దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్రణాళిక | CAT Exam - Common Admission Test | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్రణాళిక

Published Thu, Jul 23 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

CAT Exam - Common Admission Test

 క్యాట్-2015 నిర్వహణను పర్యవేక్షిస్తున్న ఐఐఎం-అహ్మదాబాద్.. పరీక్ష నిర్వహణ పరంగా మార్పులు చేయనుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఒకే రోజు రెండు స్లాట్లలో క్యాట్ జరిగే అవకాశముంది. పరీక్ష తేదీ కూడా అక్టోబర్‌లోనే ఉండొచ్చు. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌కు పదును పెట్టాలి. ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు అటు అకడమిక్స్‌తోపాటు, ఇటు క్యాట్ కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
 
 పరీక్ష విధానం:
 క్యాట్ పరీక్షలో ఏటా ఏదో ఒక మార్పు చోటుచేసుకుంటోంది. ఈసారి కూడా కొన్ని మార్పులు ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పరీక్ష విధానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, గతేడాది మాదిరిగానే పరీక్ష స్వరూపం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఈసారి కూడా 1) క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, 2) వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్.. రెండు సెక్షన్‌లు ఉంటాయన్నారు.
 ప్రతి సెక్షన్లో 50 ప్రశ్నలకు 150 మార్కులు చొప్పున రెండు సెక్షన్లకు మొత్తం 300 మార్కులకు పరీక్ష జరగనుంది. సమయం కూడా గతేడాది తరహాలోనే 170 నిమిషాలు ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని గమనించి పటిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగించాలి.
 
 వెర్బల్ ఎబిలిటీ:
 వెర్బల్ ఎబిలిటీ విభాగంలో అధిక స్కోరింగ్‌కు కీలకం.. రీడింగ్ కాంప్రహెన్షన్. ఇందులో మంచి స్కోర్ సాధించాలంటే అభ్యర్థులు ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదవడాన్ని అలవర్చుకోవాలి. చదివేటప్పుడు అందులోని ముఖ్య సమాచారం, ప్రశ్నార్హమైన అంశాలు, కీలక పదాలను గుర్తించే నేర్పును సొంతం చేసుకోవాలి. దీనికోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదవాలి. తర్వాత సొంతంగా క్లుప్తంగా సారాంశం రాసుకోవాలి. వొకాబ్యులరీపై పట్టు సాధించడం వెర్బల్ ఎబిలిటీకి ఎంతో ఉపయోగకరం. ఇంగ్లిష్ గ్రామర్‌లోని కీలక అంశాలను అధ్యయనం చేయాలి. ప్రిఫిక్స్, సఫిక్స్ విధానం.. వర్డ్ లెర్నింగ్ వొకాబ్యులరీపై పట్టు సాధించేందుకు ఉపకరిస్తుంది. రోజూ కనీసం 20 నుంచి 30 కొత్త పదాలను నేర్చుకోవాలి. ఆయా పదాల ఉపయోగించడంపై అవగాహన అవసరం.
 
 లాజికల్ రీజనింగ్:
 స్వీయ ఆలోచన, తులనాత్మక పరిశీలనతో రాణించగలిగే విభాగం లాజికల్ రీజనింగ్. ఇందులో అధిక మార్కుల సాధనకు క్లిష్టమైన డేటాను అర్థం చేసుకుని, విశ్లేషించే నైపుణ్యం చాలా అవసరం. లాజికల్ రీజనింగ్‌లో అడిగే ప్రశ్నలు ఒక సమాచారం ఆధారంగా ఉంటాయి. ప్రధానంగా వెన్ డయాగ్రమ్స్, డిడక్షన్, పజిల్స్, లాజికల్ కనెక్టివిటీ, క్యూబ్స్ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు స్టేట్‌మెంట్లను, ఇతర స్టేట్‌మెంట్లతో పోల్చి అవసరమైన సమాచారాన్ని గుర్తించే నైపుణ్యాన్ని పెంచుకోవాలి.
 
 క్వాంటిటేటివ్ ఎబిలిటీ:
 మ్యాథమెటిక్స్ ఆధారంగా ఉండే క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ప్రిపరేషన్‌ను శాస్త్రీయంగా సాగించాలి. నెంబర్స్, అల్‌జీబ్రా, జామెట్రీ విభాగాల్లో పట్టు ఎంతో ముఖ్యం. వీటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్టులను సమగ్రంగా అధ్యయనం చేయాలి. సూత్రాల ఆధారంగా ప్రశ్నల సాధనకు ప్రాధాన్యమివ్వాలి. పరీక్షకు మూడు, నాలుగు వారాల ముందు వరకు ప్రిపరేషన్ కొనసాగించి, పరీక్ష సమీపిస్తున్నప్పుడు గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. క్లిష్టమైన అంశాలను విస్మరిద్దాం అనే భావన సరికాదు.
 
 డేటా ఇంటర్‌ప్రిటేషన్:
 అభ్యర్థుల్లో గణన సామర్థ్యాన్ని, వేగవంతమైన విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగం డేటా ఇంటర్‌ప్రిటేషన్. ఇందులో రాణించేందుకు సూక్ష్మ పరిశీలన, కాలిక్యులేషన్, లాజికల్ రీజనింగ్ నైపుణ్యాలు పెంచుకోవాలి. నిర్ణీత అంశాన్ని వేగంగా విశ్లేషించే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా పర్సంటేజీ, యావరేజెస్‌పై పట్టు సాధించాలి. ఇందుకోసం ఏదైనా క్యాట్ ప్రామాణిక మెటీరియల్ లేదా ఆన్‌లైన్ టెస్ట్‌లలోని ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కేవలం ఒకే తరహా ప్రశ్నలు కాకుండా భిన్న కాఠిన్యతతో ఉన్న సమస్యల సాధనకు ప్రాధాన్యమివ్వాలి.
 
 ప్రతి అంశమూ ప్రధానమే
 క్యాట్ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్నీ చదవడం అలవర్చుకోవాలి. అకడమిక్ లెర్నింగ్ విధానం తరహాలో క్లిష్టమైన అంశాలను చాయిస్‌కు వదిలేద్దాం అనుకోవడం సరికాదు. ప్రిపరేషన్ సమయం నుంచే పరీక్షలో ఒక ప్రశ్నకు లభించే సమయాన్ని గుర్తిస్తూ ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోవాలి. పదో తరగతి తర్వాత మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ను చదవని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికోసం కొంత ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. చివరి నెల రోజులు పూర్తిగా రివిజన్‌కే కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. చదివే సబ్జెక్ట్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలను షార్ట్ నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.
 - కె.రామ్‌నాథ్,
 క్యాట్ కోర్స్ డెరైక్టర్, టైమ్ ఇన్‌స్టిట్యూట్.
 
 కాన్సెప్టులపై అవగాహన అవసరం
 క్యాట్‌లో విజయం సాధించాలంటే ముందుగా ఆయా సబ్జెక్ట్‌ల కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. అంతేకాకుండా ప్రిపరేషన్ పరంగా స్పష్టమైన అవగాహన ఉండాలి. శాస్త్రీయ దృక్పథంతో చదవాలి. విజయంలో కీలక పాత్ర పోషించే క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్‌ల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవుతూ ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ చేసుకుంటూ ప్రిపరేషన్‌కు పదునుపెట్టుకోవాలి.
 - పి.అనురాగ్ రెడ్డి,
 ఐఐఎం-అహ్మదాబాద్,
 క్యాట్-2014 (100 పర్సంటైల్) విజేత.
 
 క్యాట్-2015 ముఖ్య వివరాలు..
 నోటిఫికేషన్ వెల్లడి: జూలై 26, 2015
 నిర్వహణ ఇన్‌స్టిట్యూట్- ఐఐఎం అహ్మదాబాద్
 ఈ ఏడాది 115 నగరాలు/పట్టణాల్లో క్యాట్ నిర్వహణ. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా వారి సమీప ప్రాంతాల్లోనే టెస్ట్ సెంటర్లు కేటాయించే దిశగా చర్యలు.
 క్యాట్-2015 ఆధారంగా ప్రవేశం కల్పించనున్న
 ఐఐఎంల సంఖ్య: 19
 ప్రస్తుతం ఐఐఎంలలో ఉన్న సీట్ల సంఖ్య: సుమారు 4055.
 
 క్యాట్-2014 కటాఫ్ పర్సంటైల్
 సీటు పొందాలంటే 97 పర్సంటైల్‌పైనే:ఐఐఎంలు పేర్కొనే కటాఫ్‌లు కేవలం దరఖాస్తు ప్రక్రియకు అర్హత ప్రమాణాలు మాత్రమే. అందుబాటులో ఉన్న సీట్లు, పోటీని దృష్టిలో పెట్టుకుంటే 97కుపైగా పర్సంటైల్ సాధిస్తేనే తదుపరి దశలైన జీడీ/పీఐలో పాల్గొనేందుకు, ఆపై సీటు పొందే అవకాశాలుంటాయి. ఐఐఎం-అహ్మదాబాద్, కోల్‌కతాల్లో 99.5 శాతంపైగా పర్సంటైల్ ఉంటేనే ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి కేవలం ప్రాథమిక కటాఫ్‌లపైనే దృష్టి సారించకుండా తుది జాబితాలో నిలించేందుకు అవసరమైన కటాఫ్ పర్సంటైల్ సాధన దిశగా కృషి చేయాలి. కనీస అర్హత కటాఫ్‌ల విషయంలో ఐఐఎంలు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. సెక్షన్ల వారీగా, మొత్తం సగటు కటాఫ్‌లను పేర్కొంటున్నాయి.
 
 రిఫరెన్స్ బుక్స్
 క్వాంటిటేటివ్ ఎబిలిటీ
 1) ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ - ఆర్.ఎస్.అగర్వాల్.
 2) పియర్సన్ గైడ్ టు క్వాంటిటేటివ్ ఎబిలిటీ - నిషిత్ సిన్హా
 వెర్బల్ ఎబిలిటీ/లాజికల్ రీజనింగ్.
 1) వెర్బల్ ఎబిలిటీ- అరుణ్ శర్మ.
 2) వర్డ్ పవర్ మేడ్ ఈజీ - నార్మన్ లూయిస్.
 డేటా ఇంటర్‌ప్రిటేషన్
 1) అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ - బి.ఎస్.సిజ్వాల్
 2) హౌ టు ప్రిపేర్ ఫర్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ ఫర్ క్యాట్-టాటా మెక్‌గ్రాహిల్, అరిహంత్ ప్రకాశన్.
 3) వెర్బల్ అండ్ నాన్-వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement