ్యవహారం పొరుగునున్న పాకిస్తాన్‌లో ప్రధానినే పదవి నుంచి గెంటేసిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని నవాజ్ షరీఫ్ వంచనకు పాల్పడ్డారని, ఆయన ప్రజా ప్రతినిధిగా అనర్హుడని అయిదుగురు సభ్యుల పాక్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పు ఆ దేశ రాజకీయాలనే కాదు... భారత్ –పాక్ సంబంధాలపైనా ప్రభావం చూపుతుంది. ఎంపీగా డిక్లరేషన్ దాఖలు చేసి నప్పుడు షరీఫ్ తన ఆదాయాన్నీ, ఆస్తులనూ సరిగా చూపలేదని, తప్పుడు వివ రాలిచ్చారని ప్రధాన ఆరోపణ.
ఆరు వారాల్లో ఆయన, ఆయన కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేయాలని... నమోదు చేసిన ఆర్నెల్లలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. నిరుడు ఏప్రిల్‌లో మొదటిసారి పనామా పత్రాల సంగతి వెల్లడై అనేక దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ అప్పటి ప్రధాని కామె రాన్ తదితర దేశాధినేతలతోపాటు మన దేశంలో భిన్న రంగాల్లో ప్రముఖులుగా వెలుగొందుతున్న అనేకమంది పేర్లు కూడా ఆ పత్రాల్లో బయటికొచ్చాయి. నిరుడు అక్టోబర్‌లో పాకిస్తాన్ సుప్రీంకోర్టులో నవాజ్ షరీఫ్ కుటుంబ అవినీతిపై పిటిషన్ దాఖలైంది. అప్పటినుంచి షరీఫ్‌పై కత్తి వేలాడుతూనే ఉంది.
అక్రమార్జనతో లండన్‌లో, ఖతార్‌లో విలాసవంతమైన భవంతులు సమకూర్చుకున్నారని, పరి శ్రమలు స్థాపించారని ఆ పిటిషన్ సారాంశం. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో జిట్ ఏర్పాటు చేసింది. షరీఫ్ పదవిలో కొనసాగవచ్చునా లేదా అన్న మీమాంస అప్పుడే తలెత్తింది. అయితే ముందు జిట్ ఏర్పాటు చేసి, దాని దర్యాప్తులో ఏం తేలుతుందో చూశాక నిర్ణయం తీసుకోవచ్చునని 3–2 మెజా రిటీతో ధర్మాసనం తేల్చింది. దాంతో షరీఫ్‌కు తాత్కాలికంగా ఉపశమనం లభిం చింది. పనామా పత్రాల్లో నేరుగా షరీఫ్ కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మర్యం పేర్లున్నాయి.
నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ)కి ఆ పత్రాలు చేరిన వెంటనే షరీఫ్, ఆయన పిల్లలు, ఎంపీ కూడా అయిన అల్లుడు కెప్టెన్ మహమ్మద్ సఫ్దర్, ఆర్ధికమంత్రి ఇషాక్ దార్‌లపై క్రిమినల్ కేసులు నమోదై దర్యాప్తు ప్రారం భమవుతుంది. వాస్తవానికి షరీఫ్ సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన స్వయంగా పారిశ్రామికవేత్త. ఉక్కు వ్యాపారంలో దిగ్గజం. 1988 నుంచి సాగిస్తున్న అక్రమ వ్యాపారాల ద్వారా భారీ మొత్తంలో ఎగవేతలకు పాల్పడ్డారని, తన అధి కారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి మార్గంలో భారీగా ఆస్తులు పోగేశారని ఆరో పణలొచ్చాయి. పాకిస్తాన్ తెహ్రిక్–ఏ–ఇన్సాఫ్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ షరీఫ్‌పై కోర్టులో కేసులు దాఖలు చేయడంతోపాటు ఆయన రాజీనామా కోరుతూ నిరుడు నవంబర్‌లో ఇస్లామాబాద్ ముట్టడి ఉద్యమం కూడా నడిపారు.
నవాజ్ షరీఫ్‌కు ‘పంజాబ్ సింహం’ అని పేరుంది. ప్రధానిగా ఇది ఆయనకు మూడో దఫా. కానీ ఏ ఒక్కసారీ పూర్తికాలం ఆ పదవిలో కొనసాగలేకపోయారు. మొదటిసారి 1990–93 మధ్య ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అవినీతి ఆరో పణల వల్ల పదవినుంచి తప్పుకోవాల్సివచ్చింది. 1997–99 మధ్య పదవిలో ఉన్న ప్పుడు నాటి సైనిక దళాల చీఫ్ పర్వేజ్ ముషార్రఫ్ సైనిక కుట్ర చేసి దించేశారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లింలీగ్ (పీఎం ఎల్) మంచి మెజారిటీ సాధించడంతో ఆయన మూడోసారి ఆ పదవిని అధిష్టిం చారు. వచ్చే ఏడాది మరోమారు ఎన్నికలకు వెళ్లాల్సి ఉండగా ఊహించని రీతిలో న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ మాటకొస్తే పాక్ చరిత్రలో ఒక్క అసిఫ్ అలీ జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) సర్కారు మినహా ఏ ప్రభుత్వమూ పూర్తికాలం బతికి బట్టకట్టలేదు. జర్దారీ ప్రభుత్వం కూడా చివరి రెండేళ్లూ సంక్షోభంలో కొట్టుమిట్టాడింది. సైన్యం పట్టు అధికంగా ఉండే పాకిస్తా న్‌లో పౌర ప్రభుత్వాలెప్పుడూ దినదినగండంగానే బతికాయి.
ఆ దేశంలో అధిక కాలం సైనిక పాలనే సాగింది. పాక్‌ను అటు ఆర్ధిక సంక్షోభం, ఇటు ఉగ్రవాదం పట్టి పీడిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ సంక్షోభం ఆ సమస్యలను మరింత ముదిరేలా చేస్తుంది. షరీఫ్ స్థానంలో ఆయన సోదరుడు, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్ వస్తారని అంటున్నా ముందుగా ఆయన జాతీయ అసెంబ్లీకి ఎన్ని కకావాల్సి ఉంది. అందుకు కనీసం 45 రోజులు పడుతుంది. ఈలోగా పీఎంఎల్ నుంచి ఎవరో ఒకరు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఈ తీర్పు షరీఫ్‌ను అనేకవిధాల దెబ్బతీసింది. ఆయనపై అనర్హత వేటు పడటమే కాదు...ఆయన వారసురాలిగా ప్రచారంలోకొచ్చిన మర్యం భవిష్యత్తును కూడా అగమ్యగోచరం చేసింది. చూడటానికి ఈ తీర్పు సాహసోపేతమైనదని పిస్తున్నా అక్కడి న్యాయవ్యవస్థ తటస్థత సందేహాస్పదమైనది. ఇప్పుడు తీర్పు వెలు వరించిన న్యాయమూర్తులందరూ ముషార్రఫ్ పాలనాకాలంలో నియమితులైన వారు. పైగా షరీఫ్ పేరు పనామా పత్రాల్లో ఎక్కడా లేదు. ఈ మాదిరి రాజకీయ పరమైన కేసులను ఎలా స్వీకరిస్తారని అస్మా జహంగీర్, అలీ అహ్మద్ కుర్దు లాంటి ప్రముఖ న్యాయవాదులు అప్పట్లో న్యాయవ్యవస్థను ప్రశ్నించారు.
ఇంత వేగంగా ఈ కేసు విచారణ పూర్తి చేయడంలోని ఆంతర్యమేమిటన్న సంగతలా ఉంచితే... కేసులు నమోదై దర్యాప్తు సాగకముందే, దానిపై కోర్టుల్లో విచారణ జరగకముందే షరీఫ్ అనర్హుడెలా అవుతారు? అనర్హత ప్రకటనకు ఎందుకంత తొందర? ఇమ్రాన్ పార్టీ పాక్ సైన్యం ఆశీస్సులతో ఏర్పాటైంది. పనామా పత్రాలు బయటికొచ్చాక ఆ పార్టీ నిర్వహించిన ఉద్యమం జనంలో అభాసుపాలయ్యాక సైన్యమే న్యాయస్థానం ద్వారా కథ నడిపిందన్న ఆరోపణలున్నాయి. ఇటీవల అనేక అంశాల్లో షరీఫ్‌కూ, సైన్యానికీ పొసగటం లేదు. ఏదేమైనా షరీఫ్ నిష్క్రమణతో పాక్ రాజకీయాలపై సైన్యం పట్టు మరింత హెచ్చుతుంది. అది భారత్–పాక్ సంబంధాలపైనా, సీమాంతర ఉగ్రవాదంపైనా పెను ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో మన దేశం అప్రమత్తంగా ఉండకతప్పదు.