అత్యంత అమానుషం | TRS Leader Krishna Rao Attack On Forest Officer At Sirpur | Sakshi
Sakshi News home page

అత్యంత అమానుషం

Published Tue, Jul 2 2019 3:55 AM | Last Updated on Tue, Jul 2 2019 3:55 AM

TRS Leader Krishna Rao Attack On Forest Officer At Sirpur - Sakshi

తెలంగాణలోని కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో ఆదివారం నాడు మహిళా అటవీ అధికారి(ఎఫ్‌ఆర్‌ఓ) అనితపైనా, ఇతర సిబ్బందిపైనా జరిగిన దాడి దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై అధికార పక్ష ప్రజాప్రతినిధే అనుచరులను పోగేసుకుని దాడికి దిగడం ఆశ్చర్యం కలిగి స్తుంది. ఇది నాలుగేళ్లక్రితం ఏపీలో చంద్రబాబు పాలనలో తహసీల్దార్‌ వనజాక్షిపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన నాయకత్వంలోని మాఫియా గణం చేసిన దాడిని గుర్తుకు తెచ్చింది. అయితే ఆ దాడి విషయంలో బాబు తరహాలోకాక తెలంగాణ సీఎం కేసీఆర్‌ సార్సాల ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నారు. దానికి నాయకత్వం వహించిన జడ్‌పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణతో ఆ పదవికి రాజీనామా చేయించారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం జరిగినప్పుడు చేష్టలుడిగి ఉండిపోయిన డీఎస్‌పీ, సీఐలను సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాలను అమలు చేసే క్రమంలో సిబ్బందికి ఇబ్బందులు తలెత్తడం రివాజే. ఆ విధానాలతో నష్టపోతున్నామని భావించేవారు తమ వాదనను బలంగా వినిపించడం, భావోద్వేగాలు పెరిగి అడ్డుకోవడానికి ప్రయత్నించడం కూడా సర్వసాధారణం. కానీ కర్రలతో ప్రభుత్వ సిబ్బందిపై దాడికి తెగబడటం క్షమార్హం కానిది. అలాంటి చర్యల పర్యవసానంగా ఉన్న సమస్య పరిష్కారం కాకపోగా అది పూర్తిగా శాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహారంగా మారి వికటిస్తుంది.

పోడు భూముల సమస్య దాదాపు దేశమంతా ఉంది. అడవులపై తమకున్న సంప్రదాయ హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆదివాసులు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ విషయంలో ఎన్నో ఉద్యమాలు సాగాక అటవీ హక్కుల చట్టం అమల్లోకొచ్చింది. కానీ దశాబ్దకాలం గడిచినా, లోటుపాట్లను సవరించడానికి మధ్యలో దానికి సవరణలు చేసినా అది సక్ర మంగా అమలు చేయటం లేదన్నది గిరిజనుల ఆరోపణ. ఆ చట్టం ప్రకారం తమ సాగులో ఉన్న అటవీ భూములకు వ్యక్తిగత పట్టాలివ్వాలని, అలాగే గిరిజన గూడేలకు ఉమ్మడి హక్కు పత్రాలు  ఇవ్వాలని వారు కోరుతున్నారు. వానా కాలం ప్రవేశించాక పోడు భూములు సాగు చేసుకుందామని గిరిజనులు ప్రయత్నించినప్పుడు అటవీ సిబ్బంది దాడులు చేయడం ఏటా షరా మామూలుగా సాగుతోంది. పోడు భూములకు పట్టాలున్నా అటవీ సిబ్బంది ఖాతరు చేయరని, విత్తనాలు చల్లు కున్న భూమిని బుల్‌డోజర్లతో, జేసీబీలతో నాశనం చేస్తారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గిరిజ నుల దగ్గరున్న పట్టాలు సరైనవా, కాదా... అందులో సాగు చేసుకోవడానికి వారికి హక్కుందా లేదా అన్న సంగతిని నిర్ధారిస్తే పదే పదే ఈ ఉదంతాలు పునరావృతం కావు. మొక్కలు నాటాలనుకున్న భూమి తమదేనని అటవీ శాఖ అంటుంటే, తమకు పట్టాలున్నాయని గిరిజనులు చెబుతున్నారు.

కొన్నిచోట్ల గిరిజనేతరులు సైతం ప్రవేశించి వారికి దక్కాల్సిన ప్రయోజనాలను కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాజకీయ నాయకులు తమ పలుకుబడితో తాత్కాలికంగా సమస్య సద్దుమణి గేలా చూస్తున్నారు. కానీ మరుసటి ఏడాది తిరిగి ఇదంతా యధాప్రకారం సాగుతుంది. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా అటవీ సిబ్బందిపై దాడులు చేయడం, వారిని దుర్భాషలాడటం వంటి ఉదం తాలు చోటుచేసుకుంటాయి. ఈ ఉదంతాల్లో ఎందరో గిరిజనులు కేసుల్లో చిక్కుకుని జైలుపాలవు తున్నారు. కేవలం బతకడానికి, కుటుంబాలను బతికించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో గిరిజ నులు ఇన్ని ఇబ్బందులు పడటం విషాదకరం. అటవీ భూములను ప్రాజెక్టుల పేరు చెప్పి, అభ యారణ్యాల పేరు చెప్పి, రిజర్వ్‌ ఫారెస్టు భూములుగా చూపి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుం టుంటే... వాటిపై ఆధారపడి జీవించే గిరిజనుల బతుకు అధోగతి అవుతోంది. గత నెలలో ఇదే కాగజ్‌నగర్‌ మండలం కొలాంగోందిగూడలో 67మంది గిరిజనులను టింబర్‌ డిపోలో నిర్బంధిం చిన ఉదంతం ఇటువంటిదే. హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని నిర్బంధితులను విడుదల చేయ డంతోపాటు వారికి ఆర్నెల్లలో భూమి, ఏడాదిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించింది.
 
గిరిజనుల జీవనాధారం దెబ్బతినకుండా, వారిని అడవికి దూరం చేయకుండా సమస్యను ఎలా పరిష్కరించాలన్న అంశంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. హరితహారమో, మరే ఇతర కార్య క్రమమో మొదలెట్టినప్పుడు... లేదా ఒక విధానాన్ని రూపొందించే ముందు ఆ సమస్యతో సంబంధం ఉన్న అన్ని పక్షాలనూ పిలిచి మాట్లాడటం, ప్రజాప్రతినిధులను కూడా అందులో భాగ స్వామ్యం చేయడం, అందరి అంగీకారంతో ఒక సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించడం అవ సరం. ఎవరి దారి వారిదన్నట్టు ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించడం, దాన్ని అమలు చేయటం కోసం అధికారులు రంగంలోకి దిగడం, ప్రజాప్రతినిధులు జనాన్ని సమీకరించి ఆ అధికా రులపై దాడులకు పూనుకోవడం ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీస్తుంది.

ఆదివారం నాటి ఉదంతంలో అనితను లక్ష్యంగా చేసుకుని కోనేరు కృష్ణ, ఆయన అనుచరులు సాగించిన దాడే ఇందుకు రుజువు. అంతమంది జనాన్ని పోగేసి ఆమెపైనా ఇతర సిబ్బందిపైనా దాడికి దిగడానికి బదులు... తానూ, తన సోదరుడు అధికార పక్ష ప్రజాప్రతినిధులు కనుక ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో చర్చించి స్థానిక సమస్యలేమిటో చెప్పడం, ఇప్పుడు అమలవుతున్న విధానంలో సవరణలు సూచించడం, అటవీ హక్కుల చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడటం వంటివి చేయాలి. అందుకు భిన్నంగా అధికారులనూ, సిబ్బందినీ దాడులతో బెదరగొడితే సమస్య తీరు తుందని వారెలా అనుకున్నారో అనూహ్యం. సార్సాల దాడి ఉదంతం పోడు భూముల చుట్టూ అల్లుకున్న సమస్యల తీవ్రతను తెలియజేసింది గనుక తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారిం చాలి. భవిష్యత్తులో సార్సాల ఉదంతం వంటివి పునరావృతం కాకుండా అందరి సహకారంతో సామరస్యపూర్వక పరిష్కారం సాధించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement