‘గోప్యత’ ఎలాంటి హక్కు? | What is the right to privacy? | Sakshi
Sakshi News home page

‘గోప్యత’ ఎలాంటి హక్కు?

Published Thu, Jul 20 2017 2:50 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

‘గోప్యత’ ఎలాంటి హక్కు?

‘గోప్యత’ ఎలాంటి హక్కు?

పౌరులు జరిపే సమస్త లావాదేవీలకూ ప్రభుత్వాలు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్న తరుణంలో అసలు వ్యక్తిగత గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి పెట్టింది. వివిధ పథకాలకూ, లావాదేవీలకూ ఆధార్‌ తప్పనిసరి చేస్తుండటాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తుండగా ముందు ఈ సమస్యను తేల్చడం అవసరమన్న నిర్ణయానికొచ్చింది. ఈ విషయంలో వచ్చే స్పష్టతను బట్టి ఆధార్‌ చెల్లుబాటు సంగతి తేలుతుంది. ఆధార్‌ ఉనికిలోకి వచ్చి నప్పటినుంచి దాని చుట్టూ వివాదాలు అల్లుకుంటూనే ఉన్నాయి.

2009 జనవరిలో కేవలం పాలనాపరమైన ఒక ఉత్తర్వు ద్వారా మొదలైన ఆధార్‌ ఉన్నకొద్దీ బలం పుంజుకుంది. 2010లో దీనికి సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లును ఆ మరుసటి సంవత్సరం పార్లమెంటు స్థాయీ సంఘం తిరస్కరించాక ఇది ఆగినట్టు కనబడినా స్వల్ప కాలంలోనే చకచకా కదిలింది. పార్లమెంటులో చర్చించకుండా, దాని ఆమోదం పొందకుండా కేవలం పాలనా ఉత్తర్వుపై అమల్లోకి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమంటూ 2012లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆధార్‌ వల్ల పౌరుల డేటా అసాంఘిక శక్తుల చేతుల్లో పడొచ్చునని, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లవచ్చునని పిటిషనర్లు వాదించారు.

ఈ కేసు విచారణ పూర్తయి తీర్పు వెలువడే వరకూ పౌరులకు ఆధార్‌ తప్పనిసరి చేయొద్దని, ఏ సంక్షేమ పథకాన్ని వారికి నిరాకరిం చవద్దని న్యాయమూర్తులు సూచించడం... అందుకు ప్రభుత్వం అంగీకరించడం పూర్తయినా ఆధార్‌ దూకుడు ఆగింది లేదు. మొదట రేషన్‌కూ, వంటగ్యాస్‌కూ మినహా మరే ఇతర అంశాలకూ వర్తింపజేయొద్దని చెప్పిన సుప్రీంకోర్టు గత నెలలో పాన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానించడం విషయంలో సానుకూలంగానే స్పందించింది. ఆధార్‌ ఉన్నవారు అనుసంధానించుకోవాలని, లేనివారు ఆ పని చేయనవసరం లేదని చెప్పడం వల్ల సారాంశంలో చాలామందికి అది తప్పనిసరే అయింది. అసలు సుప్రీంకోర్టు దృష్టికి రాకుండా ఆధార్‌తో ముడిపెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఇలా సాగుతుండగానే, సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడకుండానే ఆధార్‌ బిల్లును నిరుడు పార్లమెంటులో ప్రవేశపెట్టడం, అది ఆమోదం పొందడం కూడా పూర్తయ్యాయి. తగిన మెజారిటీ లేని కారణంగా రాజ్యసభలో గట్టెక్కలేమనుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని ద్రవ్య బిల్లుగా చూపింది. ఒకపక్క ఆధార్‌ తీరుతెన్నులపైనా, దాని రాజ్యాంగబద్ధతపైనా, ఈ పథకంలో ఇమిడి ఉన్న వ్యక్తిగత గోప్యత అంశంపైనా సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తుండగానే ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకోవడం ఎలా చూసినా సమర్ధనీయం కాదు.

 ఆధార్‌ పథకం, దాని చెల్లుబాటు సంగతలా ఉంచి ఇప్పుడు అసలు వ్యక్తిగత గోప్యత ఏ రకమైన హక్కు అనే అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించ బోతోంది. దీన్ని తేల్చడానికి మంగళవారం తొమ్మిదిమంది న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పర్చడం, అది బుధవారం నుంచే విచారణ మొదలు పెట్టడం గమనార్హమైన విషయం. రాగల రెండురోజుల్లో ఈ ధర్మాసం దీనిపై తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆధార్‌ చట్టబద్ధతను అయి దుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలిస్తుంది. వ్యక్తిగత గోప్యత అన్నది పౌరులకుండే చట్టపరమైన హక్కే తప్ప రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కాదని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదిస్తున్నారు. ఆ రకమైన హక్కే అయిన పక్షంలో మన రాజ్యాంగ నిర్మాతలు దాన్ని స్పష్టంగా చెప్పేవారన్నది ఆయన వాదన. రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు గనుక అది ప్రాథమిక హక్కు కాదనడం తార్కికంగా ఆమోదయోగ్యం కాదని ధర్మాసనంలోని జస్టిస్‌ చలమేశ్వర్‌ అనడం గమనించదగ్గది.

మన సమాజం ఏ దిశగా పయనించాలని... ఏ లక్ష్యాన్ని చేరుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారన్నదే న్యాయస్థానాలకు ప్రధానం. రాజ్యాంగాన్ని సృజనాత్మకంగా అన్వయించడంలో న్యాయమూర్తులకు అదే గీటురాయి. అందులో భాగంగానే జీవించే హక్కుకు పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిని వివిధ తీర్పుల ద్వారా సుప్రీంకోర్టు గతంలో విస్తరించింది. జీవించే హక్కంటే కేవలం ప్రాణానికి సంబంధించిన హక్కు మాత్రమే కాదని, అది గౌరవప్రదంగా జీవించే హక్కు కూడానని మేనకాగాంధీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వామి అగ్నివేష్‌ నేతృత్వంలోని వెట్టి కార్మికుల విముక్తి సంస్థ కేసులో అయితే దోపిడీకి గురికాకుండా ఉండటం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్య కరమైన వాతావరణంలో ఎదిగేందుకు పిల్లలకు అవకాశం కల్పించడం వగైరాలు కూడా జీవించే హక్కు పరిధిలోకే వస్తాయని తెలిపింది. అలాగే పనిచేసే స్థలాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండటం కూడా జీవించే హక్కు పరిధిలోకే వస్తుందని మరో తీర్పులో వివరించింది. రాజ్యాంగంలో పొందుపరచ లేదు గనుక వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదన్న అటార్నీ జనరల్‌ వాదనను అంగీకరిస్తే ఈ హక్కులన్నీ ‘ప్రాథమిక హక్కు’ పరిధిలోకి రాకుండా పోతాయి.

1954లో ఒకసారి, 1963లో మరోసారి ఇచ్చిన వేర్వేరు తీర్పుల్లో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పి ఉండొచ్చు. అయితే మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విస్తృత కోణంలో మరోసారి ఆ తీర్పులను పరిశీలించవలసిన సమయం ఆసన్నమైంది. మొదటి కేసును 8మంది న్యాయమూర్తుల ధర్మాసనం, రెండో కేసును ఆరుగురు న్యాయమూర్తుల ధర్మా సనం పరిశీలించి తీర్పులను ఇచ్చాయి గనుక ఇప్పుడు అంతకన్నా అధిక సంఖ్యలో న్యాయమూర్తులుండే ధర్మాసనం ఏర్పాటు అవసరమైంది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా పరిగణిస్తే ఆధార్‌ ‘సకారణమైన పరిమితి’ కిందికే వస్తుందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంటుంది. ఏం జరుగు తుందన్నది ఒకటి రెండురోజుల్లో తేలిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement