ఇంత దిగజారుడా?! | vote for money realese WikiLeaks organization | Sakshi
Sakshi News home page

ఇంత దిగజారుడా?!

Published Sun, Jul 12 2015 11:43 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

vote for money  realese WikiLeaks organization

చెప్పే మాటలకూ, చేసే చేతలకూ పొంతన ఉండదని పదే పదే నిరూపించుకుం టున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దొంగ చెవుల’ వ్యవహా రంలోనూ అడ్డంగా దొరికిపోయారు. అమెరికా మొదలుకొని దేశదేశాల అధినేతలూ తెరచాటున చేస్తున్న పాపాలేమిటో...అంతఃపుర కుట్రలేమిటో డాక్యుమెంట్ల ఆధారంతో వీధికీడుస్తున్న జూలియన్ అసాంజ్ నేతృత్వంలోని వికీలీక్స్ సంస్థే బాబు సంగతిని కూడా వెల్లడించి పుణ్యం కట్టుకుంది. లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో మూడేళ్లుగా అసాంజ్ ఆశ్రయం పొందుతుండగా... ఆయన మొదలెట్టిన పనిని ఇప్పుడు ఖండాంతరాల్లో అనేకులు కొనసాగిస్తున్నారు. కనుక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకే కాదు...బాబుకు కూడా ప్రస్తుతం వికీలీక్స్ కంట్లో నలుసే. నెల్లాళ్లక్రితం ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలోని ఆడియో, వీడియోలు బట్టబయలైనప్పుడు ఆయన పోద్బలంతో ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాట్లాడిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ వ్యవహారానికి సమాంతరంగా ఫోన్ ట్యాపింగ్‌నూ, దాంతోపాటు సెక్షన్ 8నూ తీసుకొచ్చి చేసిన రగడ అంతా ఇంతా కాదు. మీడియాలో గగ్గోలు పెట్టడంతో ఊరుకోక రాష్ట్రపతి మొదలుకొని అందరికీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వికీలీక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆ రగడకు చాలాముందే...జనవరిలోనే ఆయన ట్యాపింగ్ పరికరాలు కొనడానికి సిద్ధపడినట్టు స్పష్టమవుతున్నది. జరగని ఫోన్ ట్యాపింగ్ గురించి పదే పదే గొడవచేసి అది చాలా అపవిత్రమన్నట్టు మాట్లాడినవారు తామే ట్యాపింగ్ టెక్నాలజీని కొనడానికి ప్రయత్నించడాన్నిబట్టి చూస్తే బాబు పాటిస్తున్న విలువలేమిటో అర్థమవుతుంది. ఇప్పుడు వెల్లడైన సమాచారం ప్రకారం బాబు ప్రభుత్వం కొనదల్చుకున్న ఉపకరణం ఉన్నత శ్రేణికి చెందినదని, అది ఇంతవరకూ దేశంలో కేంద్ర హోంశాఖ అధీనంలోనూ, ముంబై ఉగ్రవాద నిరోధక బృందం వద్ద ఉన్నదని చెబుతున్నారు.

 జాతీయభద్రత వంటి అంశాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండటం, అనుమానం వచ్చినవారిపై నిఘా పెట్టడం సాధారణమే. అయితే, దానికి కొన్ని విధానాలుంటాయి. చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప ఏ పౌరుడి జీవితాన్నీ, స్వేచ్ఛనూ హరించరాదని మన రాజ్యాంగం అంటోంది. విషాదమేమంటే మన ప్రభుత్వాలు ఇప్పటికీ బ్రిటిష్ వలస పాలకులు తీసుకొచ్చిన 1885నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని నిబంధనలనే అనుసరిస్తున్నాయి. కేంద్రానికీ, రాష్ట్రాలకూ ఫోన్ ట్యాపింగ్‌కు అధికారమిస్తున్న ఆ చట్టంలోని సెక్షన్ 5(2)కు 1971లో సవరణ తీసుకొచ్చినప్పుడే అందరూ భయాందోళనలు వ్యక్తంచేశారు. ఈ సవరణపై దాఖలైన పిటిషన్‌ను విచారించినప్పుడు ట్యాపింగ్ అనేది పౌరుల వ్యక్తిగత గోప్యత లోకి చొరబడటమేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే సవరణ చెల్లదని చెప్పకుండా దాని నియంత్రణకు మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్రంలో నూ, రాష్ట్రాల్లోనూ హోం శాఖ కార్యదర్శులు ప్రతి కేసునూ పరిశీలించి సహేతుకమై నదని భావించినప్పుడే ట్యాపింగ్‌కు అనుమతించాలని, వీటి చట్టబద్ధత ను సమీక్షిం చడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీ నియమించాలని ఆ మార్గదర్శకాలు సూచిం చాయి. ఈ నియంత్రణలు అమల్లోకి రావడానికి కూడా మరో ముప్ఫై ఏళ్లుపట్టింది. తర్వాత చాలా సందర్భాల్లో సైతం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. పెపైచ్చు నిబంధనల ప్రకారం ట్యాపింగ్ పరికరాలు కేంద్రానికి తెలియకుండా, చెప్పకుండా కొనడానికి వీల్లేదు.  పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను అత్యంత పవిత్రమైనదిగా భావించి, ఎవరూ విచక్షణారహితంగా దానికి తూట్లు పొడవకుండా సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న జాగ్రత్తలన్నీ బాబు ముందు బలాదూరయ్యాయని వికీలీక్స్ వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

 అడిగినవారికీ, అడగనివారికీ కొత్త రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని బాబు ఏడాదిగా చెబుతూనే ఉన్నారు. ఎవరు ఏం డిమాండ్ చేసినా డబ్బుల్లేవనే జవాబు వస్తున్నది. అంగన్‌వాడీ కార్యకర్తలకూ, మున్సిపల్ కార్మికులకూ వేతనాలు పెంచడా నికి దిక్కులేదుగానీ ఉన్నత శ్రేణి ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి సిద్ధం...అది కూడా కేంద్రంనుంచి ముందస్తు అనుమతి లేకుండా! జనవరిలో చేసిన ఈ ప్రయత్నాలు... జూన్‌లో ‘ఓటుకు కోట్లు’ టేపులు వెల్లడయ్యాక మరింత వేగం పుంజుకున్నాయంటే చంద్రబాబు లక్ష్యం ఎవర న్నది సులభంగానే తెలుస్తుంది. ‘ఆశగలమ్మ దోషమెరగదు...పూటకూళ్లమ్మ పుణ్య మెరగద’ని సామెత. ఒకపక్క ట్యాపింగ్‌లో ఉన్న అప్రజాస్వామికత గురించి, ప్రభుత్వ పెద్దలపై నిఘా ఉంచడం గురించి బయట లెక్చెర్లు దంచుతూ అదే సమ యంలో ఆ టెక్నాలజీ కోసం చీకటి లావాదేవీలు జరపడం...దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పాకులాడటం, ఆ దెబ్బతో ప్రత్యర్థుల్ని గుక్కతిప్పుకోకుం డా చేయాలని కలగనడం ఎలాంటి వ్యక్తిత్వానికి ప్రతీక? ఈ విషయంలో గురజాడ వారి గిరీశం కూడా బాబు ముందు పిపీలకం అవుతాడేమో! ‘ఓటుకు కోట్లు’ రట్టయ్యాక పైకి అన్నా అనకపోయినా...ఇలాంటి పద్ధతులకు ఇక స్వస్తి చెప్పడం మంచిదని బాబు ఆలోచించి ఉంటే అది టీడీపీకీ, ఆయనకూ కాస్తయినా మేలు చేసేది. కానీ ఆయన ఆ మార్గాన్ని వీడదల్చుకోలేదని ఆంధ్రప్రదేశ్‌లో ఈమధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి. ఆ విషయంలో పరివర్తన సంగతలా ఉంచి అర్జెంటుగా ట్యాపింగ్ టెక్నాలజీని సంపాదించి తెలంగాణలోనూ, ఏపీలోనూ అందరినీ దొరకబుచ్చుకుని పైచేయి సాధించాలని తహతహలాడటం దురాశ అనాలా... దుర్మార్గమనాలా? ఆ క్రమంలో తాను ‘ఓటుకు కోట్లు’ వ్యవహారానికి మించిన తప్పు చేస్తున్నానని ఆయన తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశపడటం తప్పు కాదు...కానీ, అది దురాశ స్థాయికి చేరడం, అందులో దోషమేమి టో గుర్తించలేని స్థితికి చేరుకోవడం విడ్డూరం. ఇదంతా  వ్యతిరేకుల ప్రచారమని ఏపీ మంత్రులు కొట్టిపారేస్తున్నారు. కానీ వెల్లడించిన వికీలీక్స్ నిప్పులాంటిది. దాని ధాటికి అగ్రరాజ్యాలే కుయ్యో మొర్రోమంటున్నాయి. ఈ సమాచార సాంకేతిక యు గంలో తప్పు చేయకపోవడంవల్ల మాత్రమే నిజాయితీపరులుగా గుర్తింపుపొం దవచ్చు తప్ప... చేసి తప్పించుకుందామనుకుంటే చెల్లదని...ఎవరేమిటో పసిగట్టి చెప్పేందుకు వికీలీక్స్‌వంటివి డేగ కళ్లతో చూస్తున్నాయని గ్రహిస్తే మంచిది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement