హైదరాబాద్ లో జీవ పరిశోధన | Biological Research in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో జీవ పరిశోధన

Published Wed, Nov 25 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

హైదరాబాద్ లో జీవ పరిశోధన

హైదరాబాద్ లో జీవ పరిశోధన

అవార్డులు
  యూఎన్ హెచ్‌సీఆర్‌కు
 ఇందిర శాంతి బహుమతి ఐక్యరాజ్యసమితి శరణార్థుల పరిరక్షక కమిషనర్ (యూఎన్‌హెచ్‌సీఆర్)కు 2015 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులకు సహాయ సహకారాలు అందించడంతోపాటు వారి సంక్షేమానికి ఇది కృషి చేస్తోంది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని కమిటీ యూఎన్‌హెచ్‌సీఆర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
 
 కులదీప్ నయ్యర్‌కు గోయంకా అవార్డు
 2013-14 సంవత్సరానికి రామ్‌నాథ్ గోయంకా జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనియర్ పాత్రికేయుడు, కాలమిస్టు, రచయిత కులదీప్ నయ్యర్‌కు నవంబర్ 23న న్యూఢిల్లీలో అందజేశారు. పాత్రికేయుడిగా ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారం దక్కింది. ఆయన గతంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు.
 
 యార్లగడ్డకు గురజాడ పురస్కారం

 2015 గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారం డా॥యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు లభించింది. విజయనగరంలోని సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థలు.. ఏటా నవంబర్ 30న ఈ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని గురజాడ పురస్కారంతో సత్కరిస్తాయి.
 
 వార్తల్లో వ్యక్తులు
  ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా స్వాతి దండేకర్
 ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారతీయ అమెరికన్, రాజకీయవేత్త స్వాతి దండేకర్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నవంబర్ 19న నియమించారు.
 
 ప్రపంచ జలమండలి గవర్నర్‌గా
 పృథ్వీరాజ్ సింగ్  రాజస్థాన్‌లోని ‘జల్ భగీరథి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పృథ్వీరాజ్ సింగ్ ప్రపంచ జల మండలి గవర్నరుగా నవంబర్ 16న ఎంపికయ్యారు. ఫ్రాన్స్‌లో జరిగిన మండలి సమావేశంలో 160 దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయనను ఎన్నుకున్నారు.
 
 వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత
 విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సీనియర్ నేత అశోక్ సింఘాల్(89) గుర్‌గావ్‌లో నవంబర్ 17న మరణించారు. ఆయన 1980లో వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
 
 సైన్‌‌స అండ్ టెక్నాలజీ
  ఏఏడీ క్షిపణిని పరీక్షించిన భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ) క్షిపణిని భారత్ నవంబర్ 22న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవిలో విజయవంతంగా పరీక్షించింది. ఈ సూపర్ సోనిక్ ఇంటర్‌సెప్టార్ మిస్సైల్‌ను బహుళ అంచెల క్షిపణిగా అభివృద్ధి చేశారు. 7.5 మీటర్ల పొడవైన ఏఏడీ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇందులో ఆధునిక దిక్సూచి వ్యవస్థ, కంప్యూటర్, ఎలక్ట్రో మెకానికల్ యాక్టివేటర్లు ఉంటాయి.
 
 జాతీయం
 బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్
 బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నవంబర్ 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఇది అయిదోసారి, వరుసగా మూడోసారి. ఆయనతో పాటు 28 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు మంత్రివర్గంలో చేరారు. వీరిలో తేజ్ ప్రతాప్ ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
 
 హైదరాబాద్‌లో జీవ పరిశోధన కేంద్రం
 హైదరాబాద్‌లో జీవ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నవంబర్ 18న ఆమోదం తెలిపింది. జీవ వైద్య పరిశోధనలకు జాతీయ వనరుల సంస్థ (ఎన్‌ఏఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేస్తారు. వైద్య అవసరాల కోసం, వివిధ రకాల పరిశోధనలకు జంతు వనరులను ఈ సంస్థ సమకూరుస్తుంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దీన్ని ఏర్పాటు చేస్తోంది. రూ.338.58 కోట్లతో ఏర్పాటు చేసే ఈ సంస్థ 2018-19 నాటికి విధులు నిర్వహిస్తుంది.
 
 క్రీడలు
 ప్రపంచ టూర్ టైటిల్
 ఏటీపీ ప్రపంచ టూర్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. నవంబర్ 23న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను ఓడించాడు. ఈ టైటిల్‌ను జకోవిచ్ వరుసగా నాలుగోసారి, మొత్తం మీద 5వసారి సాధించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను హొరియా టెకావ్ (రుమేనియా)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట.. రోహన్ బోపన్న(భారత్), ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీని ఓడించి గెలుచుకుంది.
 
 స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్ విజేత పంకజ్ అద్వానీ
 ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను బెంగుళూరుకు చెందిన పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. నవంబర్ 21న హర్గాడా (ఈజిప్ట్)లో జరిగిన ఫైనల్లో జావో జిన్‌టాంగ్ (చైనా)పై అద్వానీ విజయం సాధించాడు.
 
 హాంకాంగ్ ఓపెన్ టైటిల్
 హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లీ చోంగ్‌వీ (మలేసియా) గెలుచుకున్నాడు. నవంబరు 22న కౌలూన్ (హాంకాంగ్)లో జరిగిన ఫైనల్లో తియాన్ హువీ (చైనా)ను ఓడించాడు. ఇది చోంగ్‌వీకి కెరీర్‌లో 60వ సింగిల్స్ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కరోలినా మారిన్(స్పెయిన్) దక్కించుకుంది. ఫైనల్లో నొజోమీ ఒకుహారా(జపాన్)ను ఓడించింది.
 
 ఆసియా జూనియర్ హాకీ చాంపియన్‌షిప్
 ఆసియా జూనియర్ హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. నవంబర్ 22న క్వాంటన్(మలేసియా)లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఇందులో భారత్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం మూడోసారి. 2004, 2008లో కూడా ఈ టైటిల్‌ను సాధించింది.
 
 రాష్ట్రీయం
 ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు
 విశాఖపట్నంలో నాలుగు రోజుల పాటు జరిగిన ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు (డబ్ల్యూసీడీఎం) రెండో సమావేశం నవంబర్ 22న ముగిసింది. 46 దేశాలకు చెందిన 100 మంది నిపుణులు, 1000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం డిక్లరేషన్‌ను విడుదల చేశారు. విపత్తు నిర్వహణకు పూర్తి స్థాయి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను ఏర్పాటు చేయడం, ప్రజలకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం వంటి అంశాలు డిక్లరేషన్‌లో ఉన్నాయి.
 
 వరంగల్ ఉప ఎన్నికలో తెరాస విజయం
 వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఇది దేశంలోనే ఏడో అత్యధిక మెజారిటీ.
 
 ఆర్థికం
  అక్టోబర్‌లో -3.81 శాతంగా
 డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం  ఈ ఏడాది అక్టోబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -3.81 శాతంగా నమోదైంది. ఇది సెప్టెంబర్‌లో -4.54 శాతంగా ఉంది. 2014 అక్టోబర్‌లో 1.66 శాతంగా నమోదైంది. అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిలో ఉండటం వల్ల టోకు ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెల మైనస్‌లోనే కొనసాగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నవంబర్ 16న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
 
 ఆస్తుల రికవరీపై ప్రపంచ సదస్సు
 ఆస్తుల రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సు నవంబర్ 18న న్యూఢిల్లీలో జరిగింది. సీబీఐ, అవినీతి నిరోధక, విజిలెన్స్ విభాగాల 21వ సదస్సును కూడా నిర్వహించారు. వ్యవస్థీకృత నేరాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటివి అక్రమ నిధులు పెంపొందిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
 
 102 కోట్లకు చేరిన
 టెలిఫోన్ వినియోగదారులు  దేశంలో ఈ ఏడాది (2015) సెప్టెంబర్ నాటికి టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 102 కోట్లకు చేరిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నవంబర్ 18న తెలిపింది. టెలీ- డెన్సిటీ కూడా 80.98 శాతానికి పెరిగింది.
 
 అంతర్జాతీయం
 కౌలాలంపూర్‌లో ఆసియాన్ సదస్సు
 ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) సదస్సు మలేసియాలోని కౌలాలంపూర్‌లో నవంబర్ 21న జరిగింది. పదమూడో భారత్-ఆసియాన్ సదస్సు కూడా ఇక్కడే జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్- ఆసియాన్‌ల మధ్య భౌగోళిక, డిజిటల్ అనుసంధానత కోసం రూ. 100 కోట్ల రుణాన్ని ఆయన ప్రకటించారు. అన్ని ఆసియాన్ దేశాలకు ఈ-వీసా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ సదస్సులో ఆగ్నేయాసియా దేశాలు ప్రత్యేక ఆర్థిక సమాజం (ఏఈసీ)ను నవంబర్ 22న ఏర్పాటు చేసుకున్నాయి. సభ్య దేశాల మధ్య స్వేచ్ఛాయుత సరుకు రవాణా, పెట్టుబడుల ప్రవాహానికి ఇది తోడ్పడుతుంది.
 
 మలేసియాతో మూడు ఒప్పందాలు
 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేసియా పర్యటనలో నవంబర్ 23న ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్‌తో సమావేశమయ్యారు. భద్రత, రక్షణ రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సైబర్ భద్రత, 2015-20 మధ్యకాలంలో సాంస్కృతిక పర్యటనలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి.
 
 జీటీఐలో భారత్‌కు ఆరో స్థానం
 ప్రపంచ ఉగ్రవాద సూచీ (జీటీఐ)- 2015లో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. వాషింగ్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ సంస్థ నవంబర్ 18న విడుదల చేసిన ఈ సూచీలో 2014 లో ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన తొలి 10 దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. 2014లో 162 ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది. అఫ్గానిస్తాన్, ఇరాక్, నైజీరియా, పాకిస్థాన్, సిరియాలో ఉగ్రవాద ప్రభావం ఎక్కువ ఉందని ఆ సంస్థ తెలిపింది.
 
 సంక్షిప్తంగా
 ‘గాంధీ’ చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు సయీద్ జాఫ్రీ (86) లండన్‌లో నవంబర్ 14న మరణించారు.విజయనగరంలోని గురజాడ అప్పారావు నివాసానికి రక్షిత కట్టడంగా ప్రభుత్వం గుర్తింపునిస్తూ నవంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చారిత్రక కట్టడాలు, పురావస్తు చట్టం 1960 కింద గురజాడ నివాసాన్ని రక్షిత కట్టడంగా గుర్తించారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా సయ్యద్ అక్బరుద్దీన్‌ను నవంబర్ 16న ప్రభుత్వం నియమించింది. అశోక్ ముఖర్జీ స్థానంలో అక్బరుద్దీన్ బాధ్యతలు చేపడతారు.ఆఫ్రికా దేశం.. మాలి రాజధాని బమాకాలోని హోటల్‌పై నవంబర్ 20న ఉగ్రవాదులు చేసిన దాడిలో 27 మంది మరణించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement